ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి

Updated By ManamThu, 07/12/2018 - 00:19
ktr
  • భారీ ఎకో పార్కు ప్రారంభించిన కేటీఆర్

ktrహైదరాబాద్ సిటీ: మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమస్ఫూర్తిగా తీసుకోవాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. బుధవారం హైదరాబాద్.. గచ్చిబౌలి, కొత్తగూడలో బొటానికల్ గార్డెన్‌లో నిర్మించిన 12 ఎకరాల ఎకో పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ దేశంలోనే ముందుకు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు.  దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని, ఇటీవల అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాళ్లు మూతులకు మాస్కులు కట్టుకొని ఆడారని తెలిపారు. భవిష్యత్‌లో ఈ పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన  మంత్రి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ బెస్ట్ అన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో హైదరాబాద్‌కు గుర్తింపు వచ్చిందన్నారు. మెట్రో, ఫ్లైఓవర్స్ ఎన్ని వచ్చినా..ప్రజల సహకారంతో క్లీనింగ్ లేకపోతే ఎంత అభివృద్ధి చేసినా శూన్యం అన్నారు. పర్యావరణాన్ని కాపాడే హక్కు ప్రతి ఒక్కరిది అన్నారు. హరితహారం వచ్చే ఎన్నికల క్రమంలో ప్రచారం చేసేది కాదని, ఓ మంచి పని చేసేందుకు సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. హరితహారాన్ని విజయవంతం చేయాలని కేటీఆర్ సూచించారు. నాటిన మొక్కల్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. పూర్తిస్థాయిలో నిబద్ధతతో హరితహారాన్ని చేపట్టాలన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి సిటీగా మన హైదరాబాద్ చేరాలంటే అందరి సహకారం ఉండాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 40 చెరువులను శుద్ధీకరించి, జల కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్‌లో మురుగునీటిని శుద్ధి చేసే పనులను వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని కేటీరామారావు ఈ సందర్భంగా తెలిపారు.  ఇందుకోసం హై టెక్నాలజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోలార్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. సిటీలో ఎల్‌ఈడీ లైట్లతో కొత్త వెలుగులు తీసుకువచ్చామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైపోతున్న చెరువులపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. తేడాలొస్తే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

Tags
English Title
Plants should be planted with the spirit of the movement
Related News