మరణంలోనూ వీడని స్నేహబంధం

SAD INCIDENT IN TUNI

స్నేహితుని పుట్టిన రోజును ఘనంగా నిర్వ హించారు ఆ స్నేహితులు. విందు భోజనాలు చేశారు. ఆట పాటలతో ఎంతో సంతోషంగా గడిపారు. పోలవరం కాలువలో సరదాగా జలకాలాడారు. ప్రమాదవశాత్తూ పుట్టినరోజు జరుపుకుంటున్న స్నేహితుడు నీటిలో మునిగి పోసాగాడు... వెంటనే తోటి స్నేహితులు కాపాడేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. ఈ విషాదకర ఘటన తుని మండలం హంసవరంలో శుక్రవారం చోటు చేసుకుంది
హంసవరానికి చెందిన కిల్లాడి మణికంఠ స్వామి, మఠం హరీష్‌, కాలిబోయిన పృథ్వీరాజ్‌, శీలం బాలు, కిల్లాడి శివకుమార్‌, షేక్‌ సుభాష్‌, బద్ధి సాయిగణేష్‌, తూరంగి అప్పన్న, మడికి రాజు స్నేహితులు. శుక్రవారం పృథ్వీరాజ్‌ సందర్భంగా వారంతా పార్టీ చేసుకున్నారు.
సాయంత్రం 3.30 గంటల సమయంలో పోలవరం కాలువ వద్దకు వెళ్లి పృథ్వీరాజ్‌తో కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం వారందరూ స్నానం చేసేందుకు కాలువలో దిగారు. స్నానాలు అనంతరం అందరూ గట్టు పైకి చేరుకున్నారు. కాళ్లకు మట్టి అంటడంతో పృథ్వీరాజ్‌, హరీష్‌, మణికంఠస్వామి మళ్లీ కాలువలోకి వెళ్లి కడుక్కున్నారు.

సరదాగా ఒకరిపై ఒకరు నీళ్లు జల్లు కున్నారు. ఈ సమయంలో పృథ్వీరాజ్‌ నీళ్లలోకి మునిగిపోతుండగా హరీష్‌ టీషర్ట్‌ను పట్టుకున్నాడు, దీంతో హరీష్‌ మణికంఠస్వామి చొక్కాను పట్టుకోవడంతో ముగ్గురూ మునిగపోతూ కేకలు వేశారు. మిగిలిన స్నేహితులు పరుగున వచ్చి వారిని కాపాడేందుకు విఫలయత్నం చేశారు. అప్పటికే పృథ్వీరాజ్‌(17), మణికంఠస్వామి(15), మఠం హరీష్‌(17) నీటిలో మునిగి చనిపోయారు. సమా చారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చి బాలుర మృతదేహాలను వెలికి తీశారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా విషాదం అలముకుంది.