130 కోట్ల ఖాతాలకు చరమగీతం

Updated By ManamWed, 05/16/2018 - 14:55
Facebook Blocks 130 crore fake accounts
  • ఆరు నెలల్లో ఫేస్‌బుక్ తొలగించిన నకిలీ ఖాతాలు.. గత త్రైమాసికంలో 58.3 కోట్ల ఖాతాల తొలగింపు

Facebook Blocks 130 crore fake accountsశాన్‌ఫ్రాన్సిస్కో: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 58.3 కోట్ల నకిలీ ఖాతాలకు చరమగీతం పాడింది ఫేస్‌బుక్. ఈ ఏడాది జనవరి నుంచి గత మూడు నెలల కాలంలో అభ్యంతరకర పోస్టులు, హింసాత్మక పోస్టులు, లైంగిక, అసభ్య పోస్టులు, ఉగ్రవాద ప్రచారం, స్పామ్ పోస్టులు పెడుతున్న ఆయా ఖాతాలను రద్దు చేసినట్టు తెలిపింది. మంగళవారం విడుదల చేసిన త్రైమాసిక కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో ఆ విషయాన్ని వెల్లడించింది. గత ఆరు నెలల విషయానికొస్తే రద్దు చేసిన ఖాతాల సంఖ్య 130 కోట్లు అని స్పష్టం చేసింది. అంతేగాకుండా లక్షల కొద్దీ అభ్యంతరకర పోస్టులను ఫేస్‌బుక్ నుంచి నిషేధించినట్టు పేర్కొంది. తమ కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత అంతగా పనిచేయకపోయినప్పటికీ భారీ సంఖ్యలో నకిలీ ఖాతాలను గుర్తించి ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసినట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది. అయితే, ద్వేషపూరిత ప్రసంగాల విషయానికొస్తే ఏఐ సరిగ్గా పనిచేయట్లేదని, దానికి ప్రత్యేకించి సిబ్బంది పనిచేయాల్సి వస్తోందని పేర్కొంది. కేంబ్రిడ్జి అనలిటికా వ్యవహారం తర్వాత ఫేస్‌బుక్‌లో పారదర్శకతను పెంచడం కోసం రోజూ 10 లక్షలకుపైగా నకిలీ ఖాతాల భరతం పడుతున్నట్టు వెల్లడించింది. వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్న 200కు పైగా అప్లికేషన్లను ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాం నుంచి తొలగించినట్టు పేర్కొంది. 

English Title
Facebook Blocks 130 crore fake accounts
Related News