విశాఖలో మ‌రోసారి గ్యాస్ లీక్ : ఇద్ద‌రు మృతి

విశాఖలో మ‌రోసారి గ్యాస్ లీక్ : ఇద్ద‌రు మృతి

విశాఖ‌లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మ‌రువ‌క ముందే మరో గ్యాస్ లీక్ కావడంతో ఏపీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విశాఖప‌ట్నం జిల్లా ప‌ర‌వాడ‌లో మరోసారి గ్యాస్ కలకలం రేపింది. గతంలో పాలిమర్స్ లో గ్యాస్ లీకవగా, ఈ దఫా ఫార్మా కంపెనీలో ఘటన చోటుచేసుకుంది. సాయినార్ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి రసాయన వాయువు లీక్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాయువు పీల్చిన వారిని గాజువాక ఆస్పత్రిలో చికిత్స తరలించారు. వీరిలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. 
విశాఖ జిల్లాలోని స్టైరీన్‌ ఘటన మరిచిపోక ముందే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీక్‌ కావడంతో ఇద్దరు మృతి చెందారు. సాయినార్‌ ఆఫ్‌ సైన్సెస్‌ కంపెనీలో గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను షిప్ట్‌ ఇంచార్జి నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిని చంద్రశేఖర్‌, అనంద్‌బాబు, జానకీరామ్‌, సూర్యనారాయణగా గుర్తించారు. హెల్పర్‌ చంద్రశేఖర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లీకైన గ్యాస్‌ను బెంజిమెడిజోల్‌ వేపర్‌గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి కలెక్టర్ వినయ్ చంద్ చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించించారు. కలెక్టర్ తోపాటు ఏడీసీపీ సురేష్ బాబు కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. గ‌త రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే విశాఖ‌ప‌ట్నం జిల్లాలో రెండు గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఈ గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌ల‌తో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని విశాఖవాసులు  భ‌యంతో వణికిపోతున్నారు.