ఆ రెండూ బ్యాలెన్స్ చెయ్యాలన్నదే నా కోరిక

Updated By ManamSat, 09/08/2018 - 23:31
allari naresh

సినిమా అంటేనే వినోదం. లవ్, సెంటిమెంట్, యాక్షన్, ట్రాజెడీ, కామెడీ వివిధ తరహా సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. కొంతమందికి కొన్ని జోనర్ సినిమాలంటే ఇష్టం ఉంటుంది. కానీ, అందరూ ఇష్టపడే జోనర్ మాత్రం కామెడీ. పాతతరం సినిమాల నుంచి ఇప్పటివరకు కామెడీని అద్భుతంగా పండించిన సినిమాలు ఘనవిజయాలు సాధించాయి. వినోదమే ప్రధానంగా రూపొందిన సినిమాలు చెయ్యడం ద్వారా కొంతమంది హీరోలు కామెడీ హీరోలుగా మంచిపేరు తెచ్చుకున్నారు.

వారిలో చంద్రమోహన్, నరేశ్, రాజేంద్రప్రసాద్ వంటి వారు ఉన్నారు. తెలుగు సినిమాల్లో పూర్తి స్థాయి కామెడీ మరుగున పడిపోతున్న సమయంలో ‘అల్లరి’ సినిమాతో నరేశ్ హీరోగా పరిచయమై ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకొని అల్లరి నరేశ్ అయిపోయాడు. కామెడీ సినిమాలు రూపొందిస్తూ హాస్యంలో తనకంటూ ఓ ప్రత్యేక బాణీని ఏర్పరుచుకున్న దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన అల్లరి నరేశ్ అనతికాలంలోనే కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల 50 సినిమాలు పూర్తి చేసి శత చిత్రాలను పూర్తి చేసేందుకు ముందుకెళ్తున్న అల్లరి నరేశ్ తాజాగా నటించిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. హీరో సునీల్‌తో కలిసి అల్లరి నరేశ్ చేసిన ఈ సినిమాని భీమనేని శ్రీనివాస్ రూపొందించారు. ఇటీవల ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో అల్లరి నరేశ్ తను చేసిన సినిమాల గురించి, చేయబోతున్న సినిమాల గురించి, తన కెరీర్ ప్లానింగ్ గురించి వివరించారు. 
 

image


దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది
నేను ఓ పంచ్ డైలాగ్ చెప్పినపుడు ఎదుటివారి కౌంటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రియాక్షన్ ఆడియన్స్‌కి నవ్వు తెప్పిస్తుంది. సునీల్, బ్రహ్మానందంలాంటి సీనియర్ కమెడియన్స్‌తో చేసినపుడు ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ పండిపోయిన ఆర్టిస్టులు వాళ్ళు. అలాంటి వారితో ఓ కామెడీ సీన్ చేసినపుడు వారి టైమింగ్, ఎక్స్‌పీరియన్స్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత సునీల్‌గారు, నేను కలిసి చేసిన సినిమా ‘సిల్లీఫెలోస్’. ఈ సినిమాలో మేమిద్దరం హీరో, హీరోయిన్‌లా ఉంటాం. ఎంత కామెడీ సినిమా అయినా, సినిమాలో ఎన్ని పంచ్ డైలాగ్స్ ఉన్నా ఒక్కోసారి మనం అనుకున్న స్థాయిలో సినిమా విజయం సాధించదు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ విషయాల గురించి కూడా ఇండస్ట్రీలోని నా ఫ్రెండ్స్‌తో కలిసి డిస్కస్ చేస్తుంటాను. ఎందుకు మన సినిమాలను ఆదరించడం లేదు. మనం చేసే కామెడీకి ఆడియన్స్ ఎందుకు నవ్వడం లేదు. మన నుంచి ఎలాంటి కామెడీని వారు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. డైలాగ్ డెలివరీ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఆకట్టుకోలేకపోతున్నామని అనుకుంటూ ఉంటారు. పాత నరేష్ ఇప్పుడు కనిపించడం లేదు అంటారు. అసలు ఆ పాత ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. 

