తిరుమల ప్రతిష్ఠ దిగజారిస్తే ఉపేక్షించం

Updated By ManamThu, 05/17/2018 - 23:19
ke
  • అర్చకుల మధ్య తగాదాల వల్లే వివాదాలు.. రమణదీక్షితులు రాజకీయ వృత్తి తీసుకున్నారా?

  • ప్రెస్‌మీట్లు పెట్టి ఆలయ నియమం అతిక్రమణ.. ప్రతిష్ఠ పెంచాల్సిన వ్యక్తే దిగజారిస్తే ఎలా?

  • ఆయనపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తాం.. తిరుమల ఔన్నత్యాన్ని కాపాడుతాం: కేఈ 

keఅమరావతి: తిరుమల ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, రమణదీక్షితులు తనకు నిర్దేశించిన విధులకు పరిమితమైతే మంచిదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. అర్చకుల మధ్య ఉన్న తగాదాలే టీటీడీ, తిరుమలలో వివాదాలకు కారణమవుతున్నాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ లో ఏటా స్వామివారి ఆభరణాల విషయంలో ఆడిట్ జరుగుతోందని చెప్పారు. తిరుమలలో వీఐపీ దర్శన విషయంలో నియంత్రణ అవసరమని ఉపముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తన సాంప్రదాయ అర్చక వృత్తిని మర్చిపోయి రాజకీయ వృత్తిని తీసుకున్నట్లు కనబడుతుందని ఎద్దేవా చేశారు. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటుందని, రమణదీక్షితులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఇతర అర్చకులకు ఆదర్శంగా ఉండాల్సిందిపోయి, ఆయన తన హోదా మరిచి ప్రవర్తిస్తున్నారని విమర్శిం చారు. ప్రధాన అర్చకుడు పత్రికా సమా వేశం పెట్టి, రాజకీయాలు మాట్లాడడం ఆలయ నియమాలను అతిక్రమించ డమేనన్నారు. ఆలయ ప్రతిష్ఠను దిగజా ర్చాలని ప్రయత్నం చేసేవారికి పతనం ప్రారంభమైనట్లేనని ఆయన మండిపడ్డారు. ఏడు కొండలు ఎందుకు.. మూడు కొండలే చాలు అన్నవారి పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. మిరాశీ వ్యవస్థను రద్దు చేసిన సమయంలో 1996 సంవత్సరంలో మిరాశీదారులుగా ఉన్న రమణ దీక్షితులు స్వామివారి నగలన్నీ భధ్రంగానే ఉన్నాయని అంగీకరించిన విషయాన్ని కేఈ గుర్తు చేశారు. ఏటా స్వామివారి ఆభరణాలను అధికారులు ఆడిట్ చేస్తున్నారని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ఆభరణాల వాడకం, వాటి భద్రత విషయంలో జస్టిస్ శ్రీజగన్నాధరావు కమిటీ, జస్టిస్ వాద్వా కమిటీ సమగ్రంగా విచారణ జరిపి సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీటీడీలో ప్రతీ సంవత్సరం పటిష్ఠమైన ఆడిట్ జరుగుతుం దని, ఫైనాన్సియల్ అడ్వైజర్‌తో పాటు, ముగ్గురు అధికారుల ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలు సాగుతాయని కేఈ చెప్పారు.

స్వామివారికి సేవ చేయడం వల్లే గౌరవం
ఆలయ ప్రతిష్ఠను పెంపొందించాల్సిన వ్యక్తే, నిబంధనలను అతిక్రమించి తన మనువడిని అంతరాలయంలోకి తీసుకెళ్లడం, స్వయంగా తానే వీఐపీల అతిధి గృహాలకు వెళ్లి, వారికి ఆశీర్వచనాలు తెలపడం సాంప్రదాయ ఉల్లంఘన కాదా అని ఉపముఖ్యమంత్రి ప్రశ్నించారు. స్వామి సేవకంటే రమణ దీక్షితులు ధనికుల సేవే పరమావధిగా భావిస్తున్నారని విమర్శించారు. స్వామివారి దగ్గర పనిచేయడం వల్లే రమణ దీక్షితులకు గౌరవం లభిస్తుందన్నారు. స్వామివారికి తనవల్లే ఇంత ప్రాచుర్యం వచ్చిందనే అహంకార ధోరణితో ఆయన వ్యవహరిస్తున్నారని తెలిపారు. అర్చకుల్లో ఉన్న పరస్పర తగాదాలు టీటీడీలో వివాదాలకు కారణమవుతున్నాయని అన్నారు. తిరుమల ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమని, దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని చెప్పారు. తిరుమల అధ్యాత్మికతకు భంగం కలిగిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలను ఈ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా, తిరుమల ఔనత్యాన్ని కాపాడడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేఈ పేర్కొన్నారు.

Tags
English Title
Do not ignore the degradation of the Thirumala




Related News