2 వన్డేల నిషేధం

pandya
  • సీఓఏ చీఫ్ రాయ్ సిఫారసు

  • చట్టపరమైన చర్యలపై ఎడుల్జీ దృష్టి

న్యూఢిల్లీ: ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లపై రెండు వన్డేల నిషేధం విధించాలని గురువారం కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ సిఫారసు చేశారు. కానీ సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం అంతటితో వదిలిపెట్టే ఆలోచనలతో లేదు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఈ అంశాన్ని బీసీసీఐ లీగల్ సెల్‌కు అప్పగించారు. స్త్రీలపై వ్యామోహంతో పాండ్య చేసిన వ్యాఖ్యలపై నలు మూలల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ఇద్దరు క్రికెటర్లకు సీఓఏ షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. విమర్శలకు స్పందించిన ఆల్ రౌండర్ పాండ్య క్షమాపణలు చెబుతూ ఇకపై అలా ప్రవర్తించనని అన్నాడు. ‘పాండ్య ఇచ్చిన వివరణ నాకు సంతృప్తికరంగా లేదు. అందుకే ఈ ఇద్దరు క్రికటర్లపై రెండు వన్డేల నిషేధానికి సిఫారసు చేశాను. ఏదిఏమైనా డయానా అభిప్రాయం తెలుసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం’ అని రాయ్ అన్నారు. ఆ షోలో కొంత మంది స్త్రీలతో గడిపిన వివరాలను తెలుపుతూ అన్ని విషయాలను తన తల్లిదండ్రులతో పంచుకుంటానని పాండ్య చెప్పాడు. ఆస్ట్రేలియాలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో ప్రారంభం కానుంది. సినీ నిర్మాత కరణ్ జొహార్ నిర్వహించిన ఆ షోలో రాహుల్ కూడా పాల్గొన్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని బీసీసీఐ కోరినప్పటికీ రాహుల్ ఇప్పటి వరకు స్పందించలేదు. ‘పాండ్య, రాహుల్‌లపై నిషేధం విధించేలా చట్టపరమైన చర్యలకు డయానా చర్యలు తీసుకుంటున్నారు. కనుక ఆమె అభిప్రాయం తెలిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. నాకు తెలిసినంత వరకు వాళ్ల వ్యాఖ్యలు చాలా దారుణం. అంగీకారయోగ్యం కాదు’ అని రాయ్ అన్నారు. 

ఈ వివాదంపై బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరి అభిప్రాయాలను కూడా ఎడుల్జి అడిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు క్రికెటర్లపై నిషేధం విధించాలని కోరినట్టు చౌదరి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతేకాదు ఆయన బీసీసీఐ సీఈఓ రాహుల్ జొహ్రీపై కూడా ధ్వజమెత్తారు. ఇటీవలే జొహ్రీ కూడా లైగింక వేధింపుల కేసును ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ‘సరైన విచారణ జరిపి ఇద్దరు క్రికెటర్లపై నిషేధం విధించాలి. ఒకవేళ జట్టుకు ఎంపికైతే వాళ్లను ఒకసారి ఆడనిచ్చి తర్వాత వారిపై నిషేధం విధించాలనుకుంటే ముందుగా లింగ సునితత్వం ప్రోగాంను నిర్వహించాలి. అంతేకాదు ఈ ప్రోగ్రాంలో సపోర్ట్ స్టాఫ్‌తో పాటు జట్టు సభ్యులందరూ పాల్గొనాలి. అడ్డకేట్ కుమారి వీణ గౌడ సూచించిన విధంగా సీఈఓను కూడా ప్రోగ్రాంలో చేర్చాలి’ అని అనిరుధ్ చెప్పారు. అయితే ఆ టీవీ షోలో పాల్గొనేందుకు ఆ ఇద్దరు క్రికెటర్లకు ఎవరు అనుమతి ఇచ్చారో కూడా విచారణ జరపాలని అనిరుధ్ చెప్పారు. ‘కాంట్రాక్ట్‌లు పొంది ప్రాక్టీస్‌లో ఉండాల్సిన ఈ క్రికెటర్లు టీవీ షోలో ఎలా పాల్గొన్నారు. వాళ్లు అనుమతి తీసుకున్నారా? వారికి అనుమతి ఇచ్చారా? ఒకవేళ అనుమతి ఇచ్చివుంటే ఎవరిచ్చారు?’ అని ఎడుల్జీని ప్రశ్నించారు. ‘ఎంటర్‌టైన్‌మెంట్ షోలకు క్రికెటర్లను తీసుకెళ్లేందుకు స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లు బయట ఎదురుచూస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నాను’ అని అనిరుధ్ అన్నారు. ఎందుకంటే క్రికెటర్లు ఏదైనా మీడియా సమావేశంలో పాల్గొనాలంటే బోర్డు అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాల్సివుంటుంది. మహిళల పట్ల ఈ క్రికెటర్లు అనుచితంగా మాట్లాడటం చూస్తుంటే బుకీల ‘హనీ-ట్రాప్’లో వీరు పడ్డారేమో అనిపిస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
 

Tags

సంబంధిత వార్తలు