దీప కాంతి

Updated By ManamSun, 11/04/2018 - 07:53
lakshmi-puja

చీకటి అజ్ఞానానికి సంకేతం.. వెలుగు జ్ఞానానికి చిహ్నం. దీపం చిన్నదైనా చుట్టుపక్కలంతా వెలుగును నింపుతుంది. అది కళ్లకు మాత్రమే కనిపించే కాంతి కాదు. మనసును నింపే జ్ఞానకాంతి. దీపావళి అంటే దీపాల వరుస. మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానకాంతులను విరజిమ్మి.. దేశమంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ. చిమ్మ చీకట్లను కురిపించే అమావాస్య రాత్రిని పిండారబోసినట్లు వెన్నెల వెలుతురుతో నింపేసే పండుగ. తిమిరంతో సమరం చేసే వెలుగు విజయానికి సంకేతం.

deepaaluహిదూ సంప్రదాయంలో పండుగలు ఎక్కువే. దసరా అయిపోయిన వెంటనే దీపావళి ఎప్పుడొస్తుందా అని పిల్లలూ, పెద్దలూ ఎదురు చూస్తారు. పిల్లలకు సంబంధించి దీపావళి అనేది టపాసులు కాల్చుకునే పండగే. ఇది ఆశ్వయజ మాసం శుద్ధ అమావాస్యనాడు వచ్చే పండుగ. దసరాతో వానాకాలం దాదాపుగా ముగుస్తుంది. వానాకాలంలో ఇబ్బడి ముబ్బడిగా వానలు కురవడం వలన వాతావరణంలో  సూక్ష్మజీవులు ప్రబలి ప్రకృతిపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. దాని వలన జలుబు, దగ్గు వంటి ఇన్‌ఫెక్షన్లు, అంటువ్యాధులతో మనుషులు బాధపడితే, పశువులకూ వ్యాధులు సోకే అవకాశం ఉంది. ప్రస్తుత రోజుల్లో జనావాసాలు ఎక్కువగా ఉండడంతో ఈగల, దోమల ఉదృతి ఎక్కువై.. వాటి వలన టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి అనేక వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. వీటిని కాలానుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధులు అంటారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాన్ని అరికట్టి మానవాళికి మేలు చేసేదే ఈ దీపావళి.

రోజులు మారాయి
పురాణాల ప్రకారం నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి జరుపుకుంటారని ప్రతీతి. మరొక ప్రాశస్త్యం ఏమంటే శ్రీరాముడు లంకలో రావణుడిని సంహరించి సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందంగా దీపావళి జరుపుకుంటారని రామయణం సూచిస్తుంది. దీపాల పండుగకు ఒకరోజు ముందు ఆశ్వయజ బహుళ చతుర్థి. దీనినే నరకచతుర్దశి అని కూడ అంటారు. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణలో ఈరోజునే బాణసంచా కాలుస్తారు. ఇదివరకటి కాలానికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. మా చిన్నతనంలో.. కోనసీమలో ఉండే మా అమ్మమ్మగారి ఊరిలో.. వరి, తరువాత కొబ్బరి ప్రధానమైన పంట. కొబ్బరి కాయల నుంచి వేరుచేసిన డొక్కల్ని బాగా ఎండబెట్టి, పీచుని వేరుచేస్తారు. అప్పుడు పీచు మధ్య సన్నని మెత్తని కణజాలం పొడి రూపంలో రాలిపడుతుంది. ఆ పొడిని సేకరించి.. కొంత బొగ్గు పొడిని, గంధకాన్ని కలిపి, ఆ మిశ్రమాన్ని పాత గుడ్డలో వేసి.. గట్టిగా పెద్దపొట్లంలా కట్టి, మధ్యలో గోగునార కాడలు అమర్చుతారు, చేత్తో పట్టుకుని తిప్పడానికి వీలుగా. వాటిని చిటుకుల పొట్లాలు అనేవారు. 

