ఉమేశ్, బుమ్రా, కుల్దీప్‌కు విశ్రాంతి

Updated By ManamFri, 11/09/2018 - 17:37
Umesh Yadav, Jasprit Bumrah, Kuldeep Yadav, third T20I, West Indies
  • సిద్ధార్ధ్ కౌల్‌కు దక్కిన చోటు 

  • చెన్నై వేదికగా వెస్టిండీతో మూడో టీ20

  • 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ 

Umesh Yadav, Jasprit Bumrah, Kuldeep Yadav, third T20I, West Indiesచెన్నై: వెస్టిండీస్‌తో మూడో టీ20 సిరీస్‌కు భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతి కల్పించారు. శనివారం చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో టీమిండియా మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్, బుమ్రా, కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి కల్పించినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘చెన్నైలో జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు ఉమేశ్, బుమ్రా, కుల్దీప్‌లకు విశ్రాంతి కల్పించాలని టీమిండియా యాజమాన్యం నిర్ణయించింది’’ అని బీసీసీఐ తెలిపింది.

ఆస్ట్రేలియా పర్యటన దృష్ట్యా మంచి ఫిట్‌నెస్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురు బౌలర్లకు విశ్రాంతి కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ పేర్కొంది. మూడో టీ20 మ్యాచ్‌లో పంజాబ్ కుర్రాడు బౌలర్ సిద్ధార్ధ్ కౌల్‌కు చోటు దక్కింది. బుధవారం లఖ్‌నవ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతకంతో విజృంభించడంతో భారత్ 71 పరుగుల తేడాతో కరీబియన్లపై విజయం సాధించింది. రోహిత్ శర్మ 61 బంతుల్లో 111 పరుగులు సాధించగా 195 పరుగులు సాధించిన భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు 124/9 పరుగులకే చాప చుట్టేసింది. దాంతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తో ఆధిక్యంలో నిలిచింది. 

English Title
Umesh Yadav, Jasprit Bumrah and Kuldeep Yadav rested for third T20I against West Indies
Related News