నేడు జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్ర‌సంగం 

నేడు జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్ర‌సంగం 

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ‌ సాయంత్రం 4:30 గంటలకు మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 'స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 2020' గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో విద్యార్థులతో ముచ్చటించనున్నారు. రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుక్కోవడమే లక్ష్యంగా ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నారు. మొత్తం 243 సమస్యలకు పరిష్కారం కనుగొనడం కోసం 10వేల మంది విద్యార్థులు ఫైనల్‌ పోటీలో ఉన్నారు. విద్యార్థుల ఆలోచనా పరిధిని, నైపుణ్యాలను పెంచేందుకు 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి ఏడాదే 42 వేల మంది విద్యార్థులు పాల్గొనగా ఈసారి 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ హ్యాకథాన్‌లో పాల్గొన్నారు. తుది రౌండ్‌లో లక్ష మంది పాల్గొననున్నారు. 37 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 17 రాష్ట్ర ప్రభుత్వాలు, 20 పరిశ్రమలు పంపిన సమస్యలకు విద్యార్థులు తమ పరిష్కారాలు తెలపనున్నారు. నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. నూతన విద్యా విధానానికి బుధవారం కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపైనా మోడీ తన అభిప్రాయాల్ని పంచుకోనున్నారు.