ఆ సాయంత్రం దీపాలు వెలిగించిన తరువాత పొట్లం చివరన కొద్దిగా మంటకు అంటించి, ఆ గోగుకాడల్ని పట్టుకుని.. చేతిబలం కొద్దీ తిప్పితే మన చుట్టూ విష్ణుచక్రంలా తిరుగుతాయి. గాలి వేగానికి పొట్లంలో ఉన్న కొబ్బరిపొట్టు.. నిప్పు కణాల్లా మండుతూ.. వెలుగులు చిమ్ముతుంది. అవి ఓ అరగంట సేపు మండేవి. అది మనుష్యులకూ, పర్యావరణానికీ ఏ విధంగానూ హానిలేని ఆనందం. తాటాకు టపాకాయలూ, మతాబులూ, చిచ్చుబుడ్లు అన్నీ ఇళ్లలోనో, గ్రామంలో ఒక చోటో కలిసికట్టుగా చేసుకునేవారు. అవే ఆనాటి బాణసంచా. ఈరోజు పల్లెల్లోనూ ఎవ్వరికీ, ఆ ఓపికా, తీరికా ఉండడం లేదు. 

లక్ష్మీ పూజ ఔన్నత్యం
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. స్త్రీలంతా ఆశ్వయజ బహుళ చతుర్దశి  నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.  దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు.  అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహంతో ఊగిపోయి దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన మహావిష్ణువు,  దేవేంద్రునితో.. ఒక జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. అతడు ఆ విధంగానే చేశాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో మహావిష్ణువు చెంతనే ఉన్న మహాలక్ష్మిని ఇంద్రుడు ‘‘తల్లీ! నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా?’’ అని అడిగాడు. మహాలక్ష్మి ‘‘త్రిలోకాధిపతీ! నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతాను’’ అని సమాధానమిచ్చింది. అందుకనే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

దీపం ఎందుకు?
పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి.. నీలం, పసుపు, తెలుపు. ఈ మూడు రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైన సత్త్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారు పౌరాణికులు. మనం వాటిని విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని భావిస్తున్నాం.

మిఠాయిల వేడుక
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. ఇది మన తెలుగువారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ. మొదటి రోజు నరక చతుర్దశి, రెండో రోజు దీపావళి. మూడో రోజున కూడా పిల్లలు బాణసంచా కాలుస్తారు. ఐదోరోజున నాగులచవితి పేరుతో నాగులకు పూజలు చేసి నాగేంద్రుడ్ని ప్రసన్నం చేసుకుంటారు. ఆరోజున నాగేంద్రునికి ఇష్టమైన చలిమిడి, నువ్వుల చిమ్మిలి, ఇంకా కోడిగుడ్డు నైవేద్యంగా సమర్పించి.. పాము పుట్టల దగ్గర కొద్దిగా బాణసంచా కాలుస్తారు. ఇంకా మిగిలి ఉన్న కాలుష్యం ఏదైనా ఉంటే, అది కూడా పోవడానికి చివరిగా కార్తీక పౌర్ణమి రోజున మిగిలి ఉన్న బాణసంచా కాల్చి పండుగకు వీడ్కోలు చెబుతారు. పస్తుతం అన్నీ ఒక్క రోజులోనే తెమిలిపోతున్నాయి. మనం పండుగ గురించి మాట్లాడుకునేటప్పుడు, అది కేవలం lakshmi pujaవెలుగులు, దివ్వెలు, దీపావళి మందులకే పరిమితం కాదు. దీపావళి కొన్ని నోరూరించే వంటలకు కూడా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ప్రతి మతం వారు ప్రత్యేకంగా ఈ పండుగ రోజు సాంప్రదాయ రకాలతో కూడిన మిఠాయిలు, స్వీట్లు తయారుచేస్తారు. ఇది మిఠాయిల వేడుకగా కూడా చెబుతారు. ఎటువంటి సంతోషకరమైన సందర్భాలలోనైనా, వేడుకలలోనైనా మిఠాయిలతో సంబరాలు జరుపుకోవడం అనేది తెలిసిన విషయమే. వివిధ రకాల మిఠాయిలతో ఆనందించేది దీపావళి పండుగ. దీపావళి సందర్భంగా మిఠాయిలు పంచుకోవడం కోసం పలు రకాల మిఠాయిలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే మిఠాయిలు కొనేముందు, తినేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. లేనిపక్షంలో అనారోగ్యం పాలయ్యే అవకాశాలుంటాయి. ముఖ్యంగా రకరకాల రంగుల్లో తీర్చిదిద్దే మిఠాయిలకు దూరంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రసాయనాలతో కూడిన ఈ రంగులను వినియోగించడం వలన మిఠాయిలు విషతుల్యం అవుతాయి. వీటిని తినడం వలన ఊపిరితిత్తులకు, కాలేయానికి హాని కలుగుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మిఠాయిని చేతుల్లోకి తీసుకున్నప్పుడు దాని రంగు చేతులకు అంటుకుంటే అది కల్తీ అయిందని గుర్తించాలి. ఇటువంటి మిఠాయిలకు దూరంగా ఉండటం ఉత్తమమని గ్రహించండి. ఎటు చూసినా దీపాల కాంతులు, కొత్త దుస్తులు, మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడాలతో ఈ పండుగ ఎంత సరదాగా సాగుతుందో అంత హడావుడీ సృష్టిస్తుంది. పండుగ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా మధుర స్మృతిగా సాగాలంటే కొంత సాధన తప్పదు. పండుగ ముగిశాక లాభనష్టాల్ని బేరీజు వేసుకునే కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అపార్టుమెంట్ వాసులైతే, ఖాళీ ప్రదేశంలో అంతా కలసి టపాసులు కాల్చుకుంటే సరదాగా వుంటుంది. అంతా ఒకేసారి విరమిస్తారు కాబట్టి, అర్ధరాత్రి అనవసరపు మోతలు వుండవు. 

