తుది జట్టులో విహారి, రోహిత్

vihari

ఆస్ట్రేలియాతో గురువారమిక్కడ ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌కు టీమిండియా 12 మంది సభ్యుల తుది జట్టును ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి, రోహిత్ శర్మలకు చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నలుగురు బౌలర్ల ప్రణాళికను రచించింది. మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా పేస్ అటాక్‌ను నడిపించనుండగా.. ఏకైక స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌లో ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈసారి ఆస్ట్రేలియా మీడియా ప్రవర్తన కూడా తేడాగా ఉంది. సాధారణంగా పర్యాటక జట్టును టార్గెట్ చేస్తూ ఆస్ట్రేలియా మీడియా, ప్లేయర్స్ మైండ్ గేమ్ ఆడతారు. కానీ ఈసారి అటువంటిది కనపించడం లేదు. ఎందుకంటే వాళ్లు కవ్విస్తే కోహ్లీ మరింత రెచ్చిపోయే అవకాశముంది. ఒకవేళ స్మిత్, వార్నర్ జట్టులో ఉండివుంటే అదే జరిగేదేమో. మరోవైపు వీళ్లిద్దరి నిషేధం తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఏ ఫార్మాట్‌లోనూ ఒక్క సిరీస్ కూడా గెలవక పోవడం ఆ దేశపు మీడియా మౌనానికి కారణం కావచ్చు. ఆస్ట్రేలియా జట్టు కూడా తుది జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్‌కు బదులుగా పీటర్ హ్యాండ్‌స్కంబ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇరు జట్లలోనూ సమర్థవంతమైన బౌలింగ్ అటాక్ ఉండటంతో ఈ టెస్టు సిరీస్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

తుది జట్లు
ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, చెటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా. ఆస్ట్రేలియా: టిమ్ పెయిన్ (కెప్టెన్), మార్కస్ హారిస్, ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖ్వాజా, షాన్ మార్ష్, పీటర్ హాండ్‌స్కంబ్, ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథాన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.

Tags

సంబంధిత వార్తలు