చివరి గింజ వరకూ కొంటం

Updated By ManamThu, 05/31/2018 - 02:35
eetala
  • 33 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం.. తడిచిన ధాన్యాన్నీ కొనుగోలు చేశాం

  • రేషన్ బియ్యం అమ్ముకోవద్దు

  • అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ పెడుతం.. ప్రజలు సహకరించాలి: మంత్రి ఈటల

eetalaహైదరాబాద్: వ్యవసాయం బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని, అందుకోసమే రైతులు పండించిన చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆర్థిక , పౌర సరఫరా శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కొనుగోలుతోపాటు రైతులు పండించిన పంటకు మంచి ధర అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బుధవారం సచివాలయంలో రైస్ మిల్లర్లతో సమావేశమై ధాన్యం సేకరణ, బియ్యం తిరిగి ప్రభుత్వానికి చెల్లించే అంశంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ అనునిత్యం రైతుల కోసం ఆరాటపడుతున్నారని, వారి బాగుకోసమే ప్రతి నీటిబొట్టును వినియోగించుకుని ఆయకట్టుకు నీరందిస్తున్నారని తెలిపారు.  ఈ ఏడాది రబీలో బ్రహ్మాండంగా పంటలు పండడంతో రైతుల కండ్లలో సంతోషం చూస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు చేయడానికి 3308 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సీజన్‌లో 35 ల క్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే 33 ల క్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు సృష్టించామన్నారు. 10 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోయినా రైతులు ఇబ్బంది పడకుండా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు బిల్లులు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైస్ మిల్లర్స్ కస్టమ్ మిల్లింగ్ రైస్ కూడా వెంటనే తిరిగి వచ్చేటా చర్యలు తీసుకున్నామన్నారు. దీని వల్ల డిపార్మెంట్ అప్పులు కట్టకుండా కాపాడగలుగుతున్నామని తెలిపారు. సివిల్ సప్లై కార్పొరేషన్ అంతర్గత సామర్థ్యం పెరిగిందన్నారు. నష్టాలు తగ్గించగలిగామని తెలిపారు. నాలుగేండ్లలో శాఖను ప్రక్షాళన చేసి అక్రమాలు అరికట్టామన్నారు. ఈ పాస్ మిషన్ల వల్ల బియ్యం అక్రమ రవాణ ఆగిందని, అక్రమాలు చేసే వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నామని, పేదవాడి బియ్యం దళారుల పాలు కాకుండా ఉండాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. కేంద్రం 1.91 కోట్ల మందిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు (బీపీఎల్)గా గుర్తిస్తే, తెలంగాణ 2.74 కోట్ల మందిని పేదవారిగా గుర్తించి కాప్ లేకుండా బియ్యం అందిస్తుందన్నారు. బియ్యం తినకపోతే తీసుకోకండని, పీడీఎస్ బియ్యం తినేవారూ ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఒక కిలో బియ్యం రూ. 35 ఖర్చు చేసి ప్రజలకు అందిస్తే, రూ. 5 లేదా రూ. 6కు బ్రోకర్లకు అమ్ముకోవడం వల్ల ఎంతో నష్టం జరుతుందన్నారు. బియ్యం తీసుకోని వారి కార్డు పోకుండా చూసేందుక చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారు ప్రభుత్వం దృష్టి తీసుకువస్తే రేషన్ కార్డుపై స్టాంప్ వేసి ఇస్తామన్నారు. కడుపు నిండా అన్నం పెట్టాలన్న ప్రభుత్వం ప్రయత్నానికి అడ్డుపడుతున్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. రేషన్ డీలర్ల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉందని, సివిల్ సప్లై కమిషనర్ వారితో చర్చలు జరుపుతారని తెలిపారు. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం నిరంతర ప్రక్రియ అని, 2 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అన్నింటినీ పరిశీలించి అర్హులైన వారందరికీ తెల్ల కార్డులు అందిస్తామన్నారు.

Tags
English Title
Until the last nut
Related News