సెవెన్త్ వండ‌ర్స్ ( స్పెష‌ల్ ఆర్టిక‌ల్‌)

Updated By ManamThu, 05/03/2018 - 18:38
7th wonders

7th'రంగ‌స్థ‌లం'.. తెలుగు నాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న తాజా చిత్రం పేరిది. 1980ల నాటి గ్రామీణ వాతావ‌ర‌ణంతో.. అక్క‌డి రాజ‌కీయాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా.. ద‌ర్శ‌కుడిగా సుకుమార్ ప్ర‌తిభ‌ని మ‌రోసారి చాటింది. అంతేగాకుండా.. ఆయ‌న కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 7వ చిత్రం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ఏడో చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఇలానే సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. కెరీర్ బెస్ట్ హిట్‌గా నిల‌వ‌డ‌మో.. ట‌ర్నింగ్ పాయింట్‌గా నిల‌వ‌డ‌మో జ‌రిగిన సంద‌ర్భాలున్నాయి. అలాగే వారి కెరీర్‌లో మంచి విజ‌యాలు అందించ‌డ‌మో జ‌రిగింది.  ఓ సారి ఆ ప్ర‌ముఖుల 7వ సినిమాల‌ వైపు దృష్టి పెడితే..

నంద‌మూరి తార‌క రామారావు
న‌ట సార్వ‌భౌముడు ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానంలోనే కాదు, తెలుగు సినిమా చరిత్ర‌లోనూ 'పాతాళ భైర‌వి'ది చెర‌గ‌ని స్థానం. ఈ సినిమాలో తోట రాముడు పాత్ర‌లో ఆయ‌న చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. కె.వి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. న‌టుడిగా ఈ సినిమా.. ఎన్టీఆర్‌కు ఏడ‌వ చిత్రం.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు
మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కెరీర్‌లో 'బాల‌రాజు' చిత్రం ప్ర‌త్యేకం. ఈ సినిమాతో న‌టుడిగా ఏఎన్నార్ స్థాయి మ‌రింత పెరిగింది.  విజ‌య‌వాడ‌లో ఏడాది పాటు ఆడిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ద ప‌లు రికార్డుల్ని సృష్టించింది. ఈ సినిమా.. త‌న‌ కెరీర్‌లో ఏడ‌వ చిత్రం కావ‌డం విశేషం.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌
ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల‌లో 'ఖుషి' ఒక‌టి. ఆడియో ప‌రంగానూ.. సినిమా ప‌రంగానూ అనేక సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం.. ప‌వ‌న్ ఇమేజ్‌ను అమాంతం ఎన్నో రెట్లు పెంచింది.  అలాంటి 'ఖుషి'.. ప‌వ‌న్ కెరీర్‌లో ఏడ‌వ సినిమా కావ‌డం విశేషం.

మ‌హేశ్ బాబు, భూమిక‌, గుణ‌శేఖ‌ర్‌
'ఒక్క‌డు'.. మ‌హేశ్ బాబు కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిన చిత్రం పేరిది. అప్ప‌టివ‌ర‌కు మ‌హేశ్‌కున్న ఇమేజ్‌ను పూర్తిగా మార్చివేయ‌డ‌మే కాకుండా.. రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను మూట‌గ‌ట్టుకుంది. మ‌హేశ్‌కు స్టార్ డ‌మ్ తీసుకువ‌చ్చిన ఈ సినిమా.. ఆయ‌న కెరీర్‌లో ఏడ‌వ చిత్రం. అలాగే క‌థానాయిక భూమిక‌, ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్‌లోనూ ఇది ఏడో చిత్రం కావ‌డం విశేషం.

ఎన్టీఆర్‌
తాత‌య్య ఎన్టీఆర్‌కు ఏడ‌వ చిత్రం 'పాతాళ భైర‌వి' ఏ విధంగానైతే ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిందో.. అలాగే మ‌న‌వ‌డు ఎన్టీఆర్‌కు కూడా అత‌ని ఏడో చిత్రం మంచి బ్రేక్‌ను అందించిన సినిమా కావ‌డం యాదృచ్ఛిక‌మైనా ఓ విశేషంగానే చెప్పుకోవాలి. ఇంత‌కీ ఆ చిత్ర‌మేమిటంటే.. 'సింహాద్రి'. తార‌క్ ద‌శ‌ను, దిశ‌ను మార్చివేసిన ఈ సినిమా.. అప్ప‌ట్లో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచింది.

