చేనాను తాకిన సూపర్ టైపూన్

Updated By ManamSun, 09/16/2018 - 22:22
china
  • 24 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

  • గ్వాంగ్‌డాంగ్‌ను తాకిన మంగ్‌ఖుట్ టైపూన్

  • ఫిలిప్పీన్స్‌కు కోలుకోలేని దెబ్బ

  • వివిధ ప్రమాదాల్లో 64 మంది మృతి

  • ఉత్తర కరోలినాలో కొనసాగుతున్న బీభత్సం

chinaబీజింగ్/ట్యగెగారో: ఫిలిప్పీన్స్‌లో బీభత్సం సృష్టించిన మంగ్‌ఖుట్ సూపర్ టైపూన్ ఆదివారం చైనాను తాకింది. దేశ దక్షిణ ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలోని జియాంగ్‌మెన్ నగరం వద్ద తీరం దాటింది. టైపూన్ ప్రమాద తీవ్రత నేపథ్యంలో 24 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 400 విమానాల రద్దు చేశారు. సముద్రంలో చేపల వేటకువెళ్లిన 48 వేల జాలర్ల బోట్లను వెనక్కి రప్పించారు. గంటకు 162 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే రక్షణ చర్యలు ప్రారంభించారు. కాగా,  ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరంలో అతి పెద్దదైన మంగ్‌ఖుట్ టైపూన్ సూపర్ టైఫూన్ ధాటికి ఫిలిప్పీన్స్ ఉత్తర తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. అత్యధిక ప్రభావం పడిన లుజాన్ దీవితో పాటు ఇతర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఆదివారంనాటికి 64కి చేరుకుందని అధికారులు తెలిపారు.  అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 50 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు అంచనా వేశారు. ఫిలిప్పీన్స్‌లో బీభత్సం సృష్టించిన టైపూన్ తన దిశను మార్చుకుని హాంగ్‌కాంగ్, చైనా దిశగా ప్రయాణించడం ప్రారంభించింది. ఆదివారం సాయంత్రానికి  చైనా తీరాన్ని తాకింది. 20 అడుగుల ఎత్తు వరకు సముద్ర అలలు ఎగిసిపడు తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు, అమెరికాలోని ఉత్తర కరోలినా కూడా భీకర హరికేన్ ‘ఫ్లారెన్స్’ ధాటికి విలవిలలాడుతోంది. వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేవీ, కోస్ట్‌గార్డ్, పౌర, స్వచ్ఛంద సేవా బృందాలు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగాయి. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరిందని అధికారులు తెలిపారు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. దాంతో ఉత్తర కరోలినాలోని నదులన్నీ ప్రమాదస్థాయిని మించి పొంగిపొర్లుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఒక్కరోజే 60 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిందని తెలిపారు. 

Tags
English Title
Super tupo touching me
Related News