హాని కలిగిస్తున్న బాణసంచా
వాతావరణం అంతటా నిండి ఉన్న కాలుష్యాన్ని త్వరితగతిన నిర్మూలించడం కోసం గాలిలో తేలికగా మండే మందుగుండు.. బాణసంచా.. కాల్చడం వలన సూక్ష్మజీవుల వ్యాప్తి అరికట్టి, వాటి తాలూకు దుష్ప్రభావాన్ని పారద్రోలడం ఈ పండుగ లక్ష్యం. అంతవరకూ బాగానే ఉన్నా.. నేటి కాలంలో బాణసంచా వినియోగం కొత్తపుంతలు  తొక్కుతోంది. ఒకళ్లని చూసి ఒకళ్లు ‘నువ్వా! నేనా!’ అన్నట్లు విపరీతంగా కాల్చేయడంతో.. శబ్ద, వాయు కాలుష్యాలు పెరిగిపోతున్నాయి. సంపన్న వర్గాలవారు తమ ఆడంబరానికి తగ్గటు రసాయనిక కారకాలతో తయారుచేసే మందుగుండును వినియోగిస్తున్నారు. దీనివలన అధిక గాఢత కలిగిన వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. కాలుష్యం తరగక పోగా పండుగ పేరుతో.. ఒకటికి రెండు రెట్లు పెరుగుతుండటం శోచనీయం. బాణాసంచా కాల్చటం మనదేశంలో ఐదు వందల సంవత్సరాల నుండే ప్రారంభమైనదని చరిత్ర చెపుతుంది. బాణాసంచా నుండి వచ్చే గంధకం పొగ ఎన్నో రకాల క్రిమి కీటకాలను నాశననం చేస్తుంది. అందుకనే బాణాసంచా కాల్చటం ఒక సంప్రదాయంగా స్థిరపడింది. మనదేశంలో ఒక్క దీపావళి రోజు రాత్రే రెండు వేలకోట్ల రూపాయల విలువైన బాణాసంచా కాలుస్తారని అంచనా.  దీపావళి పండుగ ప్రకృతికి, మనుషులకు, పశుపక్ష్యాదులకు హితం చేకూరుస్తుంది. అయితే, బాణసంచా కాల్చినప్పుడు మన ఆరోగ్యానికి ఎంతో హానికరమైన పీఎం2.5 (2.5 మైక్రాన్ల కన్నా చిన్నవైన పర్టిక్యులేట్ మ్యాటర్) కణాలు, ధూళి వంటివి పరిమితికి మించి దాదాపు 2 వేల రెట్లు ఎక్కువగా వెలువడుతాయి. కాకరపువ్వొత్తులు, తాళ్లు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పాము బిళ్లలు, థౌజండ్ వాలాల వంటివన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన పరిమితిని మించి కొన్ని వందల రెట్లు పీఎం2.5ను వెదజల్లుతున్నాయని నిపుణుల అంచనా. పర్టిక్యులేట్ మ్యాటర్ అంటే గాలిలో ఉండే దుమ్ము, ధూళి, రసాయన కణాలుగా చెప్పవచ్చు. ఇవి 2.5 మైక్రాన్లకన్నా చిన్నవి. మనం శ్వాస పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లోని లోపలి భాగాల్లోకి చొచ్చుకెళతాయి. వాటి కారణంగా ఆస్తమా, అలర్జీలు, న్యుమోనియా, కళ్లు, ముక్కుకు సంబంధించిన వ్యాధులతో పాటు గుండె జబ్బులు, ఊపిరితిత్తుల కేన్సర్ వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. పీఎం 2.5 పార్టికల్స్‌ను కేన్సర్, గుండె జబ్బులకు కారకాలుగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ కేన్సర్ రీసెర్చ్ ప్రకటించింది.

