ఏపీలో ఆగ‌స్టు 3నుంచి ఇంట‌ర్ కాలేజీలు ఓపెన్ 

ఏపీలో ఆగ‌స్టు 3నుంచి ఇంట‌ర్ కాలేజీలు ఓపెన్ 

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మాకారి కార‌ణంగా ఈ విద్యా సంవ‌త్స‌రం ఇప్ప‌టి వ‌ర‌కూ స్కూళ్లు, క‌ళాశాల‌లు ఇంత‌వ‌ర‌కూ ఓపెన్ కాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలను నడిపించాలని నిర్ణయించిన ప్రభుత్వం, అందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆగస్టు 3 నుంచి కాలేజీలను ప్రారంభించాలని, మొత్తం 196 పనిదినాలు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు 2021 అకడమిక్ క్యాలెండర్ ను సిద్ధం చేసిన ఉన్నత విద్యా శాఖ, సీబీఎస్ఈ తరహాలో పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని పేర్కొంది. ఇక ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహించాలని, రెండో శనివారం కూడా కాలేజీలను నడిపించాలని, పండగల సందర్భంగా ఒకటి లేదా రెండు రోజుల సెలవు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. 
విద్యార్థులకు యూనిట్ పరీక్షలు నిర్వహించాలని, ఆన్ లైన్ పాఠాల నిమిత్తం వీడియోలను రూపొందించి విడుదల చేస్తామని వెల్లడించింది. యధావిధిగా మార్చిలోనే వార్షిక పరీక్షలు ఉంటాయని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఇక ప్రతి సబ్జెక్టుకూ ఒక వర్క్ బుక్ ను ప్రత్యేకంగా ఇవ్వనున్నామని, జేఈఈ మెయిన్ తదితర ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా ఈ వర్క్ బుక్ ఉంటుందని తెలియ జేసింది. మరోవైపు ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌-2020 పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారందరినీ కంపార్టుమెంటల్‌ కేటగిరీలో పాసైనట్లుగా ఏపీ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. వీరికి నిర్వహించాల్సిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు క‌రోనా నేపథ్యంలో రద్దు చేసి అందరూ పాసైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.