కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ గురి

kcr
  • సీఎల్‌పీని టీఆర్‌ఎస్ ఎల్‌పీలో విలీనం చేసే యోచన

  • 8 మందితో మాట్లాడామంటున్న అధికార పార్టీ  నేతలు

  • 13 మందిని చేర్చుకొనేందుకు పావులు కదుపుతున్న బాస్

  • కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలకు ప్రాతినిధ్యం లేకుండా చేసే వ్యూహం

  • వైఎస్‌ఆర్ ఫార్ములాను పాటిస్తున్న సీఎం కేసీఆర్

  • తెలంగాణ రాజకీయాల్లో ఏకచ్ఛత్రాధిపత్యమే లక్ష్యం

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్‌లను ఖతం పట్టించే వ్యూహంలో  ఉన్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా  ఉన్న డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అనుసరించిన ఆపరేషన్ ఆకర్ష్ ఫార్ములానే  ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు ఆదర్శం అయిందంటున్నారు. టీడీపీ  నుంచి గెలిచిన ఇద్దరిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి ఇప్పటికే రంగం సిద్దమైంది. సీపీఐ. సీపీఎంకు చెందిన రవీంద్ర కుమార్, నోముల నర్సింహ్మయ్యకు గులాబీ కండువాను కప్పడంతో పాటు వారిని దేవరకొండ, నాగార్జున సాగర్ స్థానాల నుంచి గెలిపించుకున్నారు. దీంతో  శాసనసభలో వామపక్షాలకు ప్రాతినిధ్యం లేకుండా చేశారు.  ఈ నెల 17 నుంచి  ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చబోతుంది. ముందుగా కాంగ్రెస్‌పై కేసీఆర్ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎంత మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌వైపు వస్తారో తెలుసుకోవాలనే ఆలోచనతో తన సన్నిహితులను రంగంలోకి దింపారు. ఇప్పటికే  8 మంది  కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్ నేతలు రహస్య మంతనాలు జరిపారు. మొత్తంగా 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పాలనే ఆలోచనతో పార్టీ అధినేత ఉన్నాడని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.  కొందరు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఇష్టపడటం లేదని, మౌనంగా ఉంటామనే మాట ఇస్తున్నారు. మరి కొంత మంది పార్లమెంటు ఎన్నికల వరకు వేచి చూసి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ ఎంత వరకు ఫలిస్తుందనేది ఇప్పటికిప్పుడే చెప్పలేమని అంటున్నారు. అసెంబ్లీలోని 119 స్ధానాలకు గాను టీఆర్‌ఎస్ 88 స్ధానాలను గెలుచుకుంది. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిపోయా. ఖమ్మం జిల్లా  సత్తుపల్లి, అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యేలు మచ్చా నాగేశ్వరరావు, సండ్ర వీరయ్యలు టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సభ్యుని అండ కూడా టీఆర్‌ఎస్‌కు ఉంది,  దీంతో సభలో టీఆర్‌ఎస్ బలం 93కు చేరింది. వంద సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందే ప్రకటించినందన,  ఆ సంఖ్యకు చేరడంతో పాటుగా కాంగ్రెస్‌ను ఖతం పట్టించాలనే ఆలోచనతో ఉన్నారని టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. టీఆర్‌ఎస్ గతంలో అమలు జరిపిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతమైంది. రాజశేఖర్‌రెడ్డి ఫార్మూలాను అనుసరించడంతో అత్యధికులు గులాబీ గూటికి చేరారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణలో తిరుగులేదనే విధంగా రాజకీయాలు ఉండాలనే ఆలోచనతో కేసీఆర్ వ్యూహాత్మకంగా రాజకీయ కార్యాచరణ అమలు జరుపుతున్నారు. శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్‌కు దక్కకుండా చేయడం ద్వారా కేసీఆర్ అనుకున్న అభివృద్దకి ఆటంకాలు ఎదుకు కాకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది.  రెండు మూడు రోజుల్లోనే   ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు గులాబీ కండువాలు కప్పాలని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ శాసససభ్యుల్లో ఎక్కువ మందిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికాబద్దంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మండలిలో కాంగ్రెస్‌కు నామరూపాలు లేకుండా చేయడలిగాడు. కాంగ్రెస్ గెలిపించిన వారందరూ టీఆర్‌ఎస్ ఎల్‌పీలో విలీనమయ్యారు. మిగిలిన ఇద్దరి పదవి కాలం కూడా ముగియబోతుంది. ఇక మండలిలో కాంగ్రెస్‌కు స్ధానం ఉండే అవకాశం లేదు. చట్టపరమైన సాంకేతిక అంశాలు, నైతికత తదితర వ్యవహారాల గురించి కేసీఆర్ ఆలోచించడం లేదు, కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తమ పార్టీలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నారు అని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.  ఇటీవల కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల మందికి గులాబీ కండువాలు కప్పే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు, ఈ ప్రక్రియ పూర్తయిన పక్షంలో మూడింట రెండు వంతుల మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు కాబట్టి అసెంబ్లీలో కాంగ్రెస్ పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం అయినట్లుగా భావించాలని టీఆర్‌ఎస్ ఎల్ పీ పక్షాన స్పీకర్‌కు లేఖ అందించడంతో ఆపరేషన్ ఆకర్ష్‌ను విజయవంతం చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లను మరింత బలహీన పర్చడం ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో 16 స్ధానాలను కౌవసం చేసుకొనేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురే లేదని, గ్రామ స్దాయి నుండి పార్లమెంటు వరకు అన్ని ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ను గెలిపించారనే ప్రచారం జాతీయ స్ధాయిలో నిర్వహించడం ద్వారా ఫెడరల్  ఫ్రెంట్ ఆలోచనకు బలం చేకూర్చాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నాడని తెలిసింది. 

Tags

సంబంధిత వార్తలు