కందుకూరి కబుర్లు -5

Updated By ManamMon, 05/14/2018 - 00:51
kandukuri

imageచిత్రపు కామరాజు,  కందుకూరి  జీవిత చరిత్రలో ఒకటి రెండుసార్లు  తారసిల్లే వ్యక్తి. ఈయన  మండల  దొరతనం తరపున ప్రభుత్వ న్యాయవాదిగా ఉండేకాలంలో, యువకు డైన  కందుకూరి, వీరి వద్ద  కొద్ది  కాలం ప్లీడర్ గుమాస్తా పనిచేస్తారు. అయితే ఈయన వేశ్యలతో ఇంటకాలం గడ పడం,  వారితో  ఎబ్బెట్టు ప్రవర్తన చూశాక,  రోజుకి మూడు గంటలు పనిచేస్తే వచ్చే ఇరవై రూపాయల ఉద్యోగం మాను కుంటాడు.  ఈయన  కాలక్రమంలో న్యాయవాదిగా   రాజ మండ్రి ప్రాంతంలో పలుకుబడి, బలగం గల వ్యక్తిగా  ఎదు గుతారు. అయితే, వీరి బంధువైన పోలూరి శ్రీరాములు  జి ల్లా మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా పదవిలోకి వచ్చాక, ఇద్దరూ కలిసి  తీర్పులకు  ఆయా  సెక్షన్ల సంఖ్య  చెప్తూ,  ఇరుపక్షాల కక్షి న్యాయవాదులు,  న్యాయం వేలంపాట  పాడుకున్నాక, ఏ సెక్షన్ దగ్గర పాట ఆగిందో, ఆ సొమ్ము రాత్రికి తమకు ముట్టాక , చిత్తుప్రతి తీర్పు తొలగించి, దానిస్థానే మార్చి రాసిన తీర్పులను చెప్తూ  న్యాయవ్యవస్థకి చేటు తెస్తున్నారని  విని, వివేకవర్ధని పత్రికలో ఈ విషయం రాస్తారు వీరేశలింగం గారు. 

ఇదే  తెలుగు పాత్రికేయ చరిత్రలో 1870-1880 కాలం లోనే బహుశా తొలి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని చెప్పవచ్చు. ఈ  కేసులో ఎలాగైనా  సాక్ష్యాల  సేకరణ కోసం, శ్రమించి, చివరకు, శ్రీరాములుకి సహాయపడుతున్న చిత్రపు కామ రా జు, తాను చిత్తుప్రతులు రాస్తూ, ఏదో ఒకబేరం కుదిరాకా, వాటిని చించి  చిత్తుబుట్టలో పారేస్తున్న సంగతి, ఆ చిత్తుబు ట్టలో కాగితమ్ముక్కలు ఎక్కడ పారబోస్తున్నదీ, ఆరా తీస్తారు. వాటిని ఆ చెత్త పారేసే చోటు నుంచి,  మెల్లమెల్లగా రెండు మూడుబస్తాలు సేకరించాక, ఆ ముక్కలను జతకూర్చి, కా మరాజు రాసిన మొదటి తీర్పుల నమూనాలు తయారు చేసి, వీరిని కోర్ట్‌లో ఎదుర్కుంటారు కందుకూరి. ఈ పరి ణామం  ఊహించని   శ్రీరాములు, కామరాజు, పెద్ద ఎత్తున ధనం ఇచ్చి  వీరివద్ద ఉన్న ఆ చిత్తుకాగితాల బస్తాలను కొనే యాలని ప్రయత్నం చేస్తారు. అదీచాలక, ఒకసారి చిత్తు కాగి తాలు కొనుక్కునే వాడిని పంపించి, వీరేశలింగం ఇంటలేని సమయంలో, ఆ చిత్తు కాగితాలను కొనేసి, తగులబెట్టిస్తారు.. అయినా, తాను, తన మిత్రులు ఎర్చి కూర్చిన కొన్ని ప్రతుల ద్వారా, సెటిల్ అయిన కేసుల, అసలు తీర్పులు మొదట ఎలా ఉండేవో, తరువాత ఎలా మారేవో, చెప్పడానికి,  కొన్ని అందరికీ తెలిసిన సాక్ష్యాలు, అలాగే, చివరికి  తనమిత్రులకు సైతం చెప్పకుండా తాను దాచి ఉంచిన తొలితీర్పుల ముక్క లు అన్నీ అంటించిన నకళ్ళు సిద్ధం చేసుకున్నారు కందుకూ రి. కేసు నుంచి వెనక్కు తగ్గిపోమ్మని, ఆ రోజుల్లోనే అయిదు వేల రూపాయలు ఇస్తామని  కందుకూరికి రాయబారాలు, వర్తమానాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో  వస్తారనుకున్న సాక్షులు రాకపోవడం, కొందరు వారిచ్చిన ధనం తీసుకుని  తమ సాక్ష్యం తారుమారు చేయడం, ఇవన్నీ ఓ పక్కనుంచి  జరుగుతూనే ఉంటాయి. చివరికి కోర్ట్‌కి సమర్పించబడిన  తీర్పుల సాక్ష్యాల  కాగితాలు కూడా,  ముందుగానే ఏర్పాటు చేసిన పథకం ద్వారా, కోర్ట్ శిరస్తాదారు రోజారియో దొర  కార్యాలయంలో దొంగలు పడి, ఎత్తుకెళ్లడం దాకా వెళ్తుంది.

