లాక్‌డౌన్ ఎఫెక్ట్ : సైబరాబాద్ సీపీ గ్రౌండ్ చెక్

hyderabad cp sajjanar sudden check
  • క్షేత్ర స్థాయిలో/ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితిని సమీక్షించిన సీపీ

  • లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలి : సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ 

  • సూపర్ మార్కెట్లు, గ్రాసరీ, కూరగాయలు, పండ్లు, మెడికల్ షాపుల ఆకస్మిక తనిఖీ

  • వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న సీప

  • మార్కెట్లలో సరిపడినంత నిత్యావసర వస్తువుల స్టాక్

  • ఎక్కువ ధరలకు సరుకు అమ్మితే కఠిన చర్యలు

  • అవసరాల‌ మేరకే సరుకు కొనాలని ప్రజలకు సూచన


హైదరాబాద్ సిటీ , మనం న్యూస్ : క‌రోనా వైర‌స్ దెబ్బ‌కి తెలంగాణ‌లో కూడా లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లకు నిత్యావ‌స‌ర‌, అత్య‌వ‌స‌ర వ‌స్తువులు కొర‌త రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లో ప‌లువురు అధికారులు త‌నిఖీలు చేశారు. 

సైబరాబాద్ పోలీస్ కమిషనర్  వీసీ సజ్జనార్,  మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, సైబరాబాద్ ఫుడ్ సప్లై చైన్ నెట్వర్క్ కో-ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ డీసీపీ  అనసూయతో కలిసి గచ్చిబౌలి, కొండాపూర్, కొత్తగూడ, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ తదితర ప్రాంతాలలో గ్రౌండ్ లెవల్‌లోసూపర్ మార్కెట్లు, జనరల్ స్టోర్‌లు, కిరాణా షాపులు, కూరగాయలు, పండ్లు, మెడికల్ షాపులను ఆకస్మిక తనిఖీ చేపట్టారు . 

ముందుగా రత్నదీప్, గన్ శ్యామ్ తదితర సూపర్ మార్కెట్లను విజిట్ చేసి, కస్టమర్లను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు . ఈ క్ర‌మంలో వారికి కావాల్సిన సరుకులు అందుబాటులోనే ఉన్నాయని , ఎలాంటి సమస్యలు లేవని వినియోగదారులు సీపీకి  వివరించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్ల తెలంగాణ‌లో నిత్యావ‌స‌ర వస్తువులకు ఎలాంటి కొరత లేదన్నారు. ప్రజల అవసరాలకు కావాల్సినంత సరుకు సిద్ధంగా ఉందన్నారు. సైబరాబాద్ పరిధిలోని వివిధ సూపర్ మార్కెట్లు, ఇతర గ్రాసరీ షాపుల్లో కావాల్సినంత సరుకు సిద్ధంగా ఉందని ప్రజలు ఎటువంటి హైరానా ప‌డాల్సిన అవసరం లేదన్నారు.

నిత్యావసర వస్తువుల సరఫరా విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వివిధ స్టేక్ హోల్డర్లతో ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యామన్నారు. ఫుడ్ సప్లై చైన్ నెట్వర్క్ కో-ఆర్డినేషన్ మానిటరింగ్ కోసం నోడల్ ఆఫీసర్‌గా సైబరాబాద్ పరిధిలో డిసిపి అనసూయను నియమించామన్నారు. అలాగే ఒక్కో పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఒక కానిస్టేబుల్‌ను నియమించి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు.

ఇక కొంతమంది తమకు కావాల్సినదాని కంటే అధికంగా సరుకు కొనుగోలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇది సరికాదన్నారు. ప్ర‌స్తుతం త‌మ‌ అవసరాలకు త‌గ్గట్టు స‌రుకులు కొనుగోలు చేయాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఎమ్ ఆర్ పీ ధరల కంటే ఎక్కువ ధరలకు వస్తువులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షాపుల యాజమాన్యలను హెచ్చరించారు. 

అదే సమయంలో అధిక ధరలకు వస్తువులను కొనవద్దని వినియోగదారులకు సూచించారు. ఎం ఆర్ పి ధరల కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే డయల్  100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 లేదా కోవిడ్ కంట్రోల్ రూమ్  9490617440, 9490617431 నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. లాక్‌డౌన్ పీరియడ్‌లో ప్రజలందరూ ఇళ్లకే ప‌రిమితం కావాల‌న్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ సభ్యులతో సమయం గడపాలన్నారు. జంక్ ఫుడ్‌కి బదులుగా మంచి ఆహారం తీసుకోవాలన్నారు.