పరిమితి ఎంత?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం పీఎం2.5 పరిమితి 24 గంటల సమయంలో 25 మైక్రోగ్రాములు/మీటర్ మాత్రమే. అదే భారత ప్రభుత్వం నిర్ధారించిన ప్రమాణాల మేరకు 60 మైక్రోగ్రాములు/మీటర్ ఉండవచ్చు. కానీ పాముబిళ్ల నుంచి విడుదలవుతున్నది ఏకంగా 64,500 మైక్రోగ్రాములు/మీటర్. తక్కువగా చిచ్చుబుడ్ల నుంచి విడుదలవుతున్నది 4,860 మైక్రోగ్రాములు/మీటర్ కావడం గమనార్హం. అంటే అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో కాలుష్యం అన్నమాట. బాణసంచా కాల్చినప్పుడు పర్టిక్యులేట్ మేటర్ మాత్రమే కాదు, పలు విషపూరితమైన రసాయనాలూ వెలువడతాయి. వాటిల్లో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి అత్యంత ప్రమాదకరమైన వాయువులు కూడా ఉంటాయి. వీటివలన పిల్లలకే ఎక్కువ ప్రమాదం. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న పిల్లల్లో అయితే ఈ కాలుష్యం కారణంగా విపరీత దుష్పరిణామాలు తలెత్తుతాయి. ముఖ్యంగా పాముబిళ్లలు, చిచ్చుబుడ్లు, మతాబులు వాయు కాలుష్యానికి కారణమైతే క్రేకర్లు, బాంబులు శబ్దకాలుష్యానికి కారణమవుతున్నాయి. బాణసంచా నుంచి వెలువడే వాయువులను వినియోగదారులు అప్పటికప్పుడే పీలుస్తుంటారు కాబట్టి,  అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

దెబ్బతింటున్న స్ఫూర్తి
కోటి కాంతుల వెలుగే దీపావళి. ప్రపంచాన్ని వెలిగించే ప్రయత్నం మంచిదే. కానీ, ఆ క్రమంలో పర్యావరణాన్ని అనారోగ్యకరంగా మార్చుకుంటున్నామా? వెలుగు నింపాల్సిన చోట కాలుష్యం పంచుతున్నామా? అంటే.. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంతో వేడుక స్ఫూర్తి కొంతవరకూ దెబ్బతింటోంది. వెలుగురేఖల వేడుకలో ఈ అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. మరి, క్రాకర్స్ కాలిస్తే వచ్చే పొగ మోతాదు మించనంత వరకూ వాతావరణానికి మంచిదే. దానివల్ల దోమలు నశించి వాతావరణం బాగుపడే అవకాశం ఉంది. దీపావళి అంటే దీపాల పండుగ కదా.. మరి దీంట్లోకి బాణాసంచా ఎక్కడి నుంచి వచ్చింది? తీర్చిన దీపాల వరుస ఆహ్లాదాన్నిస్తుంది. అంతకు మించి చీకటిని ప్రారద్రోలుతూ ప్రమిదలు వెలుగును నింపుతాయి. కానీ, పోటీపడి కాల్చే బాణాసంచా గాలిని, వాతావరణాన్ని పాడు చేస్తోంది. దీనికి తోటు బాణసంచా తయారీలోనే కాదు, అమ్మకంలోనూ జాగ్రత్తలు లోపిస్తున్న ఫలితంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేడుక ఏదైనా అందరికీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ప్రతి ఇల్లూ వెలుగుతో నిండాలి. ప్రతి జీవితం వెలుగుతో ప్రకాశించాలి. ఈ ప్రపంచమంతా వేయిరేకుల వెలుగు పూలతో పరిమళించాలి. బడుగుల బతుకుల్లో వెలుగు నిండాలి. నిరుపేదల కళ్లలో మతాబులు పూయాలి.

