కౌలు ధర తగ్గించండి

Updated By ManamThu, 05/17/2018 - 22:32
farmer
  • పెట్టుబడి సాయం మేర తగ్గించాలని కౌలు రైతుల డిమాండ్ 

  • కుదరదంటున్న పలువురు భూ యజమానులు

  • కొన్ని చోట్ల పెట్టుబడి సాయం చెరిసగం.. పరస్పర అవగాహన అవసరం: ప్రభుత్వం

farmerహైదరాబాద్: రాష్ట్ర అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న రైతుబంధు పథకం ప్రభావరం కౌలు ధరలపై పడింది. కౌలు ధరను తగ్గిస్తేనే, భూమిని కౌలుకు తీసుకుంటామని రాష్ట్ర వ్యాప్తం గా కౌలు రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో కౌలు రైతులు సంఘంగా ఏర్పడ్డారు. ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4వేలు సాయాన్ని ఇస్తున్న నేపథ్యంలో ఆ మేర కౌలు ధరను తగ్గించాలని  కౌలు రైతులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మాకు ఇచ్చిన సాయాన్ని మీకేలా ఇస్తామంటూ భూయజమానులు కౌలుదారులతో వాదిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం నగదు అందజేస్తోంది. భూమిని ఎవరు చేస్తారో వారికి ఆ నగదు అందితే ప్రభుత్వ లక్ష్యం సాకారం అవుతుంది.

 పరస్పర అవగాహన అవసరం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ముందస్తు పెట్టుబడిగా ఎకరాకు రూ.4వేలు అందిస్తోంది. అయితే ఈ నగదును కేవలం భూయాజమానుల పేరు మీద మాత్రమే ఇస్తోంది. దీంతో కౌలు రైతులు కొంతమేర నిరాశకు గురయ్యారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎవరు భూమిని సాగు చేస్తే వారికే పెట్టుబడి సాయం చెందాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఎవరు భూమిని సాగు చేస్తున్నారనే విషయం తేల్చడం కష్టమైన పని. ఈ నేపథ్యంలో కౌలు రైతులు, భూయాజమానులు పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని ప్రభుత్వం సూచించింది. ఎవరైనా తమ భూమిని ఇతరులకు కౌలుకు ఇస్తే.. పెట్టుబడి సాయాన్ని కౌలుదారులకు అందజేస్తే బాగుంటుందని సూచించింది. పలు సాంకేతిక కారణాల వల్ల కౌలురైతులకు అధికారికంగా పెట్టుబడి సాయం ఇవ్వడం సాధ్యపడడంలేదు.

కొన్నిచోట్ల చెరో రూ.2వేలు..
కొన్ని గ్రామాలకు చెందిన కౌలు రైతులు అధిక ధరలకు భూమిని తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో చాలామంది భూమి సాగు చేయలేని యజమానులు మధ్యే మార్గాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వేలల్లో భూమి యజమానికి రూ.రెండు వేలు, పంటను సాగు చేస్తున్నందుకు కౌలు రైతుకు రూ.రెండు వేల చొప్పున తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు.

కౌలు రైతులకు బీమా ‘నో’
 రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న ‘రైతు బీమా’ పథకం కూడా కౌలు రైతులకు వర్తించదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాగులో నష్టాలు వస్తే.. వాటిని భరించేది కౌలురైతులే. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో కౌలు రైతులే అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో రైతు బీమాను కౌలు రైతులకు వర్తింపజేస్తేనే.. పథకానికి ప్రయోజనం, సార్థకత ఉంటుందని  పలువురు అభిప్రాయపడుతున్నారు. తమకు రైతు బీమా పథకం అమలు చేయాలని కౌలు రైతులు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags
English Title
Decrease the price of the lease
Related News