పాండ్య, రాహుల్‌కు షోకాజ్ నోటీసులు

Hardik Pandya
  • 24 గంటల్లో వివరణ ఇవ్వాలన్న సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్

న్యూఢిల్లీ: భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లకు బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఓ టీవీ కార్యక్రమంలో వీరిద్దరు మహిళల పట్ల చేసిన చౌకబారు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో క్రికెట్ బోర్డు వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఓ టీవీ చానెల్‌లో ‘కాఫీ విత్ కరణ్’ అనే ప్రోగ్రాంలో బరోడా ఆల్ రౌండర్ పాండ్య మహిళల పట్ల వ్యామోహం, జాత్యాహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. తర్వాత దానికి క్షమాపణ కోరుతూ ప్రోగ్రాం పక్కదారి పట్టిందని చెప్పాడు. అయితే రాహుల్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ‘హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలకు షోకాజ్ నో టీసులు ఇచ్చాం. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరాం’ అని కమీటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ అన్నారు. అయితే బుధవారం ఉదయమే పాండ్య ట్విట్టర్‌లో క్షమాపణలు కోరాడు. ‘కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లో నా వ్యాఖ్యలతో బాధ పడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నిజం చెప్పాలంటే ప్రోగ్రాంలో నా మాటలు పక్కదారి పట్టాయి. అయితే మరొకరి సెంటిమెంట్‌ను కించ పరచాలన్న ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కాదు’ అని పాండ్య పేర్కొన్నాడు. కొన్ని వారాల క్రితం జరిగిన ఈ టీవీ షోలో పాండ్య ‘ప్రతి విషయాన్ని నా తల్లిదండ్రులతో పంచుకుంటాను. సెక్స్‌కు సంబంధించిన విషయాలను కూడా చెప్పేస్తా. అమ్మాయాలతో గడిపిన క్షణాలను సైతం వారి దగ్గర దాచను. నా వర్జినీటీ కోల్పోయిన సందర్భం కూడా వారికి చెప్పాను’ అని మాట్లాడాడు. అంతేకాకుండా మహిళలను ఏక వచనంతో అది.. ఇది.. అని సంబోధిస్తూ హేళనగా మాట్లాడాడు. పాండ్య వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పాండ్య, రాహుల్‌లు బీసీసీఐ సీఈఓ రాహుల్ జొహ్రీ ఎదురుగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘బీసీసీఐ కొత్త చట్టంలోని సెక్షన్ 41 (సి) ప్రకారం క్రికెటర్లు దుష్ప్రవర్తనా లేదా ఉల్లంఘనలకు పాల్పడితే 48 గంటల్లో సీఈఓ ముందు హాజరై వివరణ ఇవ్వాలి. తర్వాత 15 రోజుల్లోపు సీఈఓ తన నివేదికను అపెక్స్ కౌన్సిల్ ముందు ఉంచుతారు. అయితే ప్రస్తుతానికి వారిని ఆస్ట్రేలియా పర్యటన నుంచి వెనక్కి రప్పించడం లేదు. ఆస్ట్రేలియా నుంచే సీఈఓతో మాట్లాడతారు’ అని ఆ అధికారి వెల్లడించారు. వీరిద్దరి ప్రవర్తన పట్ల బీసీసీఐ మాజీ జీఎం (క్రికెట్ ఆపరేషన్స్) రత్నాకర్ శెట్టి కూడా ట్విట్టర్‌లో తన అసహ్యాన్ని తెలిపారు. ‘బహిరంగ వేదికల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే క్రికెటర్లపై బీసీసీఐ సరైన చర్యలు తీసుకోవాలి. కాఫీ విత్ కరణ్ షోలో హార్దిక్ పాండ్య క్రికెట్ వర్గం తలదించుకునేలా మాట్లాడాడు. మహిళలను కించపరచడమే కాకుండా జాత్యాంహ కార ధోరణిని ప్రదర్శించాడు’ అని శెట్టి ట్విట్టర్‌లో రాశారు. అయితే ఈ షోలో ఇద్దరు క్రికెటర్లు పాల్గొనడంపై శెట్టి ఆశ్చర్యపో యారు. ‘వీరిద్దరూ బీసీసీఐ కాంట్రాక్ట్ పొందిన క్రికెటర్లు. అయితే వీరిద్దరినీ సంప్రదాయ మీడియాతో మాట్లాడించడం లేదు కానీ టాక్ షోలో మాట్లాడేందుకు ఎందుకు అనుమతించారో సీఈఓ, బీసీసీఐ మీడియా మేనేజర్ సమాధానం చెప్పాలి’ అని శెట్టి ప్రశ్నించారు. గతేడాది యూఏఈలో జరిగిన ఆసియా కప్ టోర్నీలో వెన్నెముక గాయానికి గురైన పాండ్య పూర్తిగా కోలు కుని ఇటీవలే అంటే మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టుకు ముందు జట్టులో చేరాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వ న్డేల సిరీస్‌లో టీమిండియాకు ఆడనున్నాడు. తొలి వన్డే ఈ నెల 12న సిడ్నీలో జరగనుంది. టెస్టు సిరీస్‌లో పేలవ బ్యాటింగ్‌ను కనబరిచిన కేఎల్ రాహుల్ కూడా వన్డే జట్టులో సభ్యుడు.

సంబంధిత వార్తలు