‘నీతి’ అయోగ్య!

Updated By ManamWed, 06/20/2018 - 07:33
image

imageపంచవర్ష ప్రణాళికలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రాల అవసరాల లక్ష్యంతో రూపొందించినట్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ‘నీతి ఆయోగ్’ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ నేతి బీరకాయ చందంగా మారింది. నీతి ఆయోగ్ సమావేశ ప్రారంభోపన్యాసంలో ప్రధాన మంత్రి తరచూ ప్రస్తావించే సహకార సమాఖ్య నీటి మీద రాతలా ఉందన్న విపక్షాల విమర్శలను తప్పుపట్టలేమనిపిస్తోంది. ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ నాల్గవ పాలకమండలి సమావేశంలో ప్రధాని మోదీ దూకుడుగా ‘సంస్కరణ’లను అమలు చేసి తీరుతామని కుండబద్దలు కొట్టారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనేక విధానాల మూలంగా ప్రజలు రోజురోజుకు కష్టాలు కడగండ్ల పాలవుతున్నప్పటికీ ప్రపంచీకరణ మలిదశ సంస్కరణలు కచ్చితంగా కొనసాగిస్తామని మోదీ ప్రకటించారు. బీజేపీ సర్కారు కేంద్ర ప్రణాళికా సం ఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రతిష్టించాక నిర్వహించిన పాలక మండలి సమావేశాల్లో ఈ భేటీకి చాలా ప్రాముఖ్యత ఉన్నది.

 సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన చివరి సమావేశం ఇది. ప్రధాని మోదీ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకూ అందరూ ఈ వేదికను తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. 

నీతి ఆయోగ్ ప్రసంగంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలన్నిటినీ ప్రధాని మోదీ ఏకరవు పెట్టడమే కాకుండా, జమిలి ఎన్నికల అంశంపై విస్తృత చర్చ జరగాలంటూ మరోమారు ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో వ్యవసాయరంగాన్ని ఉపాధిహామీతో అనుసంధానించే విషయంలో ముఖ్యమంత్రులు చేసిన ప్రతిపాదనకు అను గుణంగా వారి నుంచి సిఫార్సులను కోరారు. వ్యవసాయాభివృద్ధికి దోహదం చేసే విధంగా వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగంతో అనుసంధానించ డంలో రాష్ట్రాలు చొరవ చూపాలని, ప్రస్తుతమున్న 7.7 శాతం వృద్ధి రేటును రెండంకెల స్థాయికి తీసుకెళ్లడం తన లక్ష్యమని మోదీ గంభీరంగా ప్రకటిం చారు. భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లుగా వస్తున్న గ్లోబల్ అంచనాల గురించి తన ప్రసంగంలో గర్వంగా ప్రస్తావించారు. అయితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల తమ రాష్ట్రాలకు వచ్చిన న ష్టాల గురించి చంద్రబాబు, మమత, పినరయ్ విజయన్ తదితర ముఖ్యమంత్రులు సూటిగా మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలని, అభివృద్ధి పథకాలపై నిర్ణయాలను, కీలక రంగాలను రాష్ట్రాలకు వదిలివేసి అంతర్జాతీయ వ్యవహరాలపైనే కేంద్రం ప్రధానంగా దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, పలు అంశాల్లో రాయితీలు కావాలని కోరారు.

ఇప్పటికే కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తీరని ద్రోహం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టం 13వ షెడ్యూల్ నిర్దేశాన్ని కేంద్రం బుట్టదాఖలు చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కడప, తెలంగాణలో బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదంటూ సెయిల్ 2014 డిసెంబర్‌లో ఇచ్చిన నివేదికను ఈ ఏడాది జూన్ 13న సుప్రీం కోర్టుకు దాఖలు చేయడంలోనే కేంద్రం వివక్ష  అర్థమవుతోంది. దానికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన హామీల ప్రకారం అందవలసిన సహకారం 85 శాతానికి పైగా పూర్తయిందని స్థానిక బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చూస్తుంటే నీతి ఆయోగ్ ద్వారా అందిన సహాయ సహకారాలు ఏ మాత్రమో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు, వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధులు రూ.350 కోట్లు కేంద్రం వెనక్కి తీసుకోవడం తదితర అనేక అపరిష్కృత సమస్యలపై చంద్రబాబు కేంద్రం వైఖరిని దుయ్యబట్టారు. రైతులకు భరోసా ఇస్తూ, పరి శ్రమల మాదిరిగా వ్యవసాయాన్నీ లాభసాటిగా మార్చేందుకు ఆ రంగాన్ని ఆధునికీకరించడంతో పాటు, వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తూ తెలంగాణలో చేస్తున్న ప్రయోగాల గురించి నీతి ఆయోగ్ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. కేంద్రం అధికారాలను, పరిధులను విచక్షణారహితంగా కేంద్రీక రించకుండా, రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం అతిగా జోక్యం చేసుకోకుండా ఉండాలని బీజేపీ యేతర ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను గట్టిగా వ్యక్తంచేశారు. అయితే సమాఖ్య స్ఫూర్తిని మరింతగా విస్తృతపరచి, దేశాభి వృద్ధికి దోహదపడేలా వ్యవహరించవలసిన నీతి ఆయోగ్ నిర్ణయాలు అందుకు భిన్నంగా ఉండడంపై పలువురు ముఖ్యమంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 

అరవై శాతానికిపైగా ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగం కేంద్రంగా, పారి శ్రామిక విధానాలను అనుసంధానం చేయడం వల్ల మెజారిటీ జనాభా కొను గోలు శక్తి పెరిగి వారి జీవితాలు బాగుపడేందుకు దోహదపడుతుంది. కార్పొ రేట్ పారిశ్రామిక విధానాలకు అనుబంధంగా వ్యవసాయ రంగాన్ని మార్చాలని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దేశ ప్రజల్ని మరింత సంక్షోభపు చీకట్లలోకి తోస్తుంది. జీఎస్టీ, నోట్ల రద్దు, ఎఫ్‌డిఐలకు అనుమతులు వంటి విధానాలన్నీ నీతి ఆయోగ్ మానసపుత్రికలే. కేంద్ర ఆర్థిక విధానాలను అమలు చేసే యంత్రాంగాలుగా రాష్ట్ర ప్రభుత్వాలను మార్చేందుకు చేస్తున్న ప్రయత్నా లు దేశంలో ఆర్థిక మారణహోమం తలెత్తేందుకు దోహదపడుతాయని విప క్షాల విమర్శలను కేంద్రం పట్టించుకోవడంలేదు. నీతి ఆయోగ్ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఉత్ప్రేరకంగా ఉండాలి. అంతేగాని మితిమీరిన ఆర్థిక విధాన కేంద్రీ కరణకు అది సాధనంగా మారితే మితిమీరిన అధికార కేంద్రీకరణకు దారితీసి దేశాభివృద్ధి కుంటుపడేందుకు ప్రధాన కారకమవుతుంది.

English Title
niti ayog
Related News