ఆనాటి నవ్వులు ఏవమ్మా..?

Updated By ManamSun, 07/22/2018 - 01:06
image

హాస్యం అంటే హాయిగా నవ్వుకునేలా ఉండాలి. అలాంటి హాస్యం అన్నివిధాలా ఆరోగ్యకరం. తెలుగు వారు హాస్య ప్రియులు. హాస్యాన్ని ఆస్వాదించాలంటే తెలుగువారి తర్వాతే ఎవరైనా అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు జంధ్యాల, రేలంగి నరసింహారావు, వంశీ, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఇ.వి.వి.సత్యనారాయణ వంటి దర్శకులు హాస్యానికి కొత్త అర్థాన్ని చెప్పారు. ఎవరి శైలిలో వారు పూర్తి స్థాయి కామెడీ సినిమాలు రూపొందించారు. చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, నరేష్ వంటి హీరోలు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. కానీ, ఇప్పుడు జనరేషన్ మారింది. దర్శకనిర్మాతల అభిరుచుల్లోనూ మార్పులు వచ్చాయి. క్రమంగా కామెడీ సినిమాలు మరుగున పడిపోయాయి. చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ పూర్తి స్థాయి కామెడీ సినిమాలు చేసే హీరోగా ఇప్పటి తరానికి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఫుల్ ప్లెడ్జ్‌డ్ కామెడీ సినిమాలు అడపా దడపా వస్తున్నా ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో అలరించలేకపోతున్నాయి. 
 

image

నవ్వు నాలుగు విధాలా చేటు అన్నది పాతతరం మాట.. నవ్వు అన్నివిధాలా గ్రేటు అనేది అధునాతన ఆలోచన. మనిషి జీవితంలో నవ్వు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. నవరసాల్లో హాస్యాన్ని ఆస్వాదించినంతగా మరో రసాన్ని మనిషి ఆస్వాదించలేడు. సినిమా అనేది ప్రేక్షకులకు అందుబాటులోకి రానంత వరకు ఇతర మాధ్యమాల ద్వారా వీలైనంత వినోదాన్ని పొందేవారు. సినిమా ప్రధాన వినోద సాధనంగా మారిన తర్వాత ప్రేక్షకులకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే అవసరం లేకుండా పోయింది. పౌరాణికం, జానపదం, భక్తిరసం, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథా చిత్రాలు... ఇలా అన్నిరకాల సినిమాలు ప్రేక్షకులను అలరిం చాయి. మొదట మనం చెప్పుకున్నట్టు హాస్యం మనిషి జీవితంలో ప్రధాన పాత్ర పోషించేదే అయినా సినిమాల పరంగా ప్రత్యేకంగా హాస్య చిత్రాలు అనేవి ఒకప్పుడు వచ్చేవి కాదు. హాస్యాన్ని అందించేందుకు ప్రత్యేకంగా పాత్రలను సృష్టించి వాటి ద్వారా ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేసేవారు. సాంఘిక చిత్రాల్లో కమెడియన్స్ లేకుండా, కామెడీ లేకుండా సినిమా అనేది ఉండేది కాదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు హాస్యమే ప్రధానంగా సినిమాలు రూపొందించడం మొదలు పెట్టారు. వారిలో మొదటిగా చెప్పుకోవాల్సింది జంధ్యాల గురించి. రచయితగా కెరీర్‌ని ప్రారంభించిన జంధ్యాల కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఆయన రూపొందించిన సినిమాలు కథాబలం ఉన్నవే అయినప్పటికీ హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కథ ఏదైనా ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా సినిమాలు రూపొందించేవారు. అలా తనకంటూ ప్రత్యేకంగా అభిమానుల్ని కూడా సంపాదించుకున్నారు జంధ్యాల. కామెడీ సినిమాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న మరో దర్శకుడు రేలంగి నరసింహారావు. జంధ్యాల, రేలంగి నరసింహారావు ఒకే సంవత్సరం దర్శకులుగా మారారు. రేలంగి దర్శకత్వం వహించిన 70 సినిమాల్లో ఎక్కువ శాతం హాస్య ప్రధాన సినిమాలే ఉండడం విశేషం. వీరిద్దరి తర్వాత  కామెడీకి పెద్ద పీట వేసిన దర్శకుడు వంశీ. జంధ్యాల, రేలంగి నరసింహా రావు వంటి దర్శకులు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా వంశీ సినిమాలు రూపొందించేవారు. అతని సినిమాల్లోని పాత్రలు నిజ జీవితంలో మనకు నిత్యం తారసపడేవిగా ఉండేవి. వీరి తర్వాత హాస్య ప్రధానమైన సినిమాలు రూపొందించడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ. పైన పేర్కొన్న దర్శకుల మార్కు ఎక్కడా కనిపించకుండా తనదైన శైలిలో హాస్యాన్ని అందించేవారు. ఇ.వి.వి. హాస్య చిత్రాలే కాకుండా మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎలుగెత్తి చాటే సినిమాలు కూడా రూపొందించారు. అయితే ఇ.వి.వి. అంటే అందరికీ గుర్తొచ్చేవి హాస్య చిత్రాలు మాత్రమే. ఇ.వి.వి. తర్వాత పూర్తి స్థాయి కామెడీ సినిమాలు తీసేందుకు చాలా మంది దర్శకులు ప్రయత్నించినప్పటికీ ఎవరూ సక్సెస్ అవ్వలేకపోయారు. మరో పక్క ఎస్.వి.కృష్ణారెడ్డి కూడా ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు చేశారు. ఆయన సినిమాల్లో సెంటిమెంట్ పాలు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ అదే స్థాయిలో హాస్యాన్ని కూడా పండించే ప్రయత్నం చేసేవారు. 

గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒకే తరహా సినిమాలు రూపొందించేందుకు మన దర్శకులు ప్రయత్నిస్తున్నారు. యాక్షన్ సినిమాలు, సెంటిమెంట్ సినిమాలు, ప్రేమకథా చిత్రాలు, మాస్ మసాలా సినిమాలు.. ఇలా చూసిన సినిమాలనే మళ్ళీ మళ్ళీ చూడాల్సిన పరిస్థితి తెలుగు ప్రేక్షకులకు ఏర్పడింది. ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే సినిమాలు, కళ్ళు చెదిరే విజువల్స్‌తో సినిమాలు చేస్తున్నారు. ఓ మాదిరి బడ్జెట్ నుంచి భారీ బడ్జెట్ వరకు ఈ తరహా సినిమాలు రూపొందుతున్నాయి. అయితే ఎవరూ హాస్యం ప్రధానంగా ఉండే సినిమాలు తీసే సాహసం చెయ్యడం లేదు. ఎందుకంటే అన్నింటి కంటే కష్టమైన పని నవ్వించడమే. ఒకవేళ అలాంటి సాహసం చేసినా హాస్యం పండించకపోగా అభాసుపాలవు తున్నారు. ఆరోగ్యకరమైన హాస్యం స్థానంలో వెకిలి చేష్టలతో కూడిన హాస్యం వచ్చి చేరింది. హాస్యం అంటే ద్వందార్థాలతో ఒకరినొకరు హేళన చేసుకునే ప్రక్రియగా మారిపోయింది. ఒకప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా సినిమా చూసి ఆనందించేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. 

