దీర్ఘ కవితా దర్శనం

Updated By ManamMon, 10/22/2018 - 07:59
Derga-Kavitha-Vikasam

ప్రకృతి, ప్రేమ, స్మృతి, జాతీయవాదం, సామాజిక చైతన్యం, విప్లవం, సాయుధ పోరాటం, మాదిగ జీవనం, మైనారిటీ కవిత్వం, బి.సి. వాదం, తెలంగాణ, ఉత్తరాంధ్ర పోరాటం, రాయలసీమ, ప్రపంచీకరణ, చిధ్రమైన పల్లె జీవితం, నగర జీవితం, రైతు, కులవృత్తులు, విద్యా రంగం, దిగజారుతున్న మానవ సంబంధాలు, మనిషి, బాల్యం, వృద్ధా ప్యం, సామ్రాజ్యవాదం, సైన్స్ ఇలా అన్ని అంశాలను ప్రతిబింబించిన దీర్ఘకవితలన్నీ ఇందులో చోటు చేసుకున్నాయి.

‘ఎంచుకున్న వస్తువును సమగ్రంగా ఆవిష్కరించడానికి, వస్తువులోని భిన్న పార్శ్వాలను కవితామయం చేయడానికి కవి హృదయం తనివితీరే వరకు అనివార్యంగా పెరిగిన కవితే దీర్ఘకవిత’ 
- డాక్టర్ పెళ్లూరు సునీల్

Derga-Kavitha-Vikasamతెలుగు సాహిత్యంలో కాలానుగుణంగా అనేక ప్రక్రియలు వచ్చాయి. అనేక ప్రయోగాలు జరిగాయి. వచన కవిత్వంలో ‘దీర్ఘకవిత’ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. 1956లో వచన కవితా పితామహుడు కుందుర్తి వెలువరించిన ‘తెలంగాణ’ మొదటి ‘దీర్ఘకవిత’గా ప్రసిద్ధి పొందింది. దీర్ఘకవిత వయస్సు దాదాపు 60 సం॥లు. ‘దీర్ఘకవిత’ తీరు తెన్నులపై ఏ విశ్వవిద్యాలయంలోను సమగ్ర పరిశోధన జరగలేదు. అటు వంటి అదృష్టాన్ని అవకాశాన్ని డాక్టర్ పెళ్లూరు సునీల్ పొందారు. పట్టు బట్టి తన పరిశోధనకు ఆ అంశాన్నే ఎంచుకున్నారు. దాదాపు 8 సం॥లు కృషి చేశారు. మూడు వందల దీర్ఘకవితల్ని పరిశీలించారు. విశ్వవిద్యా లయాలలో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో మనకు తెలుసు. పరిశోధకుడు కష్టపడకుండా డాక్టర్లై పోతున్నారని జరుగుతున్న ప్రచా రంలో డాక్టర్ పి. సునీల్‌కు మినహాయింపు. ఎక్కడ దీర్ఘకవిత ఉందని తెలిస్తే అక్కడ వాలిపోయేవారు. పరిశోధన సమగ్రంగా రావడానికి అంత సమయం తీసుకున్నారు. ఆచార్య మేడిపల్లి రవికుమార్ పర్యవేక్షణలో యస్.వి. యూనివర్శిటిలో తన పరిశోధన పూర్తి చేశారు. ఈ పరిశోధన గ్రంథానికి మౌఖిక పరీక్షకులుగా వచ్చిన ఆచార్య ఎల్.బి. శంకర్రావు ఈ మధ్య కాలంలో గుర్తించదగ్గ, గొప్ప పరిశోధనగా కితాబిచ్చారు. ఆ సిద్ధాంత గ్రంథాన్ని  సునీల్ ఇప్పుడు మనముందుకు ‘దీర్ఘకవితా వికాసం’గా తీసుకొచ్చారు. ఇందులో 37 వ్యాసాలున్నాయి. సిద్ధాంత గ్రంథాన్ని యథాతధంగా గాక కొంత సూక్ష్మీకరించారు. 557 పేజీల గ్రంథం ఇది. ‘దీర్ఘ కవితా వికాసాన్ని’ మంచి బరువుతో మోసుకొచ్చారు. తన పరిశోధనకు ఎంచుకున్న అంశంలోనే వారు సగం విజయం సాధించారు. దీర్ఘ కవితల లక్షణాలు, శైలి, శిల్పం ప్రామాణికమైన నిర్వ చనం గురించి పరిశోధకుడిగా ప్రతిపాదనలు చేయాలి. అవి విమర్శ కులను మెప్పించాలి. ఎందుకంటే గతంలో ఆ మేర కృషి జరగలేదు. ఆ విషయంలో ఆయన కృతకృత్యుడయ్యాడనే చెప్పాలి. దీర్ఘ కవితల లక్షణాల్ని ఇలా ప్రతిపాదించారు.

1. వచనత్వం  2. ఒకే వస్తువు ఉండడం  3. సుదీర్ఘత   4. ప్రవాహ గుణం  5. భాషా సారళ్యం కవులు దీర్ఘ కవితల్ని రాయడానికి రెండు కారణాలు గుర్తించారు.
1. వస్తు విస్తృతి  2. కవిత్వ తపన
‘దీర్ఘకవితలు పిల్లాడికి చేతిలో పెట్టి తాయిలంలా కాక ఆకలి గొన్న వాడికి విందు భోజనం పెట్టినట్లు కవికి, పాఠకుడికి అపరిమితానుభూతిని పెంచుతాయి’ అని వ్యాఖ్యానించారు. దీర్ఘకవిత సాగదీసినట్టుగా గాక అప్రయత్నంగా పెరిగితే దీర్ఘకవిత నాణ్యమైందిగా తయారవుతుందని వివరించారు. దీర్ఘకవితల్లో ఎన్ని పంక్తులు ఉండాలి? అనే ప్రశ్నకు ఆయన 300  1000 పాదాలు ఉన్నట్టు గుర్తించారు. ఇలానే ఉండాలనే నియమం లేదని తెలిపారు.
1956 నుంచి 2016 వరకు తెలుగు కవుల ధోరణులు, ఉద్యమాలకు స్పందించిన తీరు, సామాజిక బాధ్యత, స్వాతంత్య్రానంతర పరిణామాలు వీటనన్నింటిని మనం ఈ పరిశోధన గ్రంథాన్ని చదవడం ద్వారా అవగాహన చేసుకోగలం. 300 దీర్ఘ కవితల్ని చదివిన భావం కలుగు తుంది. దీర్ఘకవితల్లోని  ఉత్తమ పాదాల్ని ఉటంకించారు. దీర్ఘ కవితల్ని అనేక శీర్షికల కింద పేర్చారు. వస్తు, శిల్ప, శైలి వైవిధ్యాలను గుర్తించారు. ఎంతో లోతైన అధ్యయనం, పరిశీలన, కొత్తచూపు ఉంటేనే ఇది సాధ్యం.