పర్యావరణ మేలు 
వర్షఋతువులో క్రిమికీటకాల సంఖ్య పెరిగిపోతుంది. మితంగా బాణసంచా కాల్చడం వల్ల వెలువడే విషవాయువుల బారినపడి ఆ కీటకాలు చనిపోతాయి. తద్వారా పరిసరాల్లోని వాతావరణం పరిశుభ్రమవుతుంది. రాబోయే శీతాకాలపు వాతావరణం స్వచ్ఛంగా ఉండడానికి ఇది ఎంతైనా తోడ్పడుతుంది.బాణసంచాలో గంధకం ఒక ముఖ్య పదార్థం. దీపావళి పండుగ రోజుల్లో ఈ ధాతువు పెద్ద ఎత్తున గాలిలోకి విరజిమ్మబడుతుంది. గంధకపూరిత వాతావరణం పంటల పెరుగుదలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. గంధకంతో కూడిన ఎరువులను వేసినప్పుడు తృణ ధాన్యాల దిగుబడులు బాగా పెరిగినట్టు శాస్త్రవేత్తల అధ్యయనాల్లో వెల్లడైంది. వాతావరణంలో గంధకం భారీ పరిమాణంలో ఉంటే మొక్కలు దాన్ని బాగా పీల్చుకోగలుగుతాయి. వీటి నుంచి వెలువడే గంధకం గ్రామీణ ప్రాంతాల్లో అమిత ప్రయోజనకరమవుతుంది. అయితే, పట్టణాలలోనే అధిక వినియోగం అవుతుంది. శీతాకాలంలో మంచు మరింతగా కురవడానికి తోడ్పడుతుందనీ ఒక అంచనా. మంచు బాగా కురియడం కూడా పంటలకు ఎంతైనా ప్రయోజనకరం.

చివరిగా ఒక మాట 
వెలుగుదివ్వెల దీపావళిని ఆనందోత్సాహాల నడుమ జరుపుకొనేందుకు ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, పటాసులను మితిమీరి కాల్చడం ద్వారా కాలుష్యాన్ని కొనితెచ్చుకోవడమే సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. దీపావళి పండుగ అంటేనే మందుగుండు సామాన్ల మోత అనే విధంగా పరిస్థితి తయారైంది. ఈ విధానానికి మనమంతా స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. వాతావరణాన్ని కలుషితం చేస్తున్న అధిక సాంద్రత కలిగిన బాణసంచాకు సాధ్యమైనంతగా దూరంగా ఉండడం మానవాళికి మంచిది. ఇళ్ల ఎదుట దీపాలు వెలిగించి, స్వీట్లు పంచుకుని, మితంగా బాణసంచా కాల్చుకుంటే, సమాజహితం కోరిన వాళ్లమవుతాం. అత్యున్నత న్యాయస్థానం నిర్దేశం ప్రకారం దీపావళి రోజు రెండు గంటల సేపే బాణసంచా కాలుద్దాం. ఎవరికి వారు సామాజిక బాధ్యతగా ప్రజల్లో అవగాహనను కల్పించేందుకు తోడ్పాటునందిస్తే అదే పర్యావరణ దీపావళి.
సెల్: 9701426788

English Title
Lamp light
Related News