పాతతరంలో టాప్ హీరోలు సైతం కామెడీ సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపించేవారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి హీరోలు కూడా మాస్, సెంటిమెంట్, యాక్షన్ సినిమాలు చేస్తూనే కామెడీ సినిమాలు చేసేందుకు ముందుకొచ్చేవారు. అంతకుముందు రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, నరేష్ వంటి హీరోలు కామెడీ సినిమాలు చెయ్యడం ద్వారా స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. ఇప్పటి హీరోలు అలాంటి సినిమాలు చెయ్యాలన్నా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే సత్తా ఉన్న దర్శకులు అందుబాటులో లేరు. జంధ్యాల, రేలంగి నరసింహారావు, వంశీ, ఇ.వి.వి.సత్యనారాయణ వంటి దర్శకులు చేసిన హాస్య ప్రధానమైన సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరైనా సాహసం చేసి కామెడీ సినిమా చేసినా చేతులు కాల్చుకోవాల్సి వస్తుందే తప్ప ప్రయోజనం మాత్రం శూన్యం.
తెలుగు వారు హాస్య ప్రియులు. హాస్యాన్ని ఆస్వాదించడంలో తెలుగు వారు ఎప్పుడూ ముందుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి తగ్గట్టుగానే అప్పట్లో మన దర్శకులు సహజ సిద్ధమైన కామెడీతో ప్రేక్షకుల్ని అలరించారు. సినిమా అనగానే ఎప్పుడూ చూడని క్యారెక్టర్స్ కాకుండా నిత్య జీవితంలో మనకు తారసపడే వ్యక్తుల విచిత్రమైన మేనరిజమ్స్‌తో ఎక్కడా అశ్లీలం లేకుండా సినిమాలు తీసేందుకు ఆనాటి దర్శకులు ప్రయత్నించేవారు. దర్శకుడికి, హీరోకి మధ్య అవగాహన కూడా మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి దోహదపడేవి. రేలంగి నరసింహారావు 70 సినిమాలు చేస్తే అందులో 35 సినిమాలు రాజేంద్రప్రసాద్‌తోనే చేశారంటే ఆ హీరోకి, దర్శకుడికి మధ్య ఎలాంటి అండర్‌స్టాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఆరోగ్యకరమైన కామెడీని తెలుగు వారు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆస్వాదిస్తారు. ఈమధ్యకాలంలో కూడా కొన్ని హాస్య ప్రధాన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టేవిగా వచ్చాయి. ప్రేక్షకులు కూడా ఆ సినిమాలను సాదరంగా ఆహ్వానించారు, ఆదరించారు. దీన్ని బట్టి ఏ సినిమానైనా భారీ బడ్జెట్‌తో తియ్యనవసరం లేదు, పెద్ద పెద్ద సెట్లు వెయ్యక్కర్లేదు.. పాటల కోసం విదేశాలకు ఎగిరి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి కథ, కథనాలతోపాటు రెండు గంటల సేపు హాయిగా నవ్వుకునేలా ఉంటే చాలు. ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది సుస్పష్టం. 

