100 కోట్లు కట్టండి

Rahul gandhi
  • రాహుల్, సోనియాలకు ఆదాయపన్ను నోటీసులు

  • రూ. 310 కోట్ల ఆదాయం దాచివేత.. 2011-12 ఎసెస్‌మెంట్ సంవత్సరం

  • రీఎసెస్‌మెంట్ ప్రారంభించిన ఐటీశాఖ.. రాహుల్‌కు రూ. 68.1 లక్షల ఆదాయం!

  • ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు రూ. 49 కోట్లు.. ఏజేఎల్ కేసు సంబంధిత ఆదాయం

  • సుప్రీం కోర్టుకూ తెలిపిన ఐటీ శాఖ.. నోటీసులు ఇచ్చేందుకు సుప్రీం ఓకే

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి.. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలకు ఆదాయపన్ను శాఖ రూ. 100 కోట్లు కట్టాలంటూ నోటీసు జారీచేసింది. అసోసియేుటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు సంబంధించిన ఆదాయాలను 2011-12 ఎసెస్‌మెంట్ సంవత్సరంలో ఇద్దరూ దాచిపెట్టారని, అవి కొన్ని వందల కోట్లు ఉన్నాయని ఆదాయపన్ను శాఖ అధికారులు ఆ నోటీసులలో తెలిపారు. సోనియా గాంధీ రూ. 155.4 కోట్లు, రాహుల్ గాంధీ రూ. 155 కోట్ల చొప్పున ఆదాయాన్ని లెక్కల్లో చూపించలేదన్నారు. ఈ ఆదాయం అంతా ప్రకటించిన దాంట్లో ఎక్కడా కనపడలేదని అన్నారు. ఆ ఎసెస్‌మెంట్ సంవత్సరంలో రాహుల్‌గాంధీ తనకు కేవలం రూ. 68.1 లక్షల ఆదాయాన్ని ప్రకటించారని, అదే సమయంలో ఆయన పార్టీ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ మాత్రం రూ. 48.9 కోట్లు చూపారని ఐటీ వర్గాలు చెప్పాయి. రాహుల్, సోనియాల ఆదాయపన్ను అంచనా కేసును మళ్లీ తెరవడంపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోనియాగాంధీ రూ. 44 కోట్ల పన్ను కట్టాలని తప్పుగా చూపించారని ఆమె తరఫున వాదిస్తున్న పి.చిదంబరం తెలిపారు. రూ. 141 కోట్ల ఏజేఎల్ ఆదాయాన్ని తమ రిటర్నులు దాఖలు చేసేటపుడు చూపించలేదని.. దాన్ని తప్పించుకున్నారంటూ వాళ్లు చెప్పారని ఆయన అన్నారు. సోనియా, రాహుల్, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లపై 2011-12లో వారి ఆదాయాన్ని మళ్లీ లెక్కించిన తర్వాత డిసెంబరు 31న ఎసెస్‌మెంట్ ఉత్తర్వులు ఇచ్చారని, ఆదాయపన్ను శాఖ తీసుకున్న చర్యలు చెల్లుబాటు అవుతాయో లేదో కోర్టు పరిశీలిస్తున్నందున ఈ ఉత్తర్వులను తాత్కాలికంగా పెండింగులో పెట్టారని చెప్పారు. ఆదాయపన్ను శాఖ అధికారులు కనీసం లోకజ్ఞానంతో కూడా వ్యవహరించలేదని, యంగ్ ఇండియన్ అనే స్వచ్ఛంద సంస్థలోని 1900 షేర్లకు బదులుగా ఆమె రూ. 141 కోట్ల ఆదాయం పొంది, దాన్ని చూపిచంలేదంటున్నారని జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట చిదంబరం వాదించారు. యంగ్ ఇండియన్ షేర్ల వివరాల గురించి వెల్లడించడానికి తమకు ఇబ్బంది ఏమీ లేదని, అవేవీ కంపెనీ ప్రయోజనానికి లోబడినవి కావని అన్నారు. స్వచ్ఛంద సంస్థ అయిన యంగ్ ఇండియన్‌లో షేర్లవల్ల వచ్చిన ప్రతిఫలాన్ని అసలు చూపించాల్సిన అవసరం లేదని, ఇలాంటి కంపెనీ ఆస్తుల నుంచి వాటాదారులకు ఎలాంటి డివిడెండ్లు, వడ్డీలు రావని చిదంబరం తెలిపారు. కంపెనీకి ఉన్న ఏకైక ఆస్తి కేవలం రూ. 90 కోట్ల అప్పేనని, కానీ ఐటీ శాఖ మాత్రం దాన్ని తప్పుగా లెక్కించి రూ. 407 కోట్ల ఆస్తిగా చూపించిందని అన్నారు. కేసు తదుపరి విచారణ ఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. 

రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు నేషనల్ హెరాల్డ్ కేసులో 2011-12 సంవత్సరానికి సంబంధించిన ఎసెస్‌మెంట్ ఉత్తర్వులను జారీచేశామని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిద్దరి నుంచి పన్ను బకాయిలు రాబట్టేందుకు ఎసెస్‌మెంట్ ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. సీబీడీటీ సర్క్యులర్‌పై నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలుచేయాలని సోనియా, రాహుల్ గాంధీలకు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఆదాయపన్ను శాఖ కూడా ఆ అఫిడవిట్, సర్క్యులర్‌లకు ఆ తర్వాత వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. కోర్టు ఈ విషయంలో ఇంతకుముందు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని, తదుపరి విచారణ ఈనెల 29న జరుగుతుందని తెలిపింది. కాగా ఇదే కేసులో.. ఇదే సంవత్సరానికి సంబంధించి (2011-12) యంగ్ ఇండియన్ సంస్థకు రూ. 249.15 కోట్ల డిమాండ్ నోటీసును కూడా ఆదాయపన్ను శాఖ ఇంతకుముందే పంపింది.  

సంబంధిత వార్తలు