ఏపీలో వైఎస్ఆర్ భీమా కోసం సర్వే ప్రారంభం

ఏపీలో వైఎస్ఆర్ భీమా కోసం సర్వే ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చాక వ‌రుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.  పేద కుటుంబ యాజమానులు మరణించి నప్పుడు ఒక్కసారే పెద్ద దిక్కును కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో అలాంటి కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం వారికి భీమా ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఈ వైఎస్ఆర్ భీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. దీని కోసం సర్వేను ప్రారంభించింది. వార్డు, గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయబోతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆర్ధిక స్థితిగతులు, బియ్యం కార్డు వివరాలు తీసుకోబోతున్నారు. ఒకవేళ అర్హులై ఉండి కార్డు లేకుంటే, వారి వివరాలను తీసుకొని బియ్యం కార్డు వచ్చేలా చేస్తారు. పేదలైన అర్హులకు వైఎస్ఆర్ భీమా సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. 
అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.50 కోట్ల మంది బియ్యం కార్డు కలిగి ఉన్నారు. వీరందరికి వైఎస్ఆర్ భీమా సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వ్యక్తులు మరణిస్తే ఆయా కుటుంబాలు ఇబ్బందుల్లో పడిపోతాయి. జీవనోపాధి కోల్పోతారు. వారికి వైఎస్ఆర్ భీమా ద్వారా డబ్బు అందించగలిగితే, జీవనోపాధి తిరిగి ప్రారంభించే అవకాశం ఉంటుంది. 18 నుంచి 50 సంవత్సరాలలోపు ఉన్న వ్యక్తులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఈ భీమా కింద రూ.5 లక్షల పరిహారం అందుతుంది. 
సహజ మరణమైతే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. 51 నుంచి 70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు మరణించినా.. శాశ్వత వైకల్యం పొందినా రూ.3 లక్షల పరిహారం అందుతుంది. గతంలోనూ ఈ బీమాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేశాయి. ఏప్రిల్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉపసంహరించుకోవడంతో అమలు బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.