ఆ క్రియేషన్ ఇప్పుడు లేదేమో అనిపిస్తోంది 
imageపౌరాణికాన్ని రామారావుగారు, సోషల్‌ని నాగేశ్వరరావుగారు హీరో రేంజ్‌కి ఎలా తీసుకెళ్ళారో కామెడీని కమర్షియల్ హీరో రేంజ్‌కి తీసుకెళ్ళినవాడు రాజేంద్రప్రసాద్. అలా చెయ్యగలిగానంటే మెయిన్ కారణం రచన. ఆ తర్వాత దర్శకులు. జంధ్యాలగారు, వంశీగారు, రేలంగి నరసింహారావుగారి నుంచి ఇ.వి.వి. వరకు ఆ కామెడీని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళారు. ఒక రొమాన్స్ హీరో అయినప్పుడు, ఒక యాక్షన్ హీరో అయినప్పుడు కామెడీ హీరో ఎందుకు కాదు. నువ్వు ఏమిటో, నీ ప్రత్యేకత ఏమిటో నిరూపించుకోలేకపోతే నువ్వు ఇండస్ట్రీలో నిలబడలేవు అని నాకు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్ మెడల్ వచ్చినపుడు ఎన్.టి.రామారావుగారు చెప్తే నాకు ఆరోజు కనిపించింది కామెడీ.
అలా హీరోనే కామెడీ అనే రేంజ్‌కి నా సినిమాలు వెళ్లాయి. లేడీస్ టైలర్ హీరోనే కామెడీ, అప్పుల అప్పారావు హీరోనే కామెడీ, ఏప్రిల్ 1 విడుదల హీరోనే కామెడీ. అంటే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించే బాధ్యత హీరో తీసుకుంటాడు. అహనాపెళ్ళంట వంటి సినిమాలు ఈరోజుకీ టీవీల్లో వేస్తున్నారంటే సినిమా అంతా హీరో చేసిన కామెడీ వల్ల. ఆ విధంగా నేను ఒక గోల్డెన్ పీరియడ్ చూశాను. అలాంటి కామెడీ సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు అంటే.. ఆ క్రియేషన్ ఇప్పుడు లేదేమోనని నా మనసుకు అనిపిస్తోంది. ఎందుకంటే నేను హీరోగా చేసిన సినిమాల్లోని క్యారెక్టర్స్ అన్నీ రెగ్యులర్ హీరో చేసేవి కావు. మన లైఫ్ నుంచి వచ్చినవే. మనం నిత్యం చూస్తున్న క్యారెక్టర్సే. నేను చేసిన 252 సినిమాల్లో.. నిన్నటి మహానటి వరకు అన్నీ మనకు పరిచయం వున్న క్యారెక్టర్సే చేశాను. నిజమైన క్యారెక్టర్‌తో సినిమాలు తీస్తే అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా కాకుండా ఒక వీక్‌నెస్ మీద కామెడీ చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. నాకు తెలిసి స్టాండర్డ్స్‌కి దిగువన వుండే క్యారెక్టర్స్‌తో కామెడీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే అది ఆరోగ్యకరమైన కామెడీ అనిపించుకోవడం లేదు. 
- నటుడు రాజేంద్రప్రసాద్

దర్శకనిర్మాతల దృక్పథం మారాలి 
నేను, జంధ్యాలగారు ఒకే సంవత్సరం దర్శకులుగా మారాం. పూర్తి స్థాయి కామెడీ సినిమాలు తీశాం. మా తరం కంటే ముందు పూర్తి హాస్య చిత్రాలు ఎక్కువగా రాలేదనే చెప్పాలి. కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ మాలాగా ప్రతి క్యారెక్టర్‌నిimage కామెడీగా చూపించలేదు. నేను, జంధ్యాలగారు తీసిన సినిమాల్లో ప్రతి క్యారెక్టర్‌తోనూ నవ్వించే ప్రయత్నం చేశాం. ఒక్కో క్యారెక్టర్‌కి ఒక్కో తరహా మేనరిజమ్స్ పెట్టేవాళ్ళం. అలా పూర్తి స్థాయి కామెడీ సినిమాలు చెయ్యగలిగాం. తర్వాత తర్వాత పూర్తి స్థాయి కామెడీ సినిమాలు రాకపోవడానికి కారణం ఆ సినిమాలకు ప్రత్యేకంగా హీరోలు లేకుండా పోవడం. రాజేంద్రప్రసాద్‌గారు, చంద్రమోహన్‌గారు, నరేష్‌గారు ఆ తరహా సినిమాలు చేసేవారు. వారి తర్వాత మళ్ళీ అల్లరి నరేష్ వచ్చేవరకు చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో ఫుల్ ప్లెడ్జ్‌డ్ కామెడీ సినిమాలు రాలేదు. 