కొత్తగా అనిపించే జోకులతో నవ్వించాలి
నా కెరీర్‌లో ‘సుడిగాడు’ చాలా పెద్ద హిట్ సినిమా. ఆ సినిమా తర్వాత భీమనేనిగారి కాంబినేషన్‌లో సినిమా చేద్దామనుకున్నాను. ఎలాంటి సినిమా చెయ్యాలి అనే విషయంలో మేమిద్దరం చాలా చర్చించుకున్నాం. ‘సుడిగాడు 2’ చేద్దామని కూడా అనుకున్నాం. సూపర్ హీరోస్ కాన్సెప్ట్‌లో ఓ సినిమా అనుకున్నాం. ఆ టైమ్‌లో మేమిద్దరం అనుకున్నదేమిటంటే ఇకపై స్ఫూఫ్‌లతో సినిమా చెయ్యొద్దని. ఎందుకంటే ఈమధ్య యూ ట్యూబ్‌లో చాలా స్ఫూఫ్‌లు చేసి పెట్టేస్తున్నారు. మనం ఆ స్టేజ్ దాటేశాం. జనాన్ని నవ్వించాలంటే బుక్స్‌లో వచ్చే జోకులు, వాట్సాప్‌లో జోకుల జోలికి వెళ్ళకుండా కొత్తగా అనిపించే జోకులతో నవ్వించాలి. అందుకే ‘సిల్లీఫెలోస్’ చిత్రంలో సంచుల కొద్దీ పంచులు పెట్టకుండా. సిట్యుయేషన్ పరంగా వచ్చే కామెడీయే చెయ్యాలనుకున్నాం. ఆ సిట్యుయేషన్ జనాన్ని నవ్విస్తుంది తప్ప ఫోర్స్‌గా, నేను, సునీల్ ఉన్నాం కాబట్టి మీరు నవ్వాలి అన్నట్టుగా ఉండదు. 

వాళ్ళకి ఏమీ తెలీదు అనుకోవడం మన పొరపాటు
image‘సిల్లీ ఫెలోస్’ తమిళ్ రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చెయ్యడం జరిగింది. ఈ సినిమా తెలుగులో ఆల్రెడీ డబ్ కూడా అయింది. అయితే అందులో హీరో తెలుగు ఆడియన్స్ ఎవరికీ తెలీదు. ఓపెనింగ్స్ కూడా బాగా రాలేదు. కాబట్టి మీరు, సునీల్‌లాంటి హీరో కలిసి చేస్తే పెద్ద సినిమా అవుతుంది, మేం సినిమాని కొంటాం అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ మనకు ఇపార్టెంట్ కాబట్టి, ఏ సినిమా ఎలా వెళ్తుందో వారికి బాగా తెలుసు కాబట్టి మేం కూడా దానికి అగ్రీ అయ్యాం. అయితే ప్రతి సినిమాకీ డిస్ట్రిబ్యూటర్స్ ఒపీనియన్‌తోనే వెళ్ళలేం. ఎందుకంటే మనం డిస్ట్రిబ్యూటర్‌కి చెప్పడం వేరు, డిస్ట్రిబ్యూటర్ మనకు చెప్పడం వేరు. ఏ కథ చెప్పినా వాళ్ళు బాగుందనే అంటారు. కొన్ని స్క్రిప్ట్ వరకు బాగానే అనిపిస్తాయి. విజువల్‌గా ఎంత బాగా తియ్యగలం అనేది తెలీదు. అయితే ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా సినిమా కాన్సెప్ట్ ఏమిటి, సెన్సార్ టాక్ ఎలా ఉంది అని కనుక్కున్న తర్వాతే కొంటున్నారు. వాళ్ళకి ఏమీ తెలీదు అనుకోవడం మన పొరపాటు. ‘సిల్లీ ఫెలోస్’ సినిమా విషయంలో ఆరేడు మంది డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కో ఏరియా తాము కొంటున్నామని చెప్పిన తర్వాతే సినిమా స్టార్ట్ చెయ్యడం జరిగింది. ఇంతకుముందు నేను చేసిన కొన్ని సినిమాలకు ముందుగానే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. అయితే కథగా అనుకున్నప్పుడు వేరేలా ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ కూడా వేరేగా ఉంటుంది. ఒక సినిమా ఆడుతుందా? లేదా? అని చెప్పడానికి మేము దేవుళ్ళం కాదు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా దేవుళ్ళు కాదు. ఫైనల్‌గా చెప్పాల్సింది ఆడియన్స్. 

