france in fifa

మరో చరిత్రకు ముందడుగు

Updated By ManamWed, 07/11/2018 - 23:30
  • ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్లో ఫ్రాన్స్

  • పన్నెండేళ్ల తర్వాత తొలిసారి

ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు సంచలనం సృష్టించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత తుది పోరుకు సిద్ధమైంది. 2006లో జర్మనీలో జరిగిన మెగా ఈవెంట్‌లో జిదానే నేతృత్వంలోని ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. యూరప్‌కే చెందిన మరో జట్టు బెల్జియం నిరాశతో వెనుదిరిగింది. 

imageసెయింట్ పీటర్స్‌బర్గ్: సెంటర్ బ్యాక్ ఆటగాడు సామ్యూల్ ఉవ్‌ుటిటి అద్భుతమైన హెడింగ్ చేయడం, గోల్ కీపర్ హ్యుగో లోరిస్ అనేకసార్లు జట్టును కాపాడటంతో వెరసి ఫిఫా వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు సంచలనం సృష్టించింది. మంగళవారం అర్ధ రాత్రి జరిగిన సెమీఫైనల్లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ‘గోల్డెన్ జెనరేషన్’ బెల్జియం జట్టు తీవ్ర నిరాశతో వెనుదిరిగింది. 2016 యూరో కప్ ఫైనల్లో ఓటమిపాలుకావడంతో బాధపడిన ఫ్రెంచ్ అభిమానులను ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచి ఓదార్చేందుకు ఫ్రాన్స్ జట్టు సిద్ధమైంది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లూ గోల్స్ చేయలేకపోయాయి. అయితే రెండో అర్ధ భాగం ప్రారంభమైన ఆరో నిమిషంలో ఫ్రాన్స్‌కు కార్నర్ లభించింది. గ్రీజ్‌మన్ కొట్టిన ఈ కార్నర్ షాట్‌ను ఉవ్‌ుటిటి సరైన సమయానికి అందుకుని హెడింగ్ చేశాడు. 

దీంతో ఫ్రాన్స్‌కు గోల్ లభించింది. ఈ ఊహించని పరిణామానికి షాక్ తిన్న బెల్జియం మరింత దూకుడుగా ఆడింది. బెల్జియం కొట్టిన గోల్ టార్గెట్ షాట్స్‌ను ఫ్రాన్స్ గోల్ కీపర్ హ్యుగో లోరిస్ అనేకసార్లు అడ్డుకున్నాడు. బెల్జియంకు చెందిన కెవిన్ డి బ్రుయిన్, ఫ్రాన్స్‌కు చెందిన కైలియన్ ఎంబప్పే మధ్య హోరా హోరీ పోరు కొనసాగింది. ఒకరినొకరు సవాల్ చేసుకున్నారు. కానీ ఫుట్‌బాల్ చరిత్రలో తానెందుకు అత్యంత విలువైన ఆటగాడో ఎంబప్పే మరోసారి నిరూపించాడు. ఎంబప్పే బెల్జియం ఆటగాడు జాన్ వెర్టాంఘెన్‌ను తప్పించి బంతిని గ్రీజ్‌మన్‌కు అందించాడు. కానీ చివరి సెకన్లలో గ్రీజ్‌మన్ ప్రయత్నాని విన్సెంట్ అడ్డుకున్నాడు. 12వ నిమిషంలో ఎంబప్పే చేతిలో నుంచి వెర్టాంఘెన్‌ను సేవ్ చేసేందుకు బెల్జియం గోల్ కీపర్ థైబాట్ కోర్టొయిస్ తన గోల్ బాక్స్‌ను వదిలి ముందుకు పరుగెత్తాడు. ఆ సమయంలో బెల్జియం అద్భుతంగా ఆడుతోంది. ఈడెన్ హజార్డ్ కొట్టిన షాట్ గోల్ బాక్స్‌కు కొద్ది దూరంలో వెళ్లింది. మరోసారి ఈ చెల్సీ ఫార్వర్డ్ ప్రయత్నం వృథా అయింది. హజార్డ్ కొట్టిన షాట్‌కు రాఫెల్ వరనె హెడింగ్ చేశాడు. కానీ అదికూడా ఫ్రాన్స్ గోల్ బాక్స్‌కు దూరంగా వెళ్లింది. ఇరు జట్ల గోల్ కీపర్లు క్వార్టర్ ఫైనల్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి అర్ధ భాగంలో ఒక్క గోల్ కూడా కాకుండా అద్భుత ప్రతిభ కనబరిచారు. 

