అలస్కాలో భారీ భూకంపం

అలస్కాలో భారీ భూకంపం

అమెరికాలోని అలస్కా ద్వీపకల్పంలో ఇవాళ భారీ భూకంపం చోటుచేసుకుంది. అమెరికాకు సునామీ ప్రమాదం పొంచి ఉంది.. సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం కారణంగా అమెరికాకు సునామీ ప్రమాదం ఉందని.. ఆ దేశ సముద్ర, వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ సంభ‌వించిన భూకంపం తీవ్ర‌త‌ రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 11:12 సమయంలో భూమి కంపించింది. అలస్కాలోని పెర్రివిల్లెకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో 9 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమైంది. భూకంపం నేపథ్యంలో దక్షిణ అలస్కా, అలస్కా ద్వీపకల్పంతో పాటు అలూటియన్ దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సమీపంలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరికలు పంపారు. అలస్కా అమెరికాకు చెందిన భూభాగమే అయినప్పటికీ... అలస్కాకు, ప్రధాన అమెరికా భూభాగానికి మధ్య కెనడా ఉంటుంది. అయితే అమెరికా, కెనడా ఫసిఫిక్ తీరప్రాంతం, నార్త్ అమెరికాలకు మాత్రం సునామీ ప్రమాదం అంతగా ఉండదని అధికారులు తెలిపారు.