లాంచీ ప్రమాద ఘటనపై సీఎం బాబు వ్యాఖ్యలివీ..

Updated By ManamWed, 05/16/2018 - 20:34
AP CM Chandrababu Naidu Speaks To Media Over Devipatnam Boat Incident || East Godavari Dist

AP CM Chandrababu Naidu Speaks To Media Over Devipatnam Boat Incident

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా మంటూరు, పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి మధ్య గోదావరిలో మంగళవారం సాయంత్రం ఘోర లాంచీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగి 24గంటలు గడుస్తున్నా అసలు లాంచీలో ఎంతమంది ప్రయాణించారు..? ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు? ఎంతమంది మృతిచెందారు..? అనే ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానాలు దొరికేలా లేవు. అయితే మంగళవారం సాయంత్రం నుంచి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లు, స్థానికంగా ఉన్న గిరిజనులు శతవిధాలా ప్రయత్నాలు చేసి లాంచీ ఎక్కడుందో కనుగొన్నారు. అనంతరం ప్రమాదంలో మృతిచెందిన వారిని వెతికి 22 మృతదేహాలను బయటికి తీయడం జరిగింది. 

ఈ ప్రమాదం జరిగినప్పట్నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా బుధవారం మధ్నాహ్నం ఘటనాస్థలికే వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ తప్పిదానికి ప్రకృతి ప్రతికూలత తోడవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బలమైన ఈదురు గాలులు రావడంతో ఘోరం జరిగిపోయిందన్నారు. ప్రమాదాలను ముందే అంచనావేసే సాంకేతిక వ్యవస్థ అందుబాటులో ఉందని, దాన్ని వినియోగించుకొని ప్రమాదాల నివారణకు కృషిచేస్తున్నట్టు తెలిపారు.

ప్రమాద ఘటన సీఎం ప్రకటన ఇదీ..
"
ఈ ఘోర ప్రమాదంలో 22 మంది మృతిచెందారు. 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున పరిహారం ప్రకటిస్తున్నాం. ప్రస్తుతానికి తక్షణసాయంగా రూ.లక్ష ఇస్తాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.  వారికి ఇళ్లు నిర్మిస్తాం.. ఇళ్లుతో పాటు చదువుకున్నవారు ఉంటే వారికి ఉద్యోగం కల్పిస్తాము. దేవీపట్నానికి రహదారి సహా కనీస సౌకర్యాలు ఏర్పాటు కల్పిస్తాం. ప్రమాద సమయంలో లాంచీలో 44 మంది ప్రయాణిస్తున్నారు. లాంచీలో తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు 37 మంది కాగా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారు ఏడుగురు ఉన్నారు. బాధితుల్లో 26 మంది పురుషులు, 17 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ 44 మందిలో ముగ్గురు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ప్రమాద సమయంలో 22 మంది సురక్షితంగా బయటపడ్డారని.. ఇప్పటివరకు 22 మృతదేహాలను గుర్తించామని, మిగిలిన మృతదేహాల వెలికితీత కొనసాగుతోందని సీఎం స్పష్టం చేశారు. కాగా ఈ సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, నేవీకి చెందిన మొత్తం 126 మంది సిబ్బంది నిమగ్నమయ్యారని ఆయన చెప్పారు. అరగంట ముందు ముందస్తు ప్రమాద హెచ్చరిక సూచనలు పంపించామని.. అయితే లాంచీలో కమ్యూనికేషన్‌ వ్యవస్థ లేదన్నారు. హెచ్చరికను అందుకొనే సమాచార వ్యవస్థ లాంచీలో లేదని సీఎం వివరించారు.

ఇదిలా ఉంటే.. ఘటనా స్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. లాంచీలో ఉన్న తమవారి ఆచూకీ కోసం మంగళవారం నుంచి వేయికళ్లతో ఎదురుచూసిన స్థానికులు మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్నారు. మృతుల కుటుంబీకులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. కాగావెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పోస్టుమార్టం చేసి స్వస్థలాలకు తరలిస్తున్నారు.

AP CM Chandrababu Naidu Speaks To Media Over Devipatnam Boat Incident || East Godavari Dist

English Title
AP CM Chandrababu Naidu Speaks To Media Over Devipatnam Boat Incident || East Godavari Dist
Related News