ప్రసాదంతోపాటు మందు బాటిళ్లు!

liquour
  • యూపీ బీజేపీ ఎంపీ నిర్వాకం

హర్దోయ్: ఓ గుడిలో పూజాదికాలు నిర్వహించిన బీజేపీ ఎంపీ, పూజ అనంతరం ఆహార పొట్లాలు పంచిపెట్టారు. తీరా అవి తెరిచి చూస్తే ఇందులో ఆహారంతో పాటు మందు బాటిళ్లు కూడా దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఆహార పొట్లాలు అందుకున్న వారిలో పెద్ద ఎత్తున చిన్నపిల్లలుండడం విశేషం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో బీజేపీ ఎంపీ నితిన్ అగర్వాల్, ఆయన తండ్రి నరేష్ అగర్వాల్ స్థానిక శ్రవణా దేవి మందిరంలో పూజ నిర్వహించాక.. కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన వారందరికీ ఆహారం డబ్బాలు అందించారు. ఇందులో పూరి, కూర, మిఠాయితో పాటు మందు బాటిళ్లు కనిపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతూ.. మొత్తం విషయాన్ని సీఎం ఆదిత్యానాథ్‌తో పాటు పార్టీ పెద్దలకు లేఖ ద్వారా చేరవేశారు. దురదృష్టకరమైన ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు, ఇంత పెద్ద ఎత్తున మందు బాటిళ్లు పంపిణీ చేయడం సంబంధిత అధికారుల దృష్టికి ఎలా రాలేదంటూ బీజేపీ ఎంపీ అన్షుల్ వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు.  గతంలో చిన్న పిల్లలకు పుస్తకాలు, పెన్నులు విస్తృతంగా పంచేవారని వర్మ గుర్తుచేశారు. మరోవైపు ఆహార పొట్లాల పంపిణీపై వేదిక  నుంచి వివరంగా ప్రకటన చేసిన నితిన్ అగర్వాల్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తండ్రీ కొడుకులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.

Tags

సంబంధిత వార్తలు