oneday cricket

నేటి నుంచి ఇంగ్లాండ్‌తో వన్డే సమరం

Updated By ManamThu, 07/12/2018 - 00:30
  • నాటింగ్‌హామ్‌లో ఇవాళ తొలి మ్యాచ్

  • నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు కోహ్లీ!

  • సాయంత్రం 5 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్-3లలో ప్రత్యక్ష ప్రసారం

imageనాటింగ్‌హామ్: టీ20 సిరీస్ గెలుచుకున్న ఉత్సాహంతో ఉన్న టీమిండియా గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో  ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్‌పై మరో సారి ఆధిపత్యం ప్రదర్శించి వచ్చే ఏడాది ఇదే సమయంలో జరిగే వన్డే ప్రపంచ కప్‌కు రిహార్సల్‌లా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని ఉత్సాహంతో ఉంది.   టీ-20ల్లో ఇంగ్లాండ్‌ను 2-1 తేడాతో ఓడించి భారత్ ఈ సిరీస్‌కు సిద్ధమైతే.. ఆస్ట్రేలియాను  6-0 తేడాతో వన్డేల్లో చిత్తు చేసిన ఇయార్ మోర్గాన్ సేన కోహ్లీ సేనతో వన్డే పోరుకు సై అంటోంది.  అద్భుతమైన ఆటతో వన్డేల్లో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఇంగ్లాండ్ సేన దూకుడుకు బ్రేకులేయటం ఇండియాకు అంత సులువు కాకపోవచ్చు. బట్లర్, జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్‌లకు తోడు బెన్‌స్టోక్‌లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. 2015 నుంచి ఇప్పటి వరకూ ఆడిన 69 వన్డేల్లో 46 మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లాండ్ భారత్‌కు సవాల్ విసురుతోంది.

వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్‌లో పలు ప్రయోగాలు చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఓపెనర్ కె.ఎల్.రాహుల్ భీకరమైన ఫామ్‌లో ఉండటంతో కెప్టెన్ కోహ్లీని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని టీమ్ మేనేజ్‌మెంట్ యోచిస్తోంది.  టాపార్డర్‌లో రాహుల్, ధావన్, రోహిత్‌శర్మలు బ్యాటింగ్ భారం మోస్తుండగా... సురేశ్‌రైనా, ధోనీతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మిడిలార్డర్‌లో ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. చాహల్, కుల్దీప్ యాదవ్‌లు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు భారత్ స్పిన్ పవరేమిటో చూపెట్టబోతున్నారు.వెన్నెముక గాయం తో ఉన్న భువనేశ్వర్ కుమార్ కోలుకుంటే ఉమేశ్‌యాదవ్‌తో కలసి కొత్త బంతిని పంచుకునే అవకాశముంది.





Related News