భారత్‌లోనే ఐపీఎల్

ipl
  • ప్రకటించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌కి ముహుర్తం ఖరారైంది. ఈ ఏడాది ఐపీఎల్ జరిగే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్‌ని విదేశాల్లో నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, బోర్డు మాత్రం ఐపీఎల్ 2019 సీజన్‌ను భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ‘ఐపీఎల్ 2019 సీజన్‌ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై మంగళవారం బీసీసీఐ పాలకుల కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ప్రాథమిక చర్చల అనంతరం జాతీయ, రాష్ట ఏజెన్సీల అంచనా ప్రకారం 12వ ఎడిషన్‌ను భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మార్చి 23, 2019న ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభమవుతుంది. బోర్డు అధికారులతో సమావేశమైన తర్వాత పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తాం. ఐపీఎల్ 2019 షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందు స్టేక్ హోల్డర్స్‌తో బీసీసీఐ పాలకుల కమిటీ సమావేశం కానుంది’ అని బీసీసీఐ అందులో పేర్కొంది. క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ మళ్లీ వచ్చేస్తోంది. దాదాపు 60 రోజుల పాటు ఉత్కంఠ మ్యాచ్‌లతో వీక్షకుల్ని మునివేళ్లపై నిలబెడుతూ.. హిట్టర్ల సిక్సర్లు, బౌలర్ల సంబరాలతో దేశంలోని స్టేడియాలు హోరెత్తిపోనున్నాయి. మార్చి 23న ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీ మే నెల రెండో వారంలో ముగిసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రస్తుతం బీసీసీఐ షెడ్యూల్‌ని రూపొందిస్తుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానం చెపాక్‌లో ఈ టోర్నీ తొలి మ్యాచ్ జరగనుంది. గత ఏడాది ఏప్రిల్ 7న ప్రారంభమైన ఈ ఐపీఎల్ సీజన్.. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు వారాలు ముందే ఆరంభంకానుంది. ఐపీఎల్‌లో ఉన్న జట్లు: చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరు మార్చుకుంది) ఇటీవల జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలంలో కొన్ని ఫ్రాంఛైజీలు పవర్ హిట్టర్లని ప్రత్యేకంగా కొనుగోలు చేశాయి. దీంతో.. వారు ఏ మేరకు టోర్నీలో సత్తాచాటుతారో..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు.. గత ఏడాది బాల్ టాంపరింగ్ కారణంగా నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్), స్టీవ్ స్మిత్ (రాజస్థాన్) మళ్లీ ఈ ఏడాది టోర్నీలోకి పునరాగమం చేయనున్నారు. వేలంలో హిట్టర్లని కొనుగోలు చేసిన జట్లని ఓసారి పరిశీలిస్తే..! సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (రూ. కోటి)ను కొనుగోలు చేసింది. శిఖర్ ధావన్ స్థానంలో అతను ఆడే అవకాశం ఉంది. ఇక బెంగళూరు ఫ్రాంఛైజీ.. విండీస్ హిట్టర్ హిట్మెయర్ (రూ. 4.2 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఇటీవల భారత్‌పై హెట్మెయర్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్.. వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (రూ. కోటి)ని చేజిక్కించుకుంది. అతను రాణించడంపై అనుమానాలు నెలకొన్నా.. ప్రపంచకప్ నేపథ్యంలో.. ఈ సీనియర్ హిట్టర్ చెలరేగే అవకాశమూ లేకపోలేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ.. హైదరాబాద్ నుంచి శిఖర్ ధావన్‌ని బదిలీపై తీసుకుంది. దీంతో.. ఈ గబ్బర్ సొంత నగరం జట్టు కోసం ఎలా చెలరేగుతాడో..? చూడాలి. కోల్‌కతా నైట్‌రైడర్స్.. 2016 టీ20 ప్రపంచకప్ 6,6,6,6 హీరో కార్లోస్ బ్రాత్‌వైట్ (రూ.5.2 కోట్లు)ని తీసుకుంది. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. ఆ టోర్నీకి కనీసం 15రోజులు ముందే ఐపీఎల్ 2019 సీజన్ ముగియాల్సి ఉంది. ఈ మేరకు లోధా కమిటీ బీసీసీఐకి గతంలోనే షరతు విధించింది. దీంతో.. ఫ్రాంఛైజీల అభిప్రాయాలని సేకరించనున్న బీసీసీఐ.. త్వరలోనే పూర్తి స్థాయిలో షెడ్యూల్ ప్రకటించనుంది. 

సంబంధిత వార్తలు