రాజ్యమే కుట్ర చేస్తే...

Updated By ManamWed, 06/13/2018 - 01:16
modi

imageసికింద్రాబాద్ కుట్ర కేసుకు వ్యతిరేకంగా వాదిస్తున్న కన్నాబిరాన్ అల్‌ఫ్రెడ్ అనే పోలీసు అధికా రిని డాక్టర్ ఆల్‌ఫ్రెడ్ అని సంభోదిస్తే, నాకు డాక్టరేటు లేదు అని ఆ అధికారి అన్నప్పుడు, కుట్ర కేసు మీద ఇంత పెద్ద ఉద్గ్రంథం రాసిన మీరు కాల్పనిక సాహి త్యంలో ఆ డిగ్రీకి అర్హులని నేను గుర్తిస్తున్నాను అన్న మాటలు ప్రధానమంత్రిపై హత్యకు కుట్ర అన్న మావోయిస్టులు రాస్తున్నదిగా చెప్పబడుతున్న లేఖ చూసి కన్నాబిరాన్ మాటలు గుర్తుకొచ్చాయి. సికింద్రా బాద్ కుట్రకేసు ట్రయల్ దాదాపు రెండు దశాబ్దాలు సాగింది. ఈ కుట్రకేసులోని ‘ముద్దాయి’ వరవరరావు ప్రస్తావన ఇప్పుడు మళ్ళీ రావడం చూస్తే వి.వి. పేరు విప్లవ చరిత్రలో నిలిచిపోయే జ్ఞాపకమే. వి.వి. ఒక కవి, తన విశ్వాసాలకు రాజీలేకుండా నిలబడ్డ అధ్యా పకుడు. విప్లవ రాజకీయాల పట్ల ఆయన కుండే అభి మానం అందరికి తెలిసిందే. ఆయన వల్ల స్ఫూర్తి పొందిన అసంఖ్యాకులైన వ్యక్తులలో నేను ఒకడిని. తన విశ్వాసాల కోసం ఏళ్ళ తరబడి జైలు జీవితం అనుభవించినవాడే. ఆయన పట్ల దేశవ్యాప్తంగా గౌరవముంది. ఆయన పేరుని ఇందులో చేర్చ డం ప్రజాస్వామిక గొంతును నొక్కడంలో భాగమే. 

విప్లవ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు చరిత్రలో కుట్రలోనూ రావు. అవి ఒక చారిత్రక అవసరంగా ముందుకు వస్తాయి. భారత స్వాతంత్రోద్యమాన్ని బ్రి టిష్ వాడు కుట్రగానే భావించాడు. భగత్‌సింగ్ వలస వాదుల దృష్టిలో కుట్రదారుడే. కరంచంద్ గాంధీ కుట్ర కేసులో ముద్దాయే. ప్రభుత్వాలపై, రాజ్యంపై ప్రజలు కుట్ర చేయరు. అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తారు, ఎదిరిస్తారు, ప్రతిఘటిస్తారు. ఈ ప్రతి ఘటన అధికార పీఠంలో కూర్చున్న వారికి ప్రజల మౌలిక సమస్యల గురించి ఆలోచించే చిత్తశుద్ది లేని వారికి కుట్రగానే కనిపిస్తుంది. చరిత్రపై సృ్పహ లేని వాళ్ళకు ఉద్యమాలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. 

గత వారం రోజులుగా సంచలనాన్ని సృష్టించిన మావోయిస్టు పార్టీ రాసిన లేఖగా ప్రచారమౌతున్న లేఖ ‘ప్రధానమంత్రి మీద రాజీవ్‌గాంధీ హత్యలాంటి చర్య తీసుకోవాలన్న’ అంశం మొదట దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ లేఖ ఆధారంగా పోలీ సులు తాము ఇబ్బందికరమైన వ్యక్తులుగా భావిస్తున్న ప్రజాస్వామ్యవాదులను అరెస్టులు చేయడం ప్రారం భించారు. రాజకీయ ఖైదీల హక్కుల కొరకు అలాగే జి.ఎన్.సాయిబాబా డిఫెన్స్ కమిటీలో చురుకుగా పనిచేస్తున్న రోనా విల్సన్ ఇంటిమీద దాడితో ప్రారం భమయ్యింది. ఈ లేఖ ఆయన ఇంటి నుంచి తీసు కున్న ల్యాప్‌టాప్, ఇతర మెటీరియల్‌లో దొరికిందని పోలీసుల కథనం. ఈ లేఖలో కొందరి పేర్ల ప్రస్తావన ఉందని దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదుల అరెస్టు లు ప్రారంభించారు. ఈ లేఖలోని నిజానిజాలు, విశ్వ సనీయత బయటకి రాకుండానే, కేవలం అనుమానం మీద జి.ఎన్.సాయిబాబా డిఫెన్స్ లాయర్ సురేంద్ర గాడ్లింగ్‌ను అరెస్టు చేసారు. సికింద్రాబాద్ కుట్ర కేసే కాదు, ఉద్యమకారులకు డిఫెన్స్ లాయర్‌గా ఒక పెద్ద దిక్కుగా ఉన్న కన్నాబిరాన్‌ను చూసి రాజ్యం భయ పడేది. ఇప్పుడు అలాంటి భయం లేకుండా సరాసరి డిఫెన్స్ లాయర్‌నే అరెస్ట్ చేసారు. ఆయన అఖిల భారత స్థాయి కలిగిన బార్ లాయర్ల సంఘానికి సెక్ర టరీ. ఈ సంస్థ సదస్సులలో ప్రతిష్టాత్మకమైన హైకో ర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జెస్ పాల్గొంటారు. ఇక్కడే ఆగక దళిత సాహిత్య ప్రచురణ కర్త ఉద్యమ కారుడు సుధీర్‌ధావాళెను, ఇంకా ముందుకు పోయి నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ శాఖ అధిపతి ప్రొఫెసర్ షోమాసేన్‌ను అరెస్ట్ చేసారు. (యాదృచ్ఛికమే కావ చ్చు జి.ఎన్.సాయిబాబా కూడా ఆంగ్ల అధ్యాపకుడే).

