పోలవరంలో అవినీతి లేదు

Updated By ManamThu, 09/20/2018 - 23:26
pullarao


pullaraoగుంటూరు: పోలవరం ప్రాజెక్టు పనులలో అవినీతి జరిగిందనే కథనాలలో వాస్తవం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాగ్ ఇచ్చిన నివేదికలో కేవలం భూసేకరణ జాప్యం వల్లే అంచనా వ్యయం పెరిగిందని తెలిపిందే తప్ప పనులలో అవినీతి జరిగిందని ఎక్కడ తెలుపలేదని వెల్లడించారు. భూసేకరణ జరుపవలసిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం వహించుట వలనే అంచనా వ్యయం పెరిగిందన్నారు. పోలవరం సీఈ ఆ విషయాలను కాగ్‌కు వివరించారని తెలిపారు. వైసీపీ, బీజేపీ విషయాలను వక్రీకరిస్తున్నాయని, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విన్నవించారు. కాంగ్రెస్ హయాంలో పోలవరం హెడ్‌వర్క్స్ అంచనాలు 3527 కోట్లకు పెరిగాయనే విషయాన్ని ప్రతిఒక్కరు గుర్తుంచుకొని మాట్లాడాలన్నారు. ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందంటూ బురద జల్లే ప్రయత్నాలే తప్ప వాస్తవానికి అవినీతి ఏమాత్రం జరుగలేదన్నారు. భూ సేకరణ జాప్యం వల్ల 1331 కోట్లు అంచనా పెరిగిందని, 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి 4054 కోట్లతో పోలవరం పనులు అప్పగించిందని, 2016 నాటికి అంచనావ్యయం 5381 కోట్లకు చేరిందని జాప్యం వల్లే 1331 కోట్ల అంచనావ్యయం పెరిగిందని పేర్కొన్నారు. ఏదిఏమైనా పోలవరం పూర్తిచేయటమే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యుద్దేశ్యం అని, ఈతరుణంలో అడ్డుపడితే అంచనా వ్యయం లక్ష కోట్లకు చేరుతుందని వివరించారు. ప్రాజెక్ట్ అడ్డుకోవాలని కావాలని వైసీపీ, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.

Tags
English Title
There is no corruption in the police
Related News