నంబర్ల కోసం సినిమాలు చెయ్యడం లేదు
నా 50వ సినిమా తర్వాత చేసిన సినిమాల సంఖ్య తక్కువే. అయితే దానికి కారణాలు వేరు. ఈమధ్యకాలంలో ఆరేడు సినిమాలను రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత అవి వేరే వాళ్ళు చేశారు. అవి ఆడలేదు కూడా. వాటి గురించి నేను ఏమీ చెప్పలేను. నేను సినిమాలు చేసేది కేవలం డబ్బు కోసం కాదు. నంబర్లు పెంచుకోవడానికి నేను సినిమాలు చెయ్యడం లేదు. ఆడియన్స్ మెచ్చే క్వాలిటీ సినిమాలు చెయ్యాలన్నదే నా కోరిక. 

అలాంటప్పుడే మనం కరెక్ట్ ట్రాక్‌లో వెళ్తున్నాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది
నేను ఇప్పటివరకు 54 సినిమాలు చేశాను. ఏ సినిమా రిలీజ్ ముందయినా ప్రెజర్ అనేది ఉంటుంది. అప్పటివరకుimage కూల్‌గానే ఉన్నా, రిలీజ్ ముందు రోజు నుంచి టెన్షన్ మొదలవుతుంది. మనం చేసే ప్రతి సినిమా ఆడాలనే కోరుకుంటాం. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తాం. అయితే కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది. ఈ సినిమా ఎంపిక చేసుకోవడంలో ఏదైనా తప్పు చేశామా అనే ఆలోచన వస్తుంది. కొన్ని సినిమాలు మాత్రం షూటింగ్ టైమ్‌లోనే ఇది డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మనం చేస్తున్న సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ మనకు తెలుసు. లైట్‌మెన్‌కి, ప్రొడక్షన్ వాళ్ళకి ఈ కథ తెలిసే అవకాశం లేదు. మనం చెప్పే డైలాగ్స్‌కి వాళ్ళు నవ్వారనుకోండి, అదే పంచ్‌కి థియేటర్‌లో ఆడియన్స్ కూడా నవ్వుతారు. అలాంటప్పుడు సినిమా మీద మనకు పూర్తి నమ్మకం కలుగుతుంది. ఫర్వాలేదు మనం కరెక్ట్ ట్రాక్‌లోనే వెళ్తున్నాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది.
 
అది చెయ్యాలా? వద్దా? అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు
ఈ సినిమా చేస్తున్నప్పుడే ‘తమిళ పడమ్ 2’ రిలీజ్ అయింది. నేను, భీమనేనిగారు కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఇది ‘సుడిగాడు 2’ అని అందరూ అనుకున్నారు. తమిళ పడమ్ 2 అక్కడ చాలా పెద్ద హిట్ అయింది. 35 కోట్లు కలెక్ట్ చేసింది. ‘సుడిగాడు’కి సీక్వెల్ చెయ్యమని కూడా చాలా మంది చెప్పారు. అసలు దానికోసం మేం ‘సుడిగాడు 2’ టైటిల్‌ని అనుకున్నాం. ‘సిల్లీ ఫెలోస్’కి కూడా మొదట ‘సుడిగాడు 2’ అనే టైటిల్ పెడదామనుకున్నాం. అయితే అది కరెక్ట్ కాదని నేను, సునీల్‌గారు అనుకున్నాం. ఎందుకంటే ఇది స్ఫూఫ్ సినిమా కాదు. టైటిల్ చూసి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. ఈ సినిమా ఎంత గొప్పగా ఉన్నా ‘సుడిగాడు 2’ అనే టైటిల్ పెట్టి మనల్ని చీట్ చేశారనే ఫీలింగ్ ఆడియన్స్‌కి కలుగుతుంది, డిజప్పాయింట్ అవుతారు కూడా. ‘సుడిగాడు 2’ అనే టైటిల్ యాజిటీజ్‌గా ఉంది. అయితే దాన్ని చెయ్యాలా వద్దా అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు.
 
