తెలంగాణను బానిస కానివ్వం

kcr
  • ప్రాణాలు ధారపోసి సాధించుకున్న రాష్ట్రాన్ని కాకులకు, గద్దలకు అప్పజెప్తమా?

  • 100 స్థానాల్లో మా గెలుపు ఖాయం

  • కోటి ఎకరాలను మాగాణంగా మారుస్తం

  • కాంగ్రెస్‌కు అధికార లాలస ఎక్కువ

  • గ్రామీణ ఆర్ధిక పరిపుష్టి జరగాలె

  • నియోజకవర్గంలో ఇండ్లు లేని వారందరికీ డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు

  • ప్రతి ఇంటికి రెండు పాడిగేదెలు, మరో డెయిరీ ఇస్తం

  • గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్

గజ్వేల్: కంఠంలో ప్రాణముండగా తెలంగాణను బానిస కానివ్వనంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ శపథం చేశారు. చావు నోట్లోకి పోయి తెలంగాణ తెచ్చానని, తెచ్చుకున్న తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసుకునేందుకు అవస రమైతే చస్తా అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సొంత నియోజకవర్గమైన సిద్ధ్దిపేట జిల్లా గజ్వేల్ నియోజ కవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. కష్టించి సాధించుకున్న తెలంగాణను కాకులకు, గద్దలకు అప్పజెప్తామా, మేధావులంతా తెలంగాణకు రక్షణ కవచంగా నిలవాలన్నారు. అధికారం పోయిందన్న దౌర్భాగ్యం కాంగ్రెస్‌దైతే, కేసీఆర్ కొరకరాని కొయ్య అయ్యారన్న భావన చంద్రబాబుది.. ఈ రెండు శక్తులు ఒక్కటై తెలంగాణను ఆగం చేయాలని  చూస్తున్నాయని, ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్న తెలంగాణ గడ్డను మళ్లీ వాళ్లకు అప్ప జెప్పేదే లేదన్నారు. గోదావరి నీళ్లు కాలువల ద్వారా ప్రాజెక్టులోకి చేరి ఇక్కడి పొలాలు పండుతాయని ఆశపడితే వద్దని ఉత్తరాలు రాసిన బాబును మోసుకొస్తున్న దద