రహదారులు రక్తసిక్తం

Updated By ManamTue, 10/23/2018 - 06:58
accident
  • ఏపీలో వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృతి

  • మృతుల్లో 9 మంది మహిళలు, ఓ చిన్నారి

  • 16 మందికి గాయాలు.. ఆరుగురు విషమం

  • విశాఖ, గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు

accidentకాకినాడ/పిఠాపురం/పాడేరు/తణుకు: రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం ఒకేరోజు రాష్ట్రంలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే కుటుంబాలకు చెందిన వారు మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. 

గృహప్రవేశానికి వెళ్లి వస్తూ.. 
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు జాతీయ రహదారి 216 కోటలంక చెరువు వద్ద లోడుతో వస్తున్న టిప్పర్ లారీ.. టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవరుతో సహా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 11 ఏళ్ల చిన్నారి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. క్షతగాత్రులను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా ఆటో డ్రైవరు ఆళ్ల సంతోష్ (30), మరో మహిళ సబ్బవరపు వరహాలు(30) మృతి చెందారు. మెరుగైన వైద్యం కోసం మిగిలిన 8 మంది క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్నం జిల్లా మాకవారిపాలెం మండలం జి.వెంకటాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారంతా కాకినాడలోని కంచం అప్పారావు గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చారు. భోజనాలు ముగించుకుని మధ్యాహ్నం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆటో గొల్లప్రోలు మండలం చేబ్రోలు కోటలంక చెరువు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న గవిరెడ్డి రాము (35), సబ్బవరపు నూకరత్నం (పాప)(30), సబ్బవరపు పైడితల్లి (40), సబ్బవరపు మహాలక్ష్మి (40), సబ్బవరపు అచ్చియ్యమ్మ (50), పైలా లక్ష్మి (42) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులలో చింతల సత్యవతి, సబ్బవరపు సత్యవతి, సబ్బవరపు నూకాలమ్మ, చింతల నూకరాజు, భీమిరెడ్డి నాగరాజు, చింతల రామచంద్ర, సబ్బవరపు ఏసుపాదం, చింతల లక్ష్మి, పాప పైలా రోహిణి  ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ సాయిదత్త, జనసేన జనబాట రాష్ట్ర కన్వీనర్ పంతం నానాజీలు డిమాండ్ చేశారు. టిప్పర్ లారీ డ్రైవర్ రాంగ్‌రూట్‌లో రావడం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాధమికంగా నిర్ధారణ అయిందని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. లారీ డ్రైవర్  పరారీలో ఉన్నాడు. క్షతగాత్రుల్లో ఎక్కువమంది తలకు గాయాలయ్యాయి. కాళ్లు, చేతులు విరిగడం వంటి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సంఘటనపై హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విచారం వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబాలకు  చంద్రన్న భీమా పథకం ద్వారా రూ.5 లక్షలు పరిహారం అందిస్తామని చినరాజప్ప ‘మనం’ ప్రతినిధికి తెలిపారు. 

విశాఖ ఏజన్సీలో ప్రమాదం
విశాఖ ఏజన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్‌లో ఆటో బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. పాడేరు మండలం వంటలమామిడి సమీపంలోని మలుపువద్ద ప్రమాదం జరిగింది. పాడేరు మాజీ ఎంపీపీ సునారి వెంకటరమణ కుమారుడు సునారి అంబేద్కర్ విశాఖ నగరంలోని పెం దుర్తిలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. దసరా పండుగ సందర్బంగా తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆటోలో పెందుర్తికి తిరిగి ప్రయాణం అయ్యాడు. ఘాటీలోని వంట్లమామిడి సమీపంలో ఆటో బ్రేకులు పడకపోవడంతో కుడిపక్కన ఉన్న కల్వర్టు మీదకు దూసుకుపోయింది. వెంకట రమణ కుమార్తె సాయిలత (చిట్టితల్లి)(25), కోడలు మరియమ్మ (మేరి) (20) ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరియమ్మ ఆరు నెలల కుమార్తెను వైద్య సేవలు నిమిత్తం తరిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. అంబేద్కర్ తీవ్ర రక్తస్రావంతో కొనూపిరితో ఉన్నాడు. ఈ ఘటనలో ఏడాదిన్నర బాబు ఎటువంటి గాయం లేకుండా మృత్యుంజయుడిగా నిలిచాడు. ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

హైవేపై లారీలు ఢీ
పశ్చిమగోదావరి జిల్లా తేతలి జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఉంగుటూరు పరిసర ప్రాంతాలకు చెందిన 8 మంది కూలీలు విజయనగరం జిల్లా బొబ్బిలిలోని చేపల లోడింగ్‌కు ఆదివారం రాత్రి లారీలో బయల్దేరారు. ఒక ట్యాంకర్ లారీ అడ్డురావడంతో దానిని అతి వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబిన్‌లో కూర్చున్న 8 మందిలో నక్కా కాశీవిశ్వనాధం, మైనం లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన పెరుమాళ్ళ సురేష్ ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లారీ డ్రైవర్, క్లీనర్, మిగిలిన కూలీలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

Tags
English Title
Roads bleed
Related News