మేజర్ క్రెడిట్ డైరెక్టర్‌కే ఇస్తాను
నేను చేసిన సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అందరికీ పంచేస్తాను. ఫెయిల్యూర్స్ వస్తే నేను తీసేసుకుంటాను. సినిమాలోని డైలాగ్స్ ఎవరు రాసినా అక్కడక్కడ సిట్యుయేషన్‌కి తగ్గట్టు బ్రహ్మానందంగారు ఓ రెండు డైలాగ్స్ వేస్తారు. కొన్ని ఇంప్రవైజేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు నేను కూడా చేస్తుంటాను. ఏ డైలాగ్ ఎవరు చెప్పారు అనేది సెపరేట్‌గా టైటిల్స్‌లో వెయ్యరు. కాబట్టి సక్సెస్ ఎలా వచ్చినా అది టీమ్ వర్క్. అయితే ఒక సినిమా విజయం సాధించింది అంటే మేజర్ క్రెడిట్ డైరెక్టర్‌కే ఇస్తాను. ఆ తర్వాత నిర్మాతలకు. ఎందుకంటే కథ మీద నమ్మకంతోనే ఎంతో ఎఫర్ట్ పెడతారు. 

ఇమిటేషన్ ఈజ్ నాట్ యాక్టింగ్
‘సుడిగాడు 2’ సినిమా చెయ్యమని డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడుగుతున్నారు. అయితే నా ఉద్దేశం ఏమిటంటే చేస్తే ‘సుడిగాడు’ని మించి చెయ్యాలి. ఆ సినిమాలో 2012 వరకు వచ్చిన సినిమాల స్ఫూఫ్స్ ఉంటాయి. ఇప్పుడు 2012 నుంచి 2018 వరకు వచ్చిన సినిమాలను తీసుకోవాలి. అయితే ఒక నటుడిగా, వ్యక్తిగా స్ఫూఫ్‌లు చెయ్యడానికి ఇష్టపడను. ఎందుకంటే ఇమిటేషన్ అనేది వచ్చేస్తుంది. ‘ఇమిటేషన్ ఈజ్ నాట్ యాక్టింగ్’ అనేది నేను యాక్టింగ్ క్లాస్‌లో నేర్చుకున్నాను. నేను ఎవరినైతే ఇమిటేట్ చేస్తున్నానో ఆ హీరో, ఆ హీరో ఫ్యాన్స్ ఫీలవుతారని నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పెర్‌ఫార్మెన్స్ ఏమిటో చూపించు కోకుండా మరొకరిని ఇమిటేట్ చెయ్యడం నాకు నచ్చలేదు. నాకంటూ ఓ స్టైల్ ఉంది. ఆ స్టైల్‌లోనే వెళ్ళాలనుకుంటున్నాను, నవ్వించాలనుకుంటున్నాను. 
నా క్యారెక్టర్ ఎంత అనేది పట్టించుకోను

సినిమాలో నా క్యారెక్టర్ నచ్చితే చాలు. అది హీరో క్యారెక్టరా, సపోర్టింగ్ క్యారెక్టరా అనేది చూడను. గమ్యం సినిమా తీసుకుంటే అందులో నేను హీరో కాదు. నా క్యారెక్టర్ బాగుండాలని అలోచిస్తాను తప్ప అది 5 నిమిషాలు ఉందా? 30 నిమిషాలు వుందా అనేది పట్టించుకోను. సినిమాలో క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాను. 

నా కెరీర్‌లో ఏ సినిమాకీ అంత కష్టపడలేదు
imageనేను ఎక్స్‌పెరిమెంటల్‌గా చేసిన కొన్ని సినిమాలు వర్కవుట్ అయ్యాయి. ఎక్కువ శాతం సక్సెస్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ‘లడ్డుబాబు’ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. నా కెరీర్‌లో ఇప్పటివరకు నేను ఏ సినిమాకీ అంత కష్టపడలేదు. ఒకే చెయిర్‌లో ఐదారు గంటలు కూర్చొని మేకప్ చేయించుకోవాల్సి వచ్చేది. అలా 100 రోజులు చేశాను. ఎంతో ఇష్టపడి చేసిన సినిమాలు సక్సెస్ కాలేదు. యాక్టర్‌గా నేనెప్పుడూ కొత్త తరహా సినిమాలు చెయ్యాలనుకుంటాను. సేమ్ టైమ్ ఆడియన్స్‌కి కమర్షియల్‌గా ఉండేలా చూసుకుంటాను. గమ్యం, శంభో శివశంభో చిత్రాల్లో నేను చేసిన క్యారెక్టర్‌లో కామెడీ ఉంటూనే ఎమోషన్ కూడా ఉంటుంది. నేనులో అస్సలు కామెడీ అనేది ఉండదు. ఈ రెండూ బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చెయ్యాలన్నది నా కోరిక.

