ప్రొసీడింగులపై స్టే

Updated By ManamMon, 10/15/2018 - 22:13
ilfs
  • ఐ.ఎల్ అండ్ ఎఫ్.ఎస్ గ్రూప్‌కు ఊరట

  • 90 రోజుల మారటోరియంపై రుణ దాతలు అభిప్రాయాలు తెలుపాలన్న అప్పిలేట్ ట్రైబ్యునల్ 

ilfsన్యూఢిల్లీ: ఐ.ఎల్ అండ్ ఎఫ్.ఎస్, ఇతర గ్రూప్  కంపెనీలపై ప్రొసీడింగులన్నింటిపైన తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్  సోమవారం స్టే మంజూరు చేసింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ మేరకు అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆ ఆదేశాలు జారీ చేసింది. ఐ.ఎల్ అండ్ ఎఫ్.ఎస్, దాని అనుబంధ సంస్థలు తీసుకున్న రుణాల వసూలుపై 90 రోజుల మారటోరియం కోసం మంత్రిత్వ శాఖ చేసిన అభ్యర్థనను అంతకుముందు  లా ట్రైబ్యునల్ ముంబై ధర్మాసనం తిరస్కరించడంతో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆదేశించింది. ప్రభుత్వం 90 రోజుల మారటోరియం కోసం చేసిన అభ్యర్థనపై జవాబులు దాఖలు చేయవలసిందిగా  ఐ.ఎల్ అండ్ ఎఫ్.ఎస్‌కు చెందిన ఐదుగురు అగ్ర రుణ దాతలను జస్టిస్ ఎస్.జె. ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల అప్పిలేట్ ట్రైబ్యునల్ ధర్మాసనం కోరింది. ఐ.ఎల్ అండ్ ఎఫ్.ఎస్, దాని 348 అనుబంధ సంస్థలపై ఏ కోర్టులోకానీ, ట్రైబ్యునల్‌లో కానీ తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఎలాంటి విచారణ చేపట్టకూడదని ధర్మాసనం ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను అప్పిలేట్ ట్రైబ్యునల్ నవంబర్ 13కు వాయిదా వేసింది. ఐ.ఎల్ అండ్ ఎఫ్.ఎస్‌కు చెందిన ఇతర రుణ దాతలు కూడా దావాలు వేయకుండా సంయమనం పాటించేట్లుగా చూడవలసిందని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ప్రభుత్వం కోరింది. మారటోరియం మంజూరు చేయకపోతే దేశవ్యాప్తంగా 70 నుంచి 80 వ్యాజ్యాలు కంపెనీకి వ్యతిరేకంగా దాఖల య్యే అవకాశం ఉందని ఐ.ఎల్ అండ్ ఎఫ్.ఎస్ తరఫు న్యాయవాది అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు నివేదించారు. రుణాల ఊబిలో కూరుకుపోయిన కంపెనీకి సత్వర పరిష్కార ప్రణాళిక సృష్టించడానికి నూతన డైరెక్టర్ల బోర్డుకు ఈ మారటోరియం సహాయపడగలదని భావిస్తున్నారు.

Tags
English Title
Stay on Procedures
Related News