శ్రావణి కేసు : లొంగిపోయిన నిర్మాత అశోక్‌రెడ్డి

శ్రావణి కేసు : లొంగిపోయిన నిర్మాత అశోక్‌రెడ్డి

నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈకేసులో ఏ 3 నిందితుడు అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఏసీపీ తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఎస్సార్‌ నగర్‌ పీహెచ్‌సీకి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు.
శ్రావ‌ణికి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి అశోక్‌రెడ్డి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు శ్రావణి, దేవరాజ్‌తో క్లోజ్ అవ్వడం అశోక్‌రెడ్డికి నచ్చలేదు. దీంతో అశోక్‌రెడ్డి శ్రావణిని శారీరకంగా హింసించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి పాత్ర కీలకంగా ఉందని పోలీసులు గుర్తించారు. 
 ఈ కేసులో ఆమెను మానసికంగా వేధించి ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు నిందితులు దేవరాజ్, సాయి క్రిష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దేవరాజ్, సాయి క్రిష్ణారెడ్డితో పాటు నిర్మాత అశోక్ రెడ్డి కూడా నిందితుడని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఇప్పటికే ఏ 1 గా దేవ్‌రాజ్‌ రెడ్డి, ఏ 2 గా సాయికృష్ణారెడ్డిలు పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, అశోక్‌రెడ్డి ఆర్‌ఎక్స్‌ 100 సినిమా నిర్మాత అన్న సంగతి తెలిసిందే. ఏసీపీ తిరుపతన్న అశోక్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం నిందితుడిని ఎస్సార్‌ నగర్‌ పీహెచ్‌సీకి తరలించారు. ఆ పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది.