తెలుగు సీఎంల ఎత్తులు చిత్తు

Updated By ManamTue, 05/15/2018 - 22:46
Laxman
  • మోదీ పథకాలే కర్ణాటకలో గెలిపించాయి

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్.. దేశ రాజకీయాల్లో మలుపు: బండారు

  • రాహుల్ ప్రధానిగా పనికిరారు: కిషన్‌రెడ్డి.. హైదరాబాద్‌లో గెలుపు సంబరాలు

Laxmanహైదరాబాద్: కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు  వేసిన ఎత్తులు చిత్తయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడాన్ని హర్షిస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. బీజేపీ విజయం ఇద్దరు చంద్రులకు చెంపపెట్టు అని విమర్శించారు. కన్నడ గెలుపు తెలంగాణ రాష్ట్రానికి కీలక మలుపుకానుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అవినీతి రహిత పాలన వల్ల కర్ణాటకలో గెలిచామన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకున్న కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్పారని దుయ్యబట్టారు. బీజేపీ ఉత్తరాది పార్టీ, దక్షిణాదిలో ఏమాత్రం ప్రభావం చూపలేదని అన్న వారికి ఈ ఎన్నికలతో కనువిప్పు కలగాలన్నారు. తెలంగాణలో కూడా త్వరలోనే కుటుంబ పాలనకు చరమగీతం పాడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.  కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కాబోయే ప్రధానిగా ప్రకటిం చుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ గెలుపు దేశ రాజకీయాల్లో గొప్ప మలుపన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే కాంగ్రెస్‌ను ప్రజలు తిప్పికొట్టారన్నారు. బీజేపీ శాసన సభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధా నిగా పనికిరారని ప్రజలు తేల్చారన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కమలం పాగా వేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతా సాంబమూర్తి, యెండల లక్ష్మీనారాయణ, బద్దం బాల్‌రెడ్డి, బండి సంజయ్, ఆకుల విజయ, రాకేశ్‌రెడ్డి, సుధాకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

English Title
Telugu cries of scrap
Related News