రెండు పార్శ్యాల కవితాఝరి

Updated By ManamSun, 07/22/2018 - 00:27
dasharathi krishnamacharya

దాశరథి కృష్ణమాచార్య పేరు తలవడమే తడవుగా తెలంగాణ హృదయం పులకరిస్తుంది. వీరు వరంగల జిల్లా మరిపేడ imageమండలం చిన్నగూడూరు గ్రామంలో 1925 జూలై 22న జన్మించారు. తల్లి శ్రీమతి వెంటకటమ్మ, తండ్రి శ్రీ వెంకటాచార్యులు. దాశరథి ఇంటి పేరు, అందుకే దాశరథిగా ఇంటిపేరుతోనే వాసికెక్కారు. మెట్రిక్యులేషన్ వరకు ఆయన విద్యాభ్యాసం ఖమ్మంలో సాగించారు. ఊర్దూలో మెట్రిక్యులేషన్, భోపాల్ యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియెుట్‌లో ఉత్తీర్ణులయ్యారు, తదనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్ సాహిత్యంలో బి.ఎ. పట్టాపొందారు. దాశరథి చిన్నతనం నుండే వేదాలను, ఇతిహాసాల్ని ఔపోసనపట్టారు. భగవద్గీత శ్లోకాల్ని కంఠతా పట్టిన దాశరథి, ఆశువుగా పద్యా లు చెప్పేవారు. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.

దాశరథి హైస్కూల్‌లో చదువుతున్న రోజుల్లో ఏడవ నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ రచించిన ప్రార్థనా గీతాన్ని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పాఠా లు ప్రారంభింపక ముందు ఆలపించాలని ఆదేశాలు ఉన్నాయి.
‘తా అబద్ ఖాలిఖే ఆలంమే రియాసల్ రఖే
తుఝ్‌కో ఉస్మాన్ బసద్ ఇజ్లాల్ సలామల్ రఖే’- అనే చరణాలతో ప్రార్థనా గీతం ప్రారంభించాలి, ఈ ప్రార్థన మరికొన్ని పంక్తులు కలిగి ఉండేది.
నిన్ను, ప్రపంచ సృష్టికర్త ప్రళయం వరకూ, ఈ రాజ్యా న్ని సుస్థిరంగా ఉంచని, ఓ ఉస్మాన్ నిన్ను నిండు దర్పంతో క్షేమంగా ఉంచనీ’ అనే పై పాదాలలోని అర్థం. ఆ పిన్న వయసులోనే నిజాం హైదరాబాదును, నిరంకుశంగా నిలిపివేస్తున్నాడనే భావం కలిగిన దాశరథికి ఈ ప్రార్థనా గీతం నచ్చలేదు. ఏడుస్తూ ఈ ప్రార్థనను చేసేవాడు, ఒక్కొకసారి ప్రార్థనను పాడడానికి, అంగీకరించలేక ప్రధానోపాధ్యాయుని చేత దెబ్బలు తినేవాడట అతనికి నిజాం పట్ల ద్వేషవేుకాని, ఉర్దూ భాష పట్ల అభిమానమే  యుండేది. అప్పటి నుండే తెలంగాణ ప్రజలను నిజాంను ఎదిరించడానికి చైతన్య స్ఫూర్తిగా వదిలాడు.

గ్రామాలలోని ప్రజలు, నిజాంనిరంకుశ పాలనలో కుంగి మగ్గిపోతూ పడే బాధలు వారి వెట్టిచాకిరీ చూడలేక నిజాం పరిపాలనలో నుండి తెలంగాణ విముక్తి కోసం తెలం గాణ స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించాడు. నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించాడు. నిజామ్, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వారితో దాశరథికి సాన్నిహిత్యం ఏర్పడింది. దాశరథి దేశభక్తి గీతాలు, ప్రసంగాలు, స్వాతం త్య్ర యోధులను, విముక్తి దళాలకు ఉత్తేజం కలిగించాయి. ఉద్యమాన్ని ప్రజాఉద్యమంగా కొత్తపుంతలు తొక్కించాడు.
నిజాంకు వ్యతిరేకంగా నడిచిన ప్రజా ఉద్యమకాలంలో ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’ కావ్యాలు రచించాడు. నిజామాబా ద్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే అగ్నిధారలోని కావ్యఖండికల్లోని పద్యాలను జైలు గోడలపై దాశరథి బొగ్గు తో రాసినవే... 

