ఆఖర్లోనూ అంతే డేంజర్

Updated By ManamFri, 07/13/2018 - 01:06
Thailand
  • విద్యార్థులు, కోచ్ సురక్షితంగా బయటకు.. కొన్ని నిమిషాల్లోనే ఆగిపోయిన మోటారు

thailandబ్యాంకాక్/మాసాయ్: థాయిలాండ్‌లోని థామ్ లువాంగ్ గుహ నుంచి 12 మంది విద్యార్థులను, కోచ్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. వారిని కాపాడిన డైవర్లు, సహాయక సిబ్బంది చివరి నిమిషంలో ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తొలుత విద్యార్థులను, చివరగా కోచ్‌ను బయటకు తీశారు. కోచ్  బయటకు వచ్చిన కొన్ని కొద్దిసేపటికే.. గుహలో నీటిని తోడేందుకు ఉపయోగించిన మోటార్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ సమయంలో గుహ లోపల 20 మంది సహాయ సిబ్బంది ఉన్నారు. వారంతా ప్రవేశద్వారానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.  మోటార్లు ఫెయిలయ్యాయనే విషయాన్ని ఆస్ట్రేలియా డైవర్ గుర్తించి గట్టిగా అరిచాడని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న థాయిలాండ్ నేవీ సీల్‌కు చెందిన కమాండర్ చైయనంతా పీరనారంగ్ తెలిపారు. దాంతో హుటాహుటిన బయటకు వచ్చే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేశామని, చివరి డైవర్ బయటకు వచ్చేటప్పటికి అతని మెడ వరకు నీటి మట్టం పెరిగిందని అన్నారు. ఒక దశలో రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతంగా మారుతుందని భావించామని అన్నారు. విద్యార్థులను తీసుకురావడానికి ముందే పంపు గనుక పని చేయడం ఆగిపోతే పరిస్థితి మరోలా ఉండేదని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. విద్యార్థులను తరలించేటప్పుడు వారికి మత్తు మందు ఇచ్చామని, నీటిలో ఈదుతున్నప్పుడు వారు గాభరా పడకుండా ఉండేందుకే అలా చేశామని అన్నారు. విద్యార్థులను తీసుకువచ్చే సమయంలో కొందరు నిద్రపోయారన్నారు.

Tags
English Title
Danger in the end
Related News