ఈ గ్రంథంలో 37 వ్యాసాలకు పెట్టిన శీర్షికలు కొన్ని పరిశీలిద్దాం.
1. అక్షరానికి మొక్కిన దీర్ఘకవితలు
2. దీర్ఘ కవితావేదికపై కత్తులు దూసుకున్న వర్గీకరణ  ఏకీకరణ
3. తాత్త్విక చింతన  దీర్ఘ కవితల సాంత్వన
ఈ విధంగా ప్రేమతత్వం నుంచి జీవన తాత్త్వికత వరకు వచ్చిన దీర్ఘ కవితల ఆత్మను పట్టుకున్నారు. నిర్మొహమాటంగా పరిశీలన చేశారు. కొన్ని పుస్తకాలకు దీర్ఘకవితల లక్షణాలు లేవని తేల్చారు.
‘దీర్ఘకవితలు  శిల్ప సమన్వయం’ అనే వ్యాసంలో శీర్షికల గురించి ఆసక్తికర విషయాలు గుర్తించారు. దీర్ఘకవితల్లో 3 రకాలు శీర్షికలు ఉన్నట్లు గుర్తించారు. బహుశా గతంలో ఈ శీర్షికల విభజన పరిశోధకులు గుర్తించ లేదనుకుంటాను. వచన కవిత్వంలో ఏ ప్రక్రియకైనా ఈ విభజన సరిపోతుంది. 
1. వస్తు సూచిక శీర్షిక ఉదా : శ్రీకాకుళం  ఛాయరాజ్
2. లక్ష్యాత్మక శీర్షిక  మళ్లీ అమ్మ దగ్గరకు ఎమ్మెస్ సూర్యనారాయణ
3. ప్రతీకాత్మక శీర్షిక  హంస ఎగిరిపోయింది కుందుర్తి
‘దీర్ఘకవితలు శైలి సమన్వయం’ అనే వ్యాసంలో 7 రకాల శైలి బేధా లను గుర్తించారు. మాండలిక శైలి, కథనాత్మక శైలి, ఖండిత శైలి, అఖం డిత శైలి, నిర్వచనాత్మక శైలి, ప్రకటనాత్మక శైలి, వర్ణనాత్మక శైలి. ఇలా గుర్తించడమే కాకుండా ఉదాహరణలు చూపారు. ఎంచుకున్న పరిశోధన ద్వారా కొన్ని కొత్త విషయాలు వెలికితీయని పరిశోధనలు ఎందుకూ పనికి రావు. ఈ పరిశోధన అందుకు మినహాయింపు. నిజమైన పరిశోధన, నిల బడే పరిశోధన. దీర్ఘకవితలపై ఇక ఎవరు పరిశోధన జేసినా ఇది దిక్సూచిగా, మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ పరిశోధనలో ఇప్పటికీ రాస్తున్న కవులు ఉన్నారు, ఆగిపో యినవారు ఉన్నారు. అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియని కవులు ఉన్నారు. దాదాపు తన దృష్టికి వచ్చిన ఏ దీర్ఘ కవితను వదల్లేదు. దొరికేవరకు శోధించారు. దీర్ఘకవితలు రాసిన వారందరూ రికార్డు చేయ బడ్డారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఈ పరిశోధన ఒకమైలురాయిగా చెప్పుకోవచ్చు.

ప్రకృతి, ప్రేమ, స్మృతి, జాతీయవాదం, సామాజిక చైతన్యం, విప్లవం, సాయుధ పోరాటం, మాదిగ జీవనం, మైనారిటీ కవిత్వం, బి.సి. వాదం, తెలంగాణ, ఉత్తరాంధ్ర పోరాటం, రాయలసీమ, ప్రపంచీకరణ, చిధ్రమైన పల్లె జీవితం, నగర జీవితం, రైతు, కులవృత్తులు, విద్యా రంగం, దిగజారుతున్న మానవ సంబంధాలు, మనిషి, బాల్యం, వృద్ధా ప్యం, సామ్రాజ్యవాదం, సైన్స్ ఇలా అన్ని అంశాలను ప్రతిబింబించిన దీర్ఘకవితలన్నీ ఇందులో చోటు చేసుకున్నాయి. పరిశోధకుడిగా డాక్టర్ పి. సునీల్ విషయ పరిజ్ఞానానికి ఇది నిదర్శనంగా చూపవచ్చు. పుస్తకాన్ని త్వరగా సాహితీలోకానికి అందించాలనే ఆరాటంతో ఏమో పుస్తకం యొక్క భౌతికరూపం మీద శ్రద్ధ చూపలేదు. పుస్తకం భౌతికరూపం మనల్ని అసంతృప్తిపరిచినా దీర్ఘకవితల సమగ్రతను తెలపడంలో ఆయన ఎక్కడా ఫెయిల్ కాలేదు. శైలి బాగుంది. పుస్తకం చదివిస్తుంది. అప్రయత్నంగా పేజీలు తిరిగిపోతాయి. ఈ కాలం పరిశోధకుల్లో, పరిశోధనల్లో పసలేదు, అనేవాళ్ళు ఈ పరిశోధనా గ్రంథం చదవడం ద్వారా తమ అభిప్రాయాన్ని మార్చు కుంటారు. ఈ గ్రంథం దీర్ఘకవితా దర్శనం అని చెప్పవచ్చు. తన దృష్టికి రాని దీర్ఘకవితలు ఏమైనా ఉంటే మలి ప్రచురణలో చేరుస్తానని చెప్పిన   సునీల్‌ని అభినందిస్తూ...
సుంకర గోపాలయ్య
తెలుగు శాఖాధిపతి
పి.ఆర్. కళాశాల, కాకినాడ.
 94926 38547

English Title
Long poetic vision




Related News