‘బంగారు’ భవిష్యత్తుకు సేవింగ్స్

savings

 ‘మనీ మేక్స్ మెనీ థింగ్స్’ అంటారు. అలా డబ్బుతో కొనదగ్గ వాటిల్లో బంగారం ఒకటి. గ్రాము బంగారం దాచిపెట్టుకున్నా.. అది ఆపద సమయంలో ఆదుకుంటుంది.. అని నమ్మి.. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారూ ఎక్కువే. పొదుపు చేసే విషయంలో బంగారంపై పెట్టుబడి అనేది ఎప్పుడూ లాభసాటే. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు పొదుపు రంగాల్లో.. క్రమం తప్పకుండా ఆదాయం రావాలని కోరుకునే వారికి ‘బంగారం’ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలూ ఉన్నాయి. బంగారాన్ని నిజంగానే కొనే అవసరం లేకుండా బంగారపు మదుపు అవకాశాల కల్పించే గోల్డ్ ఎక్సేంజ్ ఫండ్స్, డిపాజిట్ పథకాలు ఇటీవల కాలంలో మదుపరులకు లాభసాటిగా మారుతున్నాయి. అవేంటి? వాటిలో చిన్నమొత్తంతో పొదుపు పథకాలను ఎలా ప్రారంభించాలి? అలాగే చిట్‌ఫండ్ పథకాలు లాభసాటా? కాదా? ప్రయివేటు చిట్టీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాల గురించి ఈ వారం ‘రూపాయి’లో తెలుసుకుందాం... బంగారాన్ని పొదుపు మార్గంలో పెట్టేందుకు గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్, గోల్డ్ హార్వెస్ట్ స్కీం, మ్యూచ్‌వల్ ఫండ్స్, గోల్డ్ డిపాజిట్, తాజాగా జీఎంఎస్ వంటి పథకాలు చాలానే ఉన్నాయి. ఇందులో గ్రామీణ బ్యాంకుల నుంచి పట్టణస్థాయి వరకూ గోల్డ్ డిపాజిట్ పథకం గురించి ఖాతాదారులకు అంతో ఇంతో పరిచయం ఉండే ఉంటుంది.

గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ని గోల్డ్ ఈటిఎఫ్‌గా షార్ట్‌కట్స్‌లో పిలుస్తుంటారు. ఈ పథకంలో బంగారాన్ని డిపాజిట్ చేయడానికి మనదగ్గర ప్రత్యక్షంగా బంగారం ఉండాల్సిన పనిలేదు. స్థోమతను బట్టి పేపర్‌పై మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేసి, బ్యాంకుల్లో పొదుపు చేసే పద్ధతిని గోల్డ్ ఈటీఎఫ్‌గా పేర్కొంటారు. దీన్నే డీమ్యాట్ పద్ధతి అంటారు. అంటే ‘డిపాజిటరీ ఫండ్’. బ్యాంకుల్లో మాదిరిగా ప్రత్యేక పాస్‌బుక్‌లు, ఖాతాలు లేకుండా ఆన్‌లైన్ ద్వారా బ్యాంకుల్లో గోల్డ్ ఈటీఎఫ్ ఖాతాదారుడిగా చేరడానికి అవకాశం ఉంటుంది. షేర్లు కొని, మంచిధర వచ్చినప్పుడుగానీ, అవసరం మేరకుగానీ ఏవిధంగా అయితే షేర్లను బ్రోకర్ ద్వారా అమ్మడం జరుగుతుందో.. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడుల్ని అదే పద్ధతిలో సంబంధిత ఫైనాన్షియల్ బ్రోకర్ ద్వారా అమ్మకానికి పెట్టొచ్చు. ఎప్పుడంటే అప్పుడు ఈ ఖాతాను తెరవచ్చు. మార్కెట్లో గోల్డ్ ధర ఆధారంగా ఒక్కోగ్రాముని ఒక యూనిట్‌గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మార్కెట్ హెచ్చు తగ్గులు ఆధారంగా పెట్టిన పెట్టుబడిపై లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి. దీంట్లో స్వల్పంగా లాభం వచ్చినా.. దీనిలోని ప్రధానమైన సౌలభ్యం ఏమంటే.. ప్రత్యక్షంగా బంగారాన్ని కొనాల్సిన అవసరం లేదు. కనీసంగా ఒక గ్రాము బంగారం విలువ నుంచి అపరిమితంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అయితే ఇలాంటి ఈటీఎఫ్, మ్యూచ్‌వల్ ఫండ్స్ వంటి వివిధరకాల గోల్డ్ ఖాతాలు తెరిచే ముందు ఆర్థిక నిపుణుల సలహా, సూచనలు, స్వీయ అవగాహన, అధ్యయనం చాలా ముఖ్యం.

