కాంగ్రెస్ మహామహుల గెలుపోటములపై సర్వత్రా ఆసక్తి

Uttam Kumar Reddy
  • ఉత్తమ్, జానా, భట్టి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, రేవంత్ భవితవ్యంపై ఓటింగ్ నేడే

హైదరాబాద్: శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. శుక్రవారం  జరిగే ఎన్నికలు పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించనున్నాయి. తెలంగాణ ఎన్నికలు దేశ రాజకీయాల ముఖచిత్రాన్నే మార్చనున్నాయనే అనుకుంటున్నందున  ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా గడచిన నెలరోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. రాష్ట్ర నాయకులేగాక జాతీయ స్థాయి నాయకులు సైతం తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. బరిలో ఉన్న అందరు అభ్యర్థుల కంటె సీఎం పదవి కోసం పోటీ పడుతున్న మహామహుల భవితవ్యంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ  ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కాంగ్రెస్ పార్టీ జట్టుకట్టి ప్రజాఫ్రంట్‌ను ఏర్పాటు చేసింది. వాటితో పాటు మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి (ఎంఆర్‌పీఎస్ ), బీసీ సంక్షేమ సంఘం , తెలంగాణ ఇంటిపార్టీ, ప్రజాగాయకుడు గద్దర్ ,ముస్లింలీగ్ కూడా పీపుల్స్ ఫ్రంట్‌కు  మద్దతు పలికాయి. కూటమి పార్టీల నేతలు సర్వశక్తులు ఒడ్డి అభ్యర్థుల గెలుపు కోసం పోటాపోటీగా  ప్రచారం నిర్వహించారు. మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో పోటీ చేస్తోంది. అన్ని స్థానాల్లో కంటె సీనియర్లు పోటీ చేస్తున్న స్థానాల్లో గెలుపుపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. సీఎం పదవి కోసం పోటీలో ఉంటారన్న సీనియర్లలో  ఎవరు గెలుస్తారు ? ఓడిపోయేవారెవరన్న విషయం శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో తేలనుంది.  గత ంలో జరిగిన ఎన్నికల్లో ఎవరికి వారు తమ గెలుపు కోసం కృషి చెయ్యడమే గాక, తమకు సీఎం పదవిలో పోటీ పడతారన్న వారిని ఓడించేందుకు కుట్రలు పన్నే వారన్న విమర్శలు ఉన్నాయి. కానీ, ఈ ఎన్నికల్లో అలాంటి కుట్రలకు అతీతంగా ప్రచారం జరిగిందని కాంగ్రెస్ నేతలు ఖుషీగా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం గడతారన్న ఆశలు వారిలో నెలకొన్నాయి. టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, కో చైర్ పర్సన్ డీకే అరుణ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ జే గీతారెడ్డి, ఎ రేవంత్ రెడ్డి తమ గెలుపు కోసం గత నెలరోజుల నుంచి తమ నియోజకవర్గాల్లోనే తిష్టవేసి ప్రచారబరిలో ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల నుంచి గట్టి పోటి ఎదురవుతున్నందున డూఆర్ డై అనే విధంగా ప్రచారం చేశారు. 

    టీఆర్‌ఎస్  అధ్యక్షుడు కేసీఆర్ ఎప్పటికప్పుడు వేస్తున్న ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు వారు సైతం తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి తప్ప మిగతా నేతలు గత పక్షం రోజులుగా  నియోజకవర్గం గడపదాటిరాలేదు. భట్టి విక్రమార్క మధిరకే పరిమితం కాగా, జానారెడ్డి నాగార్జున సాగర్ దాటిరాలేదు.  అదే విధంగా డీకే అరుణ గద్వాలకు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, గీతారెడ్డి జహీరాబాద్‌లోనే ఉండి గెలుపుకై  తీవ్రంగా కృషి చేశారు. ముఖ్యనేతలు ప్రచారంలో తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారని గుర్తించిన ఎఐసీసీ ఢిల్లీ నుంచే రిమోట్ ద్వారా ప్రచారాన్ని పర్యవేక్షించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, సోనియాగాంధీ తెలంగాణలో మాత్రమే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం విశేషం. మేడ్చల్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె పాల్గొన్ని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. నాలుగేళ్ల తన బిడ్డను చూసుకునేందుకే వచ్చానని, బిడ్డ బలపడాలంటే పౌష్టికాహారం అందాలని, అలాంటిది తెలంగాణలో అందటంలేదని కేసీఆర్ పై ఆమె పరోక్షంగా చేసిన విమర్శలు కాంగ్రెస్ పార్టీకి టానిక్‌గా మారాయి. సోనియా వ్యాఖ్యలను తమ ప్రచార సభల్లో, సోషల్ మీడియా, ఫేస్ బుక్,ట్విట్టర్, ఇన్స్‌ట్రాగ్రాంలలో విస్తృతంగా ప్రచారం చేశారు. సోనియాతో పాటు ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. 20 కి పైగా బహిరంగ సభల్లో పాల్గొని కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు గుప్పించారు. ఈ సభలకు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు చెందిన ప్రజలను కూడా తరలించి సభలను సక్సెస్ చేసుకున్నారు. సోనియా, రాహుల్‌తో పాటు స్టార్ క్యాంపెయినర్లు  పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, సినీనటులు విజయశాంతి, ఖుష్బూ సుందర్ , నగ్మా, కర్నాటక, తమిళనాడు పీసీసీ అధ్యక్షులు, రాజ్యసభలో విపక్ష నాయకుడు గులాంనబీఆజాద్, కేంద్ర మాజీ మంత్రులు కపిల్ సిబాల్, మనీష్‌తివారీ, పి చిదంబరం, కర్నాటక మంత్రి డీకే శివకుమార్, ఎఐసీసీ అధికార ప్రతినిధులు రణదీప్ సుర్జేవాలా, ఎంపి ప్రొఫెసర్ రాజీవ్ గౌడ, అభిషేక్ మనుసింఘ్వీ, ఎంపి,మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్,మహారాష్ట్ర మాజీ సీఎం పృద్వీరాజ్ చౌహాన్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ విస్తృతంగా రాష్ట్రమంతా పర్యటించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ డాక్టర్ రామచంద్రకుంతియా, ఎఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస క్రిష్ణన్, మధుయాష్కీ గౌడ్ ,తమిళనాడు పార్టీ ఇంచార్జీ సిరివెళ్ల ప్రసాద్ స్థానికంగా వ్యూహరచన చేశారు. రాహుల్ కోర్ టీం మెంబర్ కొప్పుల రాజు ఢిల్లీ కేంద్రంగా ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచారం, గెలుపోటములు, పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు రాహుల్‌కు సమాచారాన్ని అందించారు. వారితో పాటు ఎపీ సీఎం చంద్రబాబునాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, ఎంఆర్‌పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం నేతలు కూడా కూటమి అభ్యర్థుల గెలుపుకై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 

సంబంధిత వార్తలు