‘‘ఓ నిజాము పిశాచమా కానరాదు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను త్రెంపి అగ్నిలో దించినావు


నా తెలంగాణ కోటి రత్నాల వీణ’’ అంటు నిజాంను పిశాచంగా చిత్రించిన సాహసి దాశరథి. అలాగే తెలంగాణ విముక్తి కోసం ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి నిజాం హింసాత్మక చర్యలను ప్రతిఘటిస్తూ పద్యాలు రచించి ఊరూరా ఎలుగెత్తి వినిపించిన ప్రజాకవి దాశరథి ‘ప్రాణములొడ్డి ఘోరగహనాటవులను పడగొట్టి మంచి
మాగాణములు సృజించి మొముకల్ నుసిచేసి,
పొలాలు దున్ని భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన

రైతుదే తెలంగాణము, రైతుదే... ముసలి నక్కకు రాచరికమ్ముదక్కునే - దక్కనిత్తుమే! -అంటూ సింహగర్జన చేసిన మహాకవి, అంతటితో ఆగకుండా, పాలకుడని చూడకుండా, నిజాం ప్రభువును జన్మజన్మాల బూజు అని ఈసడించిన ప్రజాకవి దాశరథి. తెలంగాణ మాగాణాన్ని దాశరథి తమ కవితా కుసుమాలతో అలంకరించి తరించాడు. ఉప్పెనలా ఉప్పొంగుతున్న నిండు గుండెతో తెలంగాణను వేనోళ్ల పొగిడాడు. మచ్చుకు కొన్ని ఇట ఉదహరిస్తాను.
‘కోటి తెలుగు బంగారు కొండ క్రింద / పరచుకొన్నట్టి సరసులో పలవశించి ప్రొద్దుప్రొద్దున అందాల పూలు వూయు / నా తెలంగాణ తల్లి కంజాతవల్లి’
‘ఎల్లోరా గుహలోపల పల్లవించి / వేయి స్తంభాల గుడి లోన విరులు పూచి శిల్పి ఉలి ముక్కులో నివసించినట్టి / నా తెలంగాణ కోటి అందాల జాణ’ అన్నారు.
‘మూగవోయిన కోటి తమ్ముల గళాలు/ పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కలానకు బలమిచ్చినడిపినట్టి / నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అన్నారు.
తాను పుట్టిన తెలంగాణ నేలను తన తల్లిగా, తెలంగా ణ తల్లిగా, కంజాతవల్లిగా, కోటి రత్నాలవీణగా తన కలం గళం నుండి అభివర్ణించుకొని పులకించిపోయారు. నిజాం నిరంకుశపాలన సంకెళ్ళ నుండి కన్నభూమి తెలంగాణ వి ముక్తి కోసం దాశరథి కన్న కలలకు ప్రతిఫలంగా 1948 సెప్టెంబర్ 17న భారత సేనలు హైదరాబాద్ సంసానాన్ని చుట్టుము ట్టుగా, నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భేషరతుగా లొంగిపోయారు. హైదరాబాద్ రాజ్యం భారత్ లో విలీనవైునట్లుగా ప్రకటించారు. ఆనాటి నుండి నిజాం ని రంకశ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించింది.

ఈ చా రిత్రక పరిమాణానికి దాశరథిలోని ఆకాంక్ష నెరవేరి, ఆనం దంతో పొంగిపోయాడు. తెలంగాణను ‘తెలంగాణ తల్లి’గా పిలిచిన మొట్టమొదటి కవిగా నిలిచాడు. దాశరథికి అక్షరం ఒక పార్శ్యం అయితే, అక్షరాన్ని ఆయుధంగా మలచుకొని మరో పార్శ్యంలో దర్శణమిస్తారు. అక్షరశిల్పిగా చరిత్రలో తనకంటూ ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించుకొన్నారు. కా లం నా కంఠమాల అని గర్వంగా చెప్పగలిగిన కాలమర్మం తెలిసినవాడు. ఎన్నో కావ్య ఖండికల్ని వెలువరించారు. వాటిని కవులు, పండితులు, కవితా పిపాసులు ఆశ్వాదిస్తే, ఆయన సినిమాల కోసం రాసిన ఆణిముత్యాల్లాంటి పా టలు, పండిత పామరులను రంజింపచేస్తు నేటికి అజరామరమై నిలిచాయి. దాశరథి ‘కవితా పుష్పకం’ గేయ సంపుటికి 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

స్వాతంత్య్ర సమరయోధుడు, దేశభక్తుడు, జాతీయకవి దాశరథిని 1972లో ప్రధాని ఇందిరాగాంధీ తావ్రుపత్రంతో సన్మానిం చారు. ఆయన కవితా సంకనాలు ‘తిమిరంతో సమరం’ కావ్యసంపుటికి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. టంగుటూరి అంజ య్య ప్రభుత్వంతో ఆస్థాన కవిగా పదవిని నిర్వర్తించారు. ఇలా ఎన్నెన్నో పదవులు ఆయనను వరించాయి. దాశరథిని గౌరవ డాక్టరేట్లతో, ఆంధ్ర, ఆగ్రా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు  సన్మానించాయి. ఆ మహాకవి, ఆనాడు నిజామాబాద్ జైలులో శిక్ష అనుభవించిన గది నెంబర్ 8లో ఆయన చిత్రపటాలతోను, గోడల మీద బొగ్గు రాతలను భద్రపరచి సందర్శకుల దర్శనార్థం ఉంచారు. దాశరథి ప్రజాకవిగా, మహాకవిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో ఎల్లవేళలా చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం జీవించే ఉంటారు.

- రావుల పుల్లాచారి
(నేడు దాశరథి జయంతి)

English Title
the two sides of kavithaajhari
Related News