జులై 2న తెలంగాణ మంత్రివ‌ర్గ కీల‌క భేటీ 

జులై 2న తెలంగాణ మంత్రివ‌ర్గ కీల‌క భేటీ 

జులై 2వ‌తేదీన తెలంగాణ మంత్రివ‌ర్గ కీల‌క స‌మావేశం జ‌రుగ‌నుంది. లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన త‌ర్వాత తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజు రోజుకు కరోనా కేసులు విప‌రీతంగా  పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా క‌రోనా ప‌రీక్ష‌ల‌ను పెద్ద ఎత్తున చేయిస్తోంది. అయితే సీఎం కేసీఆర్ అధ్యక్షతన జులై 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 
ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తరహాలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 15 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ విధించాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్ప‌టికే నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈనేప‌థ్యంలో లాక్‌డౌన్‌లో భాగంగా అత్యంత కఠినంగా కర్ఫ్యూ విధించాలని, రోజుకు కేవలం గంటా రెండు గంటలు మాత్రమే నిత్యావసరాల కోసం సడలింపు లివ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాల‌న్నింటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే రెండోసారి లాక్ డౌన్ ఎలా విధిస్తార‌నేది మంత్రివ‌ర్గ స‌మావేశం త‌ర్వాత తెలియ‌నుంది.