ఛెబ్బీస్ జనవరిని ఘనంగా జరపాలి

sk Joshi
  • సర్కారీ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష

  • బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు

  • గణతంత్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న పరేడ్ గ్రౌండ్

  • అమర వీరుల సైనిక స్మారక్ వద్ద పుష్పగుచ్చం సమర్పించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్: జనవరి 26న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా వివిధ బిభాగాల అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి  సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖల అధికారులతో బుధవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. జనవరి 26 న ఉదయం పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ హాజరవుతారని చెప్పారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ద్వారా పరేడ్ గ్రౌండ్స్‌లో పారిశుధ్యం, మొబైల్ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని గన్‌పార్క్, క్లాక్ టవర్, ఫతేమైదాన్‌లను విద్యుద్ధీకరించాలని సూచించారు. రహదారులు, భవనాల శాఖ ద్వారా  బ్యారికేడింగ్,సీటింగ్, సైనేజ్‌లతో పాటు రాజ్ భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్‌లతో పాటు చారిత్రక ప్రాధాన్యత భవనాలను విద్యుత్ దీపాలను దగ దగలాడేలా అలంకరించాలన్నారు. విద్యుత్ శాఖ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా, మెట్రో వాటర్ వరక్స్ ద్వారా మంచినీటి సరఫరా, సమాచార శాఖ ద్వారామీడియా కు ఏర్పాట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఎల్‌ఈడిటివిలు, వ్యాఖ్యాతల నియామకం, వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా పరేడ్ గ్రౌండ్‌లో పుష్పాలతో అలంకరణ వినూత్నంగా ఉండాలని సూచించారు. ఈ వేడుకలకు హాజరయ్యే పాఠశాల విద్యార్ధుల కోసం ఆర్టీసి ద్వారా ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేయాలని అదేశించారు. స్టేడియం సమీపంలో అంబులెన్స్, అగ్నిమాపక ఏర్పాట్లు ఉండాలన్నారు. అమర వీరుల సైనిక స్మారక్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుష్పగుచ్చం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిఏడి ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా, రహదారులు, భవనాల శాఖ  ముఖ్య కార్యదర్శి  సునీల్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమీషనర్ దానకిశోర్, శ్రీనివాస్, వింగ్ కమాండర్, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫేర్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్, అడిషనల్ డిజి  జితెందర్, ఎం.కె.సింగ్, అభిలాష్ బెస్త్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గోపికృష్ణ, హైదరాబాద్ కలెక్టర్ రఘునందన్ రావు, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, టీఎస్‌ఎస్‌పీడీసీల్ సీఎండి రఘుమారెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సమాచార శాఖ చీఫ్ ఇన్ ఫర్ మేషన్ ఇంజనీర్ కిషోర్ బాబు, మిలిటరీ, కంటోన్మెంట్ బోర్డ్, అగ్నిమాపక, స్కౌట్ అండ్ గైడ్స్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags

సంబంధిత వార్తలు