రాజ‌మౌళి
'బాహుబ‌లి' సిరీస్‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌తిభాపాట‌వాలు ఖండాంత‌రాలు దాటినా.. ఆయ‌న కెరీర్‌ను కీల‌క మలుపు తిప్పిన సినిమా మాత్రం 'మ‌గ‌ధీర' అనే చెప్పాలి.  జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కూడా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా ముందుందని చాటి చెప్పిన ఈ చిత్రం.. ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి స్థాయిని అమాంతం పెంచింది. అలాంటి 'మ‌గ‌ధీర‌'.. రాజ‌మౌళి కెరీర్‌లో ఏడో చిత్రం కావ‌డం విశేషం.

శ్రియ‌
కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా.. ఆడ‌పాద‌డ‌పా అభిన‌యానికి పాత్ర‌ల్లోనూ క‌నిపించి మెప్పించిన క‌థానాయిక శ్రియ‌. 'సంతోషం'తో తొలి హిట్‌ను అందుకున్న శ్రియ‌.. బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది మాత్రం చిరంజీవి హీరోగా న‌టించిన 'ఠాగూర్' సినిమాతోనే. న‌టిగా ఆమెకిది ఏడో చిత్రం కావ‌డం విశేషం.

స‌మంత‌
తొలి చిత్రం 'ఏమాయ చేసావె'తోనే విజ‌యం అందుకున్న స‌మంత‌కి.. క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన‌ 'దూకుడు'నే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అప్ప‌టికే ఆరు సినిమాల్లో న‌టించిన స‌మంత‌కు ఇది ఏడో సినిమా. మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో సౌత్ క్వీన్‌గా నిలిచిన స‌మంత‌కు.. ఆ క్ల‌బ్‌లో తొలిసారిగా స్థాన‌మిచ్చిన చిత్రం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

శ్రుతి హాస‌న్‌
లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న‌య‌గా ప‌రిచ‌య‌మైన శ్రుతి హాస‌న్‌కు తెలుగు, హిందీ, త‌మిళ్‌.. ఇలా మూడు భాష‌ల్లో చేసిన మొద‌టి ఆరు సినిమాలు వ‌రుస‌గా ప‌రాజ‌యాల‌నే అందించాయి. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ జోడీగా నటించిన 'గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రం.. క‌థానాయిక‌గా ఆమె న‌టించిన ఏడో సినిమాగా విడుద‌లై ఆమెకు క‌మ‌ర్షియ‌ల్‌గా ఘ‌న‌విజ‌యాన్ని అందించింది. దీంతో.. 7 అనేది శ్రుతి ల‌క్కీ నెంబ‌ర్‌గా మారింది. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లో త‌న ఫాలోవ‌ర్లు 7 మిలియ‌న్లకి చేరుకున్నాక‌.. 7 త‌న ల‌క్కీ నెంబ‌ర్ అంటూ మ‌రోసారి ప్ర‌స్తావించింది శ్రుతి.

వీరితో పాటు.. వెంక‌టేశ్ (శ్రీ‌నివాస క‌ళ్యాణం), రామ్ చ‌ర‌ణ్ (ఎవ‌డు), నాగ‌చైత‌న్య (మ‌నం), అనుష్క (ల‌క్ష్యం), కృష్ణ‌వంశీ (మురారి), పూరీ జ‌గ‌న్నాథ్ (అమ్మ‌ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి), వి.వి.వినాయ‌క్ (లక్ష్మీ), ఎ.క‌రుణాక‌ర‌న్ (డార్లింగ్‌), దిల్ రాజు (కొత్త బంగారు లోకం), త్రివిక్ర‌మ్ (స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి) వంటి సినీ ప్ర‌ముఖుల‌కు కూడా వారి వారి ఏడో చిత్రాలు మంచి విజ‌యాలు అందించ‌డం విశేషం. ఏదేమైనా.. మ‌న సినీ ప్ర‌ముఖుల్లో చాలా మందికి ఏడో సినిమాలు 'సెవెన్త్ వండ‌ర్‌'గా నిల‌వ‌డం ప్ర‌త్యేక‌మైన విష‌యంగానే చెప్పుకోవాలి.                                                                                    -మ‌ల్లిక్ పైడి

English Title
special article: seventh wonders




Related News