కరోనా పై పోరాటం : జిల్లా అధికారుల‌తో.. మంత్రి మల్లా రెడ్డి కీల‌క స‌మావేశం..! 

Minister Malla Reddy  key meeting with district officials
  • కలెక్టర్ సహా, జిల్లాలోన‌ పలువురు అధికారులతో సమీక్ష.

  • కరోనా పై సందేహాలు ఉంటె.. ఈ హెల్ప్ లైన్ నెంబర్ లను సంప్రదించాలి : 9492409781/ 08418-297820.

  • ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు.. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి .


మేడ్చల్ జిల్లా ప్రతినిధి / మేడ్చల్ , మనం న్యూస్ : క‌రోనా వైరస్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల పై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి.. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో  కలిసి మేయర్లు, చైర్మన్లు, డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  

ఈ క్ర‌మంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించాలంటే, ముఖ్యంగా ప్రజలు బయటకి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేప‌ధ్యంలో.. ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కోనుగోలు చేసేందుకు కిరాణా దుకాణాలు ఉంటాయని, అయితే ఇంటి నుండి ఒక‌రు మాత్ర‌మే వెళ్ళి స‌రుకులు తెచ్చుకోవాల‌న్నారు.

ఇక ఇలాంటి పరిస్థితుల్లో మాల్స్, కిరాణా  దుకాణాల్లో కూరగాయలు, నిత్యావసర సరుకులు అధిక ధరలకు అమ్మినట్లయితే దుకాణ యజమానుల పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో క‌మిటీ బృందాలు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వ‌హించాల‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు32 మనిషికి 12 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడానికి ఏర్పాటు చేశామన్నారు. 

చౌకధరల దుకాణాల ముందు గుంపులుగా గుమికూడకుండా చూడాలని  శానిటైజర్, సబ్బు, నీరు అందుబాటులో ఉంచి చేతులు శుభ్రంగా కడుక్కుని బయోమెట్రిక్ ద్వారా బియ్యాన్ని తీసుకునేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఖర్చుల నిమిత్తం అందించే 1500 రూపాయ‌లు నేరుగా లబ్ది దారులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. వేసవికాలం వచ్చినందున మంచినీటి కొరత ఏర్పడకుండా ట్యాంకర్ల ద్వారా ప్రజలకు మంచినీరు అందజేయాలని అధికారులను ఆదేశించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ క్వారంటైన్‌లో ఉన్నవారు.. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల‌కు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సహకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేశామని, ఏవైనా స‌ల‌హాలు కావాల‌న్నా,  సందేహాలు ఉన్నా.. 9492409781/ 08418-297820 నెంబర్లకు సంప్రదించాలన్నారు. రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేప‌ధ్యంలో ప్రజలు బయటకు రాకుండా తమ తమ ఇళ్ళ‌లోనే ఉండాలని కోరారు.


ఇక ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు విద్య సాగర్, జాన్ శ్యామ్సన్, డీ సీ పీ లు మల్కాజ్‌గిరి రక్షిత మూర్తి, బాలనగర్ పద్మజా రెడ్డి, డిప్యూటీ  కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, మేయర్లు, చైర్మన్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.