పారిస్‌లో మిన్నంటిన సంబరాలు
imageఫ్రాన్స్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లడంతో పారిస్‌లో ఆ దేశ జాతీయ గీతం మార్మోగింది. కార్ల హారన్లు, టపాకాయల శబ్దాలతో పారిస్ వీధులు దద్దరిల్లాయి. ఈ విజయాన్ని పారిస్‌లోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఫ్రాన్స్, బెల్జియం మధ్య జరిగిన మ్యాచ్‌ను పారిస్ చారిత్రాత్మక హోటల్ డి విల్లే లేదా టౌన్ హాల్‌లో ఏర్పాటు చేసిన జెయింట్ స్క్రీన్‌పై దాదాపు 20 వేల మంది వీక్షించారు. ఈ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. అభిమానులు కొంత మంది చెట్లపైకి ఎక్కారు. మరికొంత మంది వ్యాన్‌లపై నిలుచున్నారు. ఇంకొంతమంది డస్ట్‌బిన్‌లు, బస్ షెట్లర్లపైకి కూడా ఎక్కి నిలుచున్నారు. ‘ఫ్రెంచ్ దేశస్థులైనందుకు గర్విస్తున్నాం’ అని అలియా, సాచా అనే ఇద్దరు పర్సియన్ స్కూల్ చిన్నారులు అన్నారు. మోటార్‌సైకిళ్లు, సైకిళ్లు, కార్లు, చివరికి డస్ట్‌బిన్ లారీల్లోనూ అభిమానులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. 2015 ఉగ్రవాదుల దాడి అనంతరం ఫ్రాన్స్‌లో భద్రత పెరిగింది. ఈ అభిమానులు సంబరాలు చేసుకున్న టౌన్ హాల్ వద్ద 1200 మంది సెక్యూరిటీ సిబ్బంది బాధ్యతలు నిర్వర్తించారు. పారిస్ వీధుల అభిమానులు ర్యాలీగా వెళుతుంటే బాల్కనీలోంచి కుటుంబ సభ్యులు ఫ్రెంచ్ జాతీయ జెండానూ, పిల్లలు లెస్ బ్లూస్ టీ షర్టును ఊపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

థాయ్‌లాండ్ చిన్నారులకు అంకింతం: పోగ్బా
ఇంతటి ఆనందంలోనూ రెండు వారాల పాటు గుహలో ఉండి క్షేమంగా బయటికి వచ్చిన థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ చిన్నారులను ఫ్రాన్స్ ఆటగాళ్లు జ్ఞాపకం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన అంతర్జాతీయ కెరీర్‌లోనే అతి పెద్ద విజయంగా భావిస్తున్న సెమీఫైనల్ గెలుపును ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బా థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ చిన్నారులకు అంకితమిచ్చాడు. ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలియజేశాడు. పిల్లల ఫొటోను పెట్టి పక్కనే ‘ఈ విజయం చిన్నారులకు అంకితం. మీ మనోధైర్యం బలమైంది. వెల్ డన్ బాయ్స్’ అని రాశాడు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ కోసం వెళ్లిన 12 మంది చిన్నారులు, కోచ్ వర్షం కారణంగా ఓ గుహలో తలదాచుకుని అక్కడే ఇరుక్కుపోయారు. దాదాపు రెండు వారాల తర్వాత వారి ఆచూకీని తెలుసుకున్న థాయ్‌లాండ్ ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. ఈ ఆపరేషన్‌లో థాయ్‌లాండ్ అధికారులతో పాటు బ్రిటన్‌కు చెందిన గజ ఈతగాళ్లు తమ ప్రాణాలను తెగించి శ్రమించారు. బ్రిటన్‌కు చెందిన ఒక గజ ఈతగాడు చిన్నారుల కోసం తన ప్రాణాలను కూడా ఇవ్వడం బాధాకరం. 
 

image

 

Related News