‘పన్ను ఎగవేస్తే తెలిసిపోతుంది’

Updated By ManamThu, 08/09/2018 - 23:22
Sushil-Chandra

Sushil-Chandraన్యూఢిల్లీ: హెచ్చు మొత్తాల్లో పన్ను ఎగవేసిన కేసులను మాత్రమే పరిశీలనకు చేపట్టినట్లు ఆదాయ పన్ను శాఖ గురువారం వెల్లడించింది. అవి 2017-18 అస్సెస్‌మెంట్ సంవత్సరానికి దాఖలైన 6.86 కోట్ల రిటర్నులలో దాదాపు 0.35 శాతం కిందకు మాత్రమే వస్తాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సి.బి.డి.టి) చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. ఆదాయ పన్ను చెల్లింపుదార్ల పట్ల శాఖకు నమ్మకం ఉందని, కానీ, ఎగవేతదార్లను వారి ఇష్టానికి వదిలేసేది లేదని స్పష్టం చేశారు. రిటర్నులు దాఖలు చేసిన వారిలో 99.65 శాతం మంది కలత చెందనవసరం లేదని ఆయన ఇక్కడ ‘అసోచామ్’ నిర్వహించిన ఒక కార్యక్రమంలో చెప్పారు. పరిశీలనకు ఎంచుకున్న 0.35 శాతం కేసుల్లో కూడా 0.15 కేసుల్లో ‘పరిమిత పరిశీలన’ మాత్రమే ఉంటుందని, 0.20 శాతం కేసుల్లో ‘పూర్తి పరిశీలన’ ఉండగలదని ఆయన చెప్పారు. పెద్ద మొత్తాల్లో పన్ను ఎగవేసిన కేసుల్లో మాత్రమే క్షుణ్ణమైన పరిశీలన ఉండగలదని అన్నారు. అలాంటి కేసుల్లో, అస్సెసింగ్ అధికారికి పన్ను చెల్లింపుదారు అనేక పత్రాలు సమర్పించవలసి ఉంటుంది. వారి రిటర్నులను అధ్యయనం చేసిన తర్వాత, కూలంకషమైన పరిశీలనను చేపడతారు. ఐటీ రిటర్నుల పరిశీలన అనేక మంది అస్సెసీలకు సమస్యాయుత అంశంగా ఉండేది. గతంలో ఆదాయ పన్ను రిటర్నులలో సుమారు 1 శాతం రిటర్నులను పరిశీలనకు ఎంచుకునేవారు. ఇప్పుడు దానిని 0.35 శాతానికి తగ్గించారు. పన్ను ఎగవేత పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని పటిష్టపరుస్తున్నట్లు చంద్ర తెలిపారు. శాఖ వద్దనున్న డాటాను ఆధారం చేసుకుని పన్ను అధికారులు గత ఏడాది ప్రాసిక్యూషన్‌కు 4,700 కేసులు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. 

‘‘మీరు మీ డబ్బును ఏ పన్నుల స్వర్గానికన్నా లేదా ఏ దేశానికైనా సరే పంపండి. కానీ, మా వద్ద కూడా వాటిని కనిపెట్టే ఓ వ్యవస్థ ఉంది. అనేక దేశాలతో మాకు స్వయంచాలిత సమాచార మార్పిడి వ్యవస్థ ఉంది. ఎవరూ తప్పించుకోలేరు. ఆటోవేుటిక్‌గా మాకు సమాచారం వచ్చేస్తుంది. జనం (ఎగవేతదారులు) సరిహద్దులు చాలా దూరాన ఉన్నాయని అనుకోవచ్చు. కానీ, వివిధ దేశాల ఆర్థిక సరిహద్దులు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి’’ అని చంద్ర అన్నారు. వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉందో లేదో తెలిపే సూచికలో ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకునే విధంగా ఇండియాకు సాయపడేందుకు పన్నుల దాఖలు నియమాలను ఆదాయ పన్ను శాఖ మరింత సరళం చేస్తుందని చంద్ర అన్నారు. పన్ను ఎగవేతదార్ల మనసులో భయాన్ని రేకెత్తించేందుకే ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్య చేపడుతున్నామని ఆయన అన్నారు. సి.బి.డి.టి2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను రూపంలో రూ. 10.03 లక్షల కోట్ల రెవిన్యూ గడించింది. ఇది అంతకుముందు ఏడాది కన్నా 18 శాతం వృద్ధి చెందింది. 

English Title
'Know if the tax breaks out'
Related News