అమెరికా అటార్నీ జనరల్‌పై వేటు

Updated By ManamFri, 11/09/2018 - 01:40
Jeff Sessions
  • జెఫ్ సెషన్స్‌ను సాగనంపిన ట్రంప్

  • ఆయన స్థానంలో వైటేకర్ నియామకం

  • తీవ్రంగా విమర్శించిన డెమొక్రాట్లు

jeffsessionsవాషింగ్టన్: మధ్యంతర ఎన్నికలు జరిగిన ఒక్క రోజు తర్వాత అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఆయన స్థానంలో మాథ్యూ వైటేకర్‌ను తాత్కాలికంగా నియమించారు. 2016 అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యంపై విచారణ జరిపించాలని సెషన్స్ పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారం ట్రంప్ అభ్యర్థిత్వానికి అడ్డంకిగా ఉంది. దాంతోపాటు ఇంకా పలు విషయాల్లో సెషన్స్ అంటే ట్రంప్‌కు పడట్లేదు. అయితే సెషన్స్‌ను తప్పించడంపై డెమొక్రాట్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తునకు ముగింపు పలకడానికే అటార్నీ జనరల్‌ను తొలగించారని విమర్శిస్తున్నారు. ప్రత్యేక న్యాయవాది ముల్లర్ దర్యాప్తునకు ఉన్న చిత్తశుద్ధిని కాపాడేందుకు కాంగ్రెస్ తగిన చర్యలు తీసుకోవాలని ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల నెం.2 నాయకుడు స్టెనీ హోయర్ డిమాండు చేశారు. మంగళవారం నాటి ఎన్నికల్లో డెమొక్రాట్లు ఈ సభలో ఆధిక్యం సాధించారు. ఇది ట్రంప్‌కు ఎదురుదెబ్బ అయింది. ముల్లర్ దర్యాప్తును అడ్డుకోడానికే సెషన్స్‌ను తొలగిస్తే.. అందుకు ట్రంప్‌ను బాధ్యుడిని చేయాల్సిందేనని హోయర్ అన్నారు. సెషన్స్‌ను సాగనంపడంపై వ్యాఖ్యానించేందుకు ముల్లర్ కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు. అయితే, ముల్లర్ దర్యాప్తుపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోదని ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గిలియానీ అంటున్నారు. ట్రంప్ ప్రచారంలో రష్యా జోక్యం ఉందా లేదా అన్న విషయాన్ని ముల్లర్ దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, విచారణను అడ్డుకోడానికి ట్రంప్ ఏమైనా చట్టవిరుద్ధంగా ప్రయత్నించారా అన్నదాన్ని కూడా ఆయన తేల్చనున్నారు. ఇంకా ట్రంప్ కుటుంబ సభ్యులు, అనుయాయులు ఆర్థిక అక్రమాలకు ఏమైనా పాల్పడ్డారా అనే విషయం కూడా చూస్తున్నారు. ట్రంప్ మాజీ ప్రచార చైర్మన్‌తో పాటు పలువురు ప్రచారకర్తల మీద ముల్లర్ పలు ఆరోపణలు చేశారు. వీళ్లంతా 25 మంది రష్యన్లు, మూడు సంస్థలతో కలిసి ట్రంప్ విజయానికి పరోక్షంగా మధ్యవర్తిత్వం చేశారన్నది ప్రధాన ఆరోపణ. అటార్నీ జన రల్ సెషన్స్ తొలగింపు విషయాన్ని కూడా ట్రంప్ ట్విట్టర్ ద్వారానే వెల్లడించారు. వైటేకర్ తాత్కాలిక అటార్నీ జనరల్‌గా ఉంటారన్నారు.

English Title
The United States Attorney General
Related News