‘ఎవడిగోల వాడిది’ తరహాలో..
మారుతిగారి డైరెక్షన్‌లో మా బేనర్‌లో ఓ సినిమా చేద్దామనుకున్నాం. ‘ఎవడిగోల వాడిది’, ‘జంబలకిడి పంబ’ తరహాలో ఎక్కువమంది ఆర్టిస్టులతో నాన్నగారి స్టైల్‌లో ఓ సినిమా చెయ్యాలన్నది మా కోరిక. తప్పకుండా చేస్తాం. అలాంటి కథ కోసం చూస్తున్నాం. ఒకటిరెండు కథలు అనుకున్నాం. కానీ, మారుతిగారు ఇంకా బాగుండాలి, ఇ.వి.వి.గారి మార్క్ కనిపించాలి అంటున్నారు. కథ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మా బేనర్‌లో మారుతిగారి డైరెక్షన్‌లో సినిమా చేస్తాం. ఇప్పుడు ఆయనకు ఉన్న కమిట్‌మెంట్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మా సినిమా ఉంటుంది.

రాజేష్‌కి అది కమ్ బ్యాక్ మూవీ అవుతుంది
ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత మళ్లీ మళ్లీ సినిమాలు చెయ్యాలని ప్రతి ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. నటుడిగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. శ్రీహరిగారులాంటి నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చి ఆ తర్వాత హీరోగా ఎన్నో విజయాలు సాధించారు. అలాగే గోపీచంద్‌గారు హీరోగా పరిచయమై ఆ తర్వాత విలన్‌గా చేసి మళ్ళీ హీరోగా గొప్ప సక్సెస్‌లు అందుకున్నారు. చాలామంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా చేసిన తర్వాత హీరో అయ్యారు. హీరోగా సినిమాలు చేసిన రాజేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వస్తున్నాడు. రామ్‌చరణ్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. తప్పకుండా ఆ సినిమా రాజేష్‌కి కమ్‌బ్యాక్ మూవీ అవుతుంది.

‘మహర్షి’కి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేస్తాను
‘మహర్షి’ సినిమాలో నేను చేస్తున్న క్యారెక్టర్ నా కెరీర్‌లో స్పెషల్‌గా భావిస్తున్నాను. ‘గమ్యం’లో గాలి శీనులా, ‘శంభో శివశంభో’లో మల్లిలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. ‘మహర్షి’ సినిమాలో నా క్యారెక్టర్ పేరేమిటి? క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? మహేష్‌తో నా రిలేషన్ ఏమిటి? అనేది తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంది. అయితే ఆ సినిమాకి ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఇప్పుడే చెప్పలేను. అయినా ఎవరికి వారు నా క్యారెక్టర్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఊహిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ క్యారెక్టర్‌ని ఊహలకే వదిలేద్దాం. అసలు ఈ సినిమాలో నాకు అవకాశం ఎలా వచ్చిందనేది చెప్పాలనుకుంటున్నాను. 2016లో మా పాప పుట్టిన తర్వాత ఒప్పుకున్న మొదటి సినిమా ‘మహర్షి’. వంశీగారు నన్ను పిలిచి కథ చెప్పారు, నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పారు. మహేష్‌గారు, వంశీగారు ఈ క్యారెక్టర్‌కి నరేష్ అయితే బాగుంటాడు అనుకొని నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. వారు నామీద పెట్టుకున్న నమ్మకానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ట్ చేస్తానని, చెయ్యాలని కోరుకుంటున్నాను. 2016లోనే ఈ సినిమా స్టార్ట్ కావాల్సింది, 2018లో మొదలైంది. అప్పటికి మహేష్‌కి ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 45 రోజులు షూటింగ్ పూర్తయింది. మళ్ళీ అక్టోబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు ఆ సినిమా షూటింగ్ ఉంది. మహేష్‌గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. బేసిక్‌గా మహేష్‌గారికి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. చిన్న చిన్న జోకుల్ని కూడా ఆయన చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సెట్‌లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. 

English Title
My desire is that both of them can balance: allari naresh
Related News