ఈ గ్యాప్‌లో ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. అదేమిటంటే పెద్ద పెద్ద హీరోలు కూడా కామెడీ చెయ్యడం. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్‌కల్యాణ్ వంటి హీరోల క్యారెక్టర్లను కామెడీగా మలిచారు దర్శకులు. కానీ, అవి ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు కాదు. దానివల్ల ఫుల్‌లెంగ్త్ కామెడీ సినిమాలు మరుగున పడిపోయాయి. అలాంటి సినిమాలు తియ్యాలంటే నిర్మాతకి, దర్శకుడికి అభిరుచి ఉండాలి. అభిరుచి ఉంటేనే ఫుల్‌లెంగ్త్ కామెడీ సినిమాలు తియ్యగలరు. అయితే కొంతమంది నిర్మాతలకు అభిరుచి ఉన్నా స్టార్ డామినేషన్ పెరిగిపోయింది. దర్శకనిర్మాతల్లో కళాతృష్ణ తగ్గిపోయింది. సినిమాని బిజినెస్‌పరంగానే ఆలోచించారు. డబ్బే ప్రధానం అనుకున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టి దాన్నే కామెడీ అని చెప్పడం మొదలుపెట్టారు. ఆరోజుల్లో మేం తీసిన సినిమాల్లో కూడా అంతర్లీనంగా శృంగారం ఉండేది. అయితే అది గిలిగింతలు పెట్టేదిగా ఉండేది తప్ప జుగుప్స కలిగించేదిగా ఉండేది కాదు. ఇప్పుడు సినిమాల్లో కంటే టి.వి. షోల్లోనే మరీ బూతు చూపించేస్తున్నారు. టీవీల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అలాంటి కామెడీ చూస్తున్నారు కాబట్టి సినిమాల్లో పెడితే తప్పేంటి అనే ధోరణి దర్శకనిర్మాతల్లో పెరిగిపోయింది.

 అయితే ఇప్పుడు కూడా భలే భలే మగాడివోయ్, పెళ్లిచూపులు, సమ్మోహనం వంటి సినిమాలు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల్ని నవ్వించేవిగా రూపొందుతున్నాయి. అయితే వాటి సంఖ్య తక్కువ. మంచి కామెడీతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. అలా తియ్యాలంటే దర్శక నిర్మాతల దృక్పథం మారాలి. అలాగే ఆర్టిస్టుల ఆలోచన కూడా మారాలి. తాము చేస్తున్న సన్నివేశంలో బూతు అనేది ఉందంటే దానికి అభ్యంతరం చెప్పాలి. అప్పుడే ఆరోగ్యకరమైన కామెడీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. 
- దర్శకులు రేలంగి నరసింహారావు

అందుకే పాత కామెడీ సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తున్నారు  
నేను హాస్యనటిగా ఎన్నో సినిమాలు చేశాను. నేను చేసిన పాత్రల ద్వారా చాలా మంచి పేరు వచ్చింది. జంధ్యాలగారు, రేలంగి నరసింహారావుగారు వంటి దర్శకులతో, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, నరేష్ వంటి ఆర్టిస్టులతోimage ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమాలు చేసేవాళ్ళం. ఆరోజుల్లో రైటర్స్ అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చెయ్యడం వల్ల మంచి మంచి క్యారెక్టర్స్ చెయ్యగలిగాం. అలా చాలా కామెడీ సినిమాలు చేశాం. రేలంగి నరసింహారావుగారు, జంధ్యాల లాంటి దర్శకులు కామెడీ సబ్జెక్ట్‌తోనే సినిమాలు తీసేవారు. ఇ.వి.వి.సత్యనారాయణగారు కూడా చాలా మంచి కామెడీ సినిమాలు చేశారు. ఇప్పుడలాంటి సినిమాలు రాకపోవడానికి కారణం ఫుల్ ప్లెడ్జ్‌డ్‌గా కామెడీ కథలు రాసేవారు, తీసేవారు లేకపోవడం. ఇప్పుడు యూత్ సినిమాలు, లవ్‌స్టోరీలు ఎక్కువగా తీస్తున్నారు. జనరేషన్ మారుతున్న కొద్దీ సినిమాల తీరు కూడా మారుతోంది. పూర్తి స్థాయి కామెడీ సినిమాలు ఇప్పుడు రావడం లేదు కాబట్టే పాత కామెడీ సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. మళ్ళీ కామెడీ సినిమాలు రావాలంటే దర్శకుల్లో, నిర్మాతల్లో మార్పు రావాలి. అలాంటి సినిమాలు తియ్యాలన్న ఆలోచన కలగాలి. 
- నటి శ్రీలక్ష్మి

English Title
where is the smiles ..
Related News