నా రంగు నా ఇష్టం

Updated By ManamSun, 04/29/2018 - 01:41
image

imageమీరు మీలాగే ఉండండి..మీ అస్తిత్వాన్ని కోల్పోకండి.. తెల్లగా కనిపించాల్సిన అగత్యం లేదు.. ఇందుకు నానాఅగచాట్లు పడాల్సిన ఖర్మ అంతకంటే లేదు.. ‘బ్రౌన్ బ్యూటీ’లుగా మిమ్మల్ని మీరు గర్వంగా పరిచయం చేసుకోండి అంటూ కాస్మెటిక్స్ కంపెనీలు ఇప్పుడు నయా పల్లవి అందుకుం టున్నాయి.. ఇందుకు స్పెషల్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టి.. వీరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపు తున్నాయి.  నిత్యం కాస్మెటిక్స్‌కు వేల రూపాయల డబ్బు తగలేసి, స్కిన్ అలర్జీలు, స్కిన్ క్యాన్సర్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు శారీరకంగా, ఆర్థికంగా కాపాడుకోండి అంటూ ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఊదరగొడుతున్నారు.
నేను బ్రౌన్ బ్యూటీ

త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ బాడీ షేమింగ్‌కు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యల దుమారం ఆయన క్షమాపణలు చెప్పేవరకూ ఆగలేదు. ‘‘భారతీయుల అందానికి ఐశ్వర్యరాయ్ మాత్రమే ప్రతీక అని.. డయానా హైడెన్‌ను ఎవరైనా అందగతె్త అంటారా? ఆమె మిస్ వరల్డ్ గెలిచిందంటే నవ్వు వస్తుంది.. కేవలం కాస్మెటిక్స్ కంపెనీలు మన మార్కెట్‌ను వశపరుచుకునేందుకే మన యువతులకు అందాల కిరీటాలు ఇచ్చాయి.. అందులో భాగంగానే డయానాకు టైటిల్ దక్కింది’’ అంటూ విప్లవ్  స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు.

 దీనిపై స్పందించిన డయానా, ‘‘నేను చామనఛాయ రంగుతో ఉన్నందుకు గర్వపడుతున్నా..విదేశీయులు సైతం మనవారిimage రంగును మెచ్చుకుంటారు..కానీ నాకు మిస్ వరల్డ్ టైటిల్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడం వారి వ్యక్తిగత అభిప్రాయం, రంగు గురించి మాట్లాడి రేసిజంతో వ్యాఖ్యలు చేయడం త్రిపుర సీఎంకు సబబు కాదు.. ఒకరిపై కామెంట్లు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని కామెంట్ చేయడం మంచిది’’ అంటూ హైదారబాద్‌కు చెందిన డయానా ఘాటుగా స్పందించారు. దీంతో దిగివచ్చిన సీఎం సారీ చెప్పారు.

ప్రియాంక చోప్రా
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉండగానే.. హాలీవుడ్‌కు తరలివెళ్లిన మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా ఇటీవలే తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించారు. తన ఒంటి రంగు (గోధుమ వర్ణం/ బ్రౌన్) కారణంగా తాను ఎన్నో అవకాశాలు హాలీవుడ్‌లో పోగొట్టుకున్నట్టు హాలీవుడ్‌లో రేసిజం తనకు పెద్ద అడ్డంకిగా మారినట్టు వివరిం చారు. ఇలాంటి బాధితులు హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో లెక్కలేనంత మంది ఉన్నారు. సాధారణంగా ఇలాంటి విషయాలను వెల్లడించి.. తమను తాను చిన్నబుచ్చుకునేందుకు ఎక్కువ మంది సాహసం చేయరు కనుక.. ఇవి ఎక్కువగా ప్రచారంలోకి రాకుండా తెరవెనుకనే ఉండిపోతాయి. 

అందంగా కాదు బలంగా
మహిళలు శారీరకంగా బలంగా ఉండాలి కానీ.. అందంగా కాదు అంటూ పాక్ మహిళా క్రికెటర్, సనా మీర్ ఇటీవల ఫైర్ అయ్యారు. హీరోయిన్ మహిరా ఖాన్ హెయిర్ రిమూవల్ క్రీమ్‌లో నటించి, తెల్లగా ఉంటే అందమన్న యాడ్‌ను తప్పుపడుతూ సోషల్ మీడియాకెక్కిన సనా, అమ్మాయిలను భ్రమలకు గురిచేయవద్దన్నారు.
 ‘‘స్పోర్ట్స్‌లో రాణించాలంటే ఉండాల్సింది తెల్లగా కాదు.. తెల్లని చేతులూ కావు, నున్నని చేతులు కావు.. బలమైన చేతులు..శరీరాకృతి, రంగువల్ల క్రీడల్లో అస్సలు రాణించలేరు.. మానసికంగా బలంగా ఉంటే అనుకున్నది సాధిస్తారు’’ అందుకే ఇలాంటి ప్రకటనల్లో తాను అస్సలు కనిపించనని.. కాస్మెటిక్స్‌పై ఫైర్ అయిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫేస్‌బుక్‌లో ఆమె చేసిన పోస్ట్‌లను నెటిజెన్లు అభినందిస్తూ లైక్‌లు, రీట్వీట్‌లు చేస్తున్నారు.

లెట్స్ బ్రేక్ ద రూల్స్
631 మిలియన్‌ల మంది మహిళలున్న మనదేశంలో అందమంటే కొలతలు.. తెల్ల రంగేనా? అంటూ ‘లెట్స్ బ్రేక్ ద రూల్స్’ ఉద్యమం ప్రారంభించిన ‘డవ్’ టీనేజర్లను అట్రాక్ట్ చేస్తోంది. మరోవైపు లాక్మే కూడా ‘బ్రౌనీ కలెక్షన్’ పేరుతో, మీ సహజమైన రంగును అలాగే ఉంచుతూ ద్విగుణీకృతమైన అందంతో వెలిగిపోమంటూ చేస్తున్న యాడ్ కూడా మహిళలకు మంచి స్ఫూర్తి పంచుతోంది.  బొబ్బి బ్రౌన్ కాస్మెటిక్స్ ఇప్పుడు ఇండియాలోనూ లభిస్తున్నాయి. 

 ఇందులో బ్రౌన్ స్కిన్‌కు ప్రత్యేకించి పలు సౌందర్యసాధనాలు ఉండడం విశేషం. తెల్లవారి కోసం కాకుండా ఎక్స్‌క్లూజివ్‌గా గోధుమవర్ణం వారికోసం తయారైన ఈ సౌందర్యసాధనాలు ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలిచాయి. ఉద్యోగరీత్యా, చదువు కోసం బయట ప్రపంచంలో అడుగుపెట్టే స్త్రీలకు ఎటువంటి ఆత్మన్యూనత అవసరం లేదని.. ‘‘బ్రౌన్ ఈజ్ బ్యూటిఫుల్’’ అంటూ రూల్స్‌ను బ్రేక్ చేస్తుండడం నయా ట్రెండ్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫెయిర్‌నెస్ క్రీములు విక్రయించరాదంటూ నయా చట్టం తీసుకురావడం కూడా బ్రౌన్ బ్యూటీల అందం కాపాడేందుకే అన్నది గుర్తుంచుకోండి.

English Title
my color my like
Related News