జీఎంఎస్ 
గోల్డ్ మోనిటైజ్ స్కీమ్.. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వమే స్వయంగా బ్యాంకింగ్ రంగాల ద్వారా ఈ పథకాన్ని ముందుకు తెస్తోంది. వ్యక్తిగతంగా కానీ, సంస్థాగతంగా గానీ నిరుపయోగంగా ఉన్న బంగారం నిల్వల్ని డిపాజిట్ చేయడం ద్వారా లాభాలు ఆర్జించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఆభరణాల రూపంలో ఉన్న నగలను కరిగించి, 99.5 శాతం స్వచ్ఛమైన బంగారంగా మారుస్తారు. అలా కరిగించి, రూపమిచ్చిన బంగారానికి ప్రామాణికంగా విలువకట్టి, డిపాజిట్‌దారుడికి సర్టిఫికేట్ జారీ చేస్తారు. కనీసంగా 30 గ్రాములు గరిష్టంగా ఎంతైనా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఏడాది నుంచి 15 ఏళ్ళ కాలపరిమితి వరకు బ్యాంకుల్లో దాచిపెట్టుకోవచ్చు. కాలపరిమితి ఆధారంగా ఏడాదికి 2.25 నుంచి 2.5 శాతం వడ్డీ జమ అవుతుంటుంది. మధ్యలో ఈ స్కీమ్ నుంచి వైదొలగొచ్చు. అయితే కొంత పెనాల్టీ చెల్సించాల్సి ఉంటుంది. ఖాతాదారుడు పెట్టుబడి పెట్టిన బంగారాన్ని నగదు రూపంలోగానీ, బంగారు కడ్డీ, నాణేల రూపంలోగానీ తిరిగి పొందవచ్చు. ఖాతాదారుడికి లాభం చేకూర్చే గోల్డ్ పథకాలనేవి ఆయా బ్యాంకు, కంపెనీల ఆధారంగా వాటి రూపం, స్వరూపాలు మారుతూ ఉంటాయి. పైన పేర్కొన్న కొన్ని అంశాలు, ఆయా బంగారు పథకాల వివరాలు పాఠకుల అవగాహన కోసం మాత్రమే. బంగారంతో పొదుపు పథకాలు ప్రారంభించే ముందు ఆర్థిక నిపుణుల సూచన, సలహాలు అవసరమని మర్చిపోవద్దు!

గోల్డ్ డిపాజిట్ పథకం
ప్రజలు, వివిధ సంస్థలు నేరుగా తమ బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకుని, వడ్డీ రూపంలో లాభం పొందడం ఈ పథకానికున్న ప్రధాన లక్షణం. కనీసంగా 30 గ్రాముల 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారంతో పథకంలో చేరవచ్చు. గరిష్టంగా ఎంతైనా దాచుకోవచ్చు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక పద్ధతిలో బంగారం డిపాజిట్ చేసుకునే సౌలభ్యం ఉంది. బంగారాన్ని బ్యాంకులో ఉంచే కాలవ్యవధిని బట్టి 2.25 నుంచి 2.5 శాతం వడ్డీని బ్యాంకులు చెల్లిస్తాయి.

Tags

సంబంధిత వార్తలు