 ఈ వ్యవహారంలో చేతులు  కలిపిన శిరస్తాదారు రోజారియో దొర, ఉద్యోగం కోల్పోగా, కేసు స్పష్టంగా తనకు వ్యతిరేకం అని ఊహించిన కామరాజు ఆత్మహత్య చేసుకోగా, లంచగొం డిగా తీర్పులిచ్చిన శ్రీరాములు కూడా కొన్నినాళ్ళకు  చనిపోవ డం జరిగింది. ఇది ఆత్మహత్యేనని లోకులమాట. ఇలా  తొలి పరిశోధనాత్మక జర్నలిస్ట్‌గా, కోర్ట్‌కు సైతం వెళ్లి, తన  పత్రిక లో వచ్చిన  రిపోర్ట్  పక్షాన  నిలబడి,  సంచలనం సృష్టించిన పాత్రికేయుడు  కందుకూరి. ఈ సంఘటననే  శ్రీశ్రీ, ‘వీరేశలింగం చిత్తు కాగితాల బుట్ట సంగతి వినే ఉంటారు’ అని ప్రస్తావన చేస్తారు, తాను రాసిన  ‘అనామిక’ అనే కథలో. ఇదే దృ శ్యాన్ని తరువాత కొన్ని మార్పుల తో వాడుకున్న తెలుగు సినిమా లున్నాయి. చంపారన్ న్యాయస్థానంలో గాంధీ ఎలా తన కేసు తానే వాదించుకుంటూ, జూర్మానా కట్టనిరాకరిస్తాడో, అ లా కందుకూరి కూడా, ఒకవార్త ప్రచురించాక కోర్ట్‌కి  సమన్లు వచ్చి వెళ్లవలసివచ్చినప్పుడు, న్యాయస్థానంలో ఈ వార్త మీరే రాశారా అని జడ్జి అడగగా, ‘మీకు సమాధానం చెప్పడానికి ముందర, ఏ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం మీరు  నాకీ ఆజ్ఞాపత్రిక పంపారో చెప్పమని’ ప్రశ్న వేస్తారు. అది నమో దు చేసి, జడ్జి, ‘ఈ పత్రికను మీరే నడుపుతున్నారా?’ అని ప్రశ్నవేయగా, ‘నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్ప లే దు, కనుక ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పడానికి  బద్ధుడనా  కాదా?’ చెప్పమని తిరిగి ప్రశ్నిస్తారు కందుకూరి. జవాబు ఇ వ్వాల్సిన  బాధ్యత ఉన్నదని జడ్జి చెప్పరు, ‘అలా అయితే, బద్ధుడ్ని కాకపోతే జవాబు చెప్పుట నాకిష్టము లేదు’ అని వీరే శలింగం పలుకగా, ‘మిమ్మల్ని  అట్టేసేపు ఉంచుట నాకిష్టము లేదు’ అన్నది జడ్జి వ్యాఖ్య, ‘సంతోషము’ అని బయట కొస్తారు కందుకూరి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత గాంధీ అమలుచేసిన సహాయ నిరాకరణ లాంటిదే, అనంగీ కారంతో కూడిన స్పష్టమైన ధోరణి-కందుకూరి పంథా కూడా. వీరేశలింగం వ్యక్తిత్వం తెలియాలీ అంటే వీటిని సరైన కోణంలో నేటితరాలకు పరిచయం చేయాలి. కందుకూరి నడిపిన వివేకవర్ధిని, ఆ రోజుల్లో సరైన చదువులు లేకుండా, డిగ్రీలు కొనుక్కుని న్యాయవాది పట్టాలు పొందిన వారి  సంగతి, అలా ధనానికి పట్టాలు ప్రదానం చేసిన వైనం రాస్తే, ఆ కొత్తప్లీడర్లు, ఆ పట్టాలకు  దూరమైపోయారు. వేశ్యలకు పెళ్లిళ్లలో చదివింపులు (వసూళ్లు అంటారు) కూడదు అని  వివేకవర్ధిని పేర్కొన్నది.

ఒకవేశ్యకు ఒక న్యాయవాది కన్నెరికం చేయగా, ఆ విషయం బయటపెట్టిన పత్రిక వివేకవర్ధిని. పత్రిక కోసం పనిచేసే సబ్‌రిపోర్టర్ (ఉపవిలేఖరి) సిబ్బందికి వ్యక్తిగత ఇబ్బందులు కలగకుండా, ఆ ఇబ్బందులు ముందు తనతోనే మొదలు కావాలని ముందు నిలబడిన  జర్నలిస్ట్, ఎడిటర్, పబ్లిషర్ కందుకూరి.  కందుకూరి ‘గద్య తిక్కన’గా పేరొందినా, కొంత కవిత్వం కూడా రాశారు, అవి పద్య నాటకాల రూపంలో ఉన్నాయి. అలాగే 1874 ప్రాంతంలో ధవళేశ్వరంలో మిత్రుల కోరిక మీద అష్టావధానం కూడా చేశారు. ఇదిపెద్దగా ప్రచారం లోకి వచ్చి, నలుగురికీ తెలియకుండానే జరిగిపోవడంతో, మరొకసారి చేయవలసిందని మిత్ర మండలి, పెద్దలు కోరగా, కందుకూరి ఒకటి రెండుసార్లు రాజమండ్రిలో అష్టావధానాలు  చేశారు. ‘బ్రాహ్మవివాహము’ అనే నాటకాన్ని కందుకూరి దురా చారాలకు వ్యతిరేకంగా రాశారు. అలుపెరుగని వితంతు కళ్యాణ దీక్షా తరంగంగా, మహిళాభ్యుదయ చేతనాతు రంగంగా, ఆచార పర్వతాలను ఢీకొన్న ప్ర బుద్ధ మాతంగంగా  వీరేశలింగం ఎదిగిన తీరు నిరుపమానమైనది.          

సరళీకరణ-సంకలనం 
 రామతీర్థ
98492 00385 

English Title
kandukuri kaburrlu
Related News