కథ ఇక్కడితో ఆగలేదు. ఈ లేఖను భీమా కోరే గాం దళిత ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా చూడ డం మొదలుపెట్టారు. దీంతో గుజరాత్‌లోని ప్రముఖ యువ దళిత నేత జిగ్నేష్‌ను ఇందులోకి లాగారు. ఇందులో అన్ని పరిమితులు, హద్దులు దాటి ప్రకాశ్ అంబేడ్కర్ పేరును లాగడమే కాక, కాంగ్రెస్ పార్టీని కూడా లాగడంతో కథ రక్తికట్టింది. 

కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానంతరం వలసవాదు లు ప్రవేశపెట్టిన కొన్ని దుర్మార్గ చట్టాలను రద్దుచేసే బదులు కొనసాగించారు. అవి ఇప్పుడు ఆ పార్టీ మెడ కే చుట్టుకునేలా ఉంది. అటు దుర్మార్గమైన ఉపా చట్టా న్ని ప్రవేశపెట్టిన చిదంబరం ఈ చర్యలకు కలత చెంది మొత్తం చర్యను ఖండించాడు. మీడియాలో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు (స్పోక్స్ పర్సన్స్) తామే ఇద్దరు ప్రధాన మంత్రులను కోల్పోయామని అలాంటి వా ళ్ళం ఇలాంటి చర్యలకు మద్దతిస్తామా అని వాపో యారు. ఈ మొత్తం రచన చేసిన అధికార్లు ఎవరైనా సరే వాళ్ళు ఈ కాల్పనికతకు విశ్వసనీయత ఉంటుం దా లేదా అని ఆలోచించలేదు. అవసరమని కూడా భావించి ఉండరు. మావోయిస్టు పార్టీ వరకు ఏది చెప్పినా నడుస్తుందనేది కొంతవరకు నిజం. ప్రచార సాధనాల పుణ్యమా అని ఆ పార్టీ మీద జరిగిన దుష్ప్రచారమూ ఇంతా అంతా కాదు. చేస్తున్న ప్రచార హోరుకు ఆ పార్టీ తట్టుకోవడం చాలా కష్టం. దీన్ని ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న సాధనాలు చాలా తక్కువ. దళిత ఉద్యమాన్ని, ముఖ్యంగా భీమా కోరే గాం సంఘటనతో ఈ లేఖను ముడిపెట్టడం అత్యంత వివాదాస్పద అంశం. దళిత చైతన్యం అస్తిత్వ ఉద్య మాలలో ఎదిగింది. ఈ ఉద్యమాలు మావోయిస్టు ఉద్యమాన్ని విమర్శిస్తూ ఎదిగాయి. వర్గానికి, కులా నికి మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. గుజరాత్‌లోని ఊనా సంఘటన దళిత ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. ఈ ఉద్యమం నుంచి ఎదిగిన జిగ్నేష్ గుజరాత్ బి.జె.పి. పార్టీని ఢీకొన్నాడు. మొన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బి.జె.పి.ని షాక్‌కు గురిచేసాయి. అంతేగాక అస్తిత్వ ఉద్యమాన్ని భూ పంపిణీతో లింక్ చేయడంతో దళిత ఉద్యమం ఒక గెంతువేసింది. ‘ఆవుతోక మీకు ఐదు ఎకరాలు మాకు’ అనే నినాదం విప్లవాత్మకమైందే. బహుశా ఈ నేపథ్యంలోనే చాలాకాలంగా జరుగుతున్న భీమా కోరేగాం ఘటనను రాజ్యం, హిందుత్వ వాదులు భిన్న కోణం నుంచి చూడడం గమనించదగ్గ అంశం. దాని ఫలితాలే మావోయిస్టు పార్టీ రాసిందన్న లేఖకు, కోరేగాంకు ముడిపెట్టారు. 

ఇక కాంగ్రెస్ పార్టీని ఇందులోకి లాగడం పోలీస్ కల్పనాత్మకతకు పరాకాష్ఠ. నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ. బహుశా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్దాక్షి ణ్యంగా అణచివేసిన పార్టీ, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమున్న పాలకవర్గ పార్టీని ఇందులో భాగం చేయడం వలన కథ అడ్డం తిరిగింది. నాకు తెలిసి గత ఐదు దశాబ్దాల విప్లవ చరిత్రలో మావోయిస్టు పార్టీ ఏ లేఖ మీద కూడా ఇంత చర్చ జరగలేదు. మీడియా నిలువునా చీలిపోయింది. రెండు ఇంగ్లీష్ చానెల్స్  ఈ లేఖకు అత్యంత ప్రచారాన్ని కల్పించి ప్రధానమంత్రి భద్రత గురించి అందరిని ఆందోళనపడేలా చేసాయి. లేఖ పూర్వా పరాలు తెలుసుకోకుండా, తన విశ్వసనీయత గురించి పట్టించుకోకుండా, దేశ ప్రతిష్ఠ గురించి పట్టించు కోకుండా ఇలా ప్రధానమంత్రి భద్రత గురించి ఇంత పెద్ద స్థాయిలో చర్చించవచ్చా అన్న ఇంగిత జ్ఞానం కూడా చూపించలేదు. దేశ ప్రధాన మంత్రి అవసరమున్నా లేకున్నా చిన్న పెద్ద దేశాలకు వెళ్ళి ఒకవైపు ఆయుధాలు కొంటూ మరోవైపు విదేశీ పెట్టుబడిని ఆహ్వానిస్తున్నప్పుడు, ప్రధానమంత్రి భద్ర త అనే అంశాన్ని ఈ స్థాయిలో చర్చిస్తే పెట్టుబడి ఎలా వస్తుంది? పెట్టుబడి భద్రతను కోరుకుంటుంది. పెట్టుబడి శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉండే దేశాలకే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రధానమంత్రి భద్రత తప్ప కుండా పట్టించుకోవలసిందే, కాని గొంతు చించుకొని ప్రపంచమంతా తెలిసేలా అరవడం ‘వృద్ధిరేటు’కు కూడా మంచిది కాదు. ఇది ఎన్నికల రాజకీయాలలో ఎంత వరకు బి.జె.పి.కి ఉపకరిస్తుందో తెలియదు. 

ఈ కారణం వల్లే కావచ్చు కార్పొరేట్ మీడియా చీలి పోయింది. ఇండియాటుడె చానెల్ మొత్తం లేఖ ను కొట్టిపారేయడమే కాక బి.జె.పి అధికార ప్రతి నిధులను నిలదీసింది. ఇంతదాకా వచ్చాక బి.జె.పి అలాగే రాజ్యవ్యవస్థ తన విశ్వసనీయతను కాపాడు కోవడానికి దేశ ప్రజలు గౌరవించే ఏ సుప్రీంకోర్టు జడ్జిచేతైనా సమగ్ర విచారణ జరిపించవలసి ఉంటుం ది. విచారణ పూర్తి అయ్యేదాక ఇప్పుడు అరెస్ట్ చేసిన ప్రజాస్వామ్యవాదుల స్వేచ్ఛ పునరుద్దరించాలి. బి.జె.పి. దాని అనుబంధ సంస్థలు భవిష్యత్తు గురించి, రాజ్య సాధికారత గురించి, అలాగే పోలీస్ యంత్రాంగం పతనానికి డామేజ్ కంట్రోల్ కావాలి. 

ఈ మొత్తం ప్రహసనం కొన్ని కొత్త కోణాలను అంశాలను ముందుకు తెస్తున్నది. కొంతకాలంగా ఒక భయానక వాతావరణం నుంచి ప్రయాణిస్తున్న సమా జం క్రమక్రమంగా బయటపడుతున్నది. ప్రజల చైత న్య స్థాయి పెరుగుతున్నది, ధైర్యంగా మాట్లాడే సంస్కృతిని మధ్యతరగతి అలవరచుకుంటున్నది. ఈ ప్రజాస్వామిక వాదుల అరెస్టులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణాలలో విస్తృత నిరసన వ్యక్తమైంది. ఇప్పటికైనా మీడియాలో ఒక అంశం వాస్తవాల గురించి మాట్లాడుతున్నది. అది తాత్కా లికమే కావచ్చు. వార్తా పత్రికలు కూడా విమర్శనాత్మ కమైన రచనలను ప్రచురించారు. ఫాసిజం ప్రజలపై కుట్రచేస్తున్న సందర్భంలో సమాజం నుంచి ఇలాంటి ప్రతిఘటన ఈ స్థాయిలో రావడం కొంచెం ‘అచ్చేదినాలకు’ సంకేతమేమో!

image

English Title
The kingdom is a conspiracy ...
Related News