తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్‌

తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. రోజురోజుకు కేసులు విజృంభిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9వేలు యాక్టివ్ కేసులు ఉండగా, 5172 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. క‌రోనా వైర‌స్ ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. డాక్ట‌ర్లు, పోలీసులు, ప్ర‌ముఖుల‌ను కూడా క‌రోనా వ‌ణికిస్తోంది. 
రాష్ట్రంలో కరోనా వైరస్‌ రాజకీయ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ కోవిడ్‌ బారిన పడగా, తాజాగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా ఈ జాబితాలో చేరారు. హోంమంత్రికి కరోనా టెస్టులు చేయగా వైరస్‌ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న మంత్రి మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో నిన్న రాత్రి అపోలో ఆస్పత్రిలో చేరిన హోంమంత్రి.. చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన వద్ద పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.