సెన్సెక్స్ @ 38,024

Updated By ManamThu, 08/09/2018 - 23:22
stock market
  • దలాల్ స్ట్రీట్‌లో కొనసాగుతున్న బుల్ రన్

sensexముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ మొదటిసారిగా 38,000 స్థాయిని మించి దూసుకెళ్ళింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ గురువారం ఐదో రోజు కూడా రికార్డుల ఉధృతిని కొనసాగించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి విజయ గాధ చుట్టూ అల్లుకున్న ఆశావాదం ముందు ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు దూది పింజల్లా ఎగిరిపోవడం కొనసాగింది. బ్యాంకింగ్ షేర్లు గురువారం కూడా రాణించాయి. ‘సెన్సెక్స్’ గైనర్ల జాబితాలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈక్విటీల పట్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ చెక్కుచెదరలేదనడానికి అవిచ్ఛిన్నంగా సాగిన విదేశీ, దేశీయ ఫండ్ల నగదు ప్రవాహాలే నిదర్శనం. కంపెనీలు ప్రకటిస్తున్న రాబడులు బలోపేతంగా ఉండడం కొనుగోళ్ళకు ప్రోత్సాహం లభించింది. అవెురికా దిగుమతులపై చైనా ప్రతీకార సుంకాలు ప్రకటించడంతో విదేశీ మార్కెట్లు మిశ్రమంగా సాగాయి.

అయితే, వాషింగ్టన్, బీజింగ్‌ల మధ్య తాజాగా వాణిజ్య యుద్ధ తీవ్రత పెరిగినా దలాల్ స్ట్రీట్ దాన్ని పట్టించుకోలేదు. ఆరోహణను కొనసాగించింది. బి.ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’ 38,000 పాయింట్ల అత్యున్నత శిఖరాన్ని తాకింది. అంతేకాదు. దాన్ని దాటి ముందుకెళ్ళిన స్థితిలో ముగిసింది. సెషన్ పొడుగూతా అది గ్రీన్‌లోనే కొనసాగింది. చివరకు అది136.81 పాయింట్ల లాభంతో 38,024.37 వద్ద ముగిసింది. అలా బుధవారంనాటి  37,887.56 స్థాయి ముగింపు రికార్డును బద్దలు కొట్టింది. ‘సెన్సెక్స్’ 37,000 స్థాయి శిఖరాన్ని జూలై 26న అధిరోహించింది.  అక్కడ నుంచి 38,000 పాయింట్ల శిఖరాన్ని చేరడానికి సున్నిత సూచికి 11 సెషన్లు పట్టింది. 

విస్తృతమైనదిగా భావించే  ‘నిఫ్టీ’ 20.70 పాయింట్లు పెరిగి, 11,470.70 వద్ద ముగిసింది. అది అలా బుధవారంనాటి 11,450 అత్యధిక స్థాయిని దాటింది. సెషన్ చివర్లో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడికి తలొగ్గి టెలికాం, మన్నికైన వినియోగ వస్తువులు, ఆరోగ్య రక్షణ, యంత్రాలు, యంత్ర పరికరాల తయారీ, చమురు, గ్యాస్ రంగ షేర్లు సెషన్ చివర్లో 1.31 శాతం తగ్గాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బుధవారం రూ. 568.63 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ మదుపు సంస్థలు రూ. 30.25 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశాయని తాత్కాలిక డాటా సూచించింది.

ఆగని కయ్యం
తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేరొండంటా అన్న రీతిలో వ్యవహరిస్తున్న అవెురికా, చైనాల మధ్య కయ్యం మళ్ళీ పెచ్చుమీరింది. అవెురికా దిగుమతులపై సుమారు 16 బిలియన్ డాలర్ల విలువైన ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు బీజింగ్ ప్రకటించడంతో ఏషియన్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అవెురికా స్టాక్ మార్కెట్ సూచీలు  చాలా వరకు బుధవారం తగ్గిన స్థాయిలో ముగిశాయి.

English Title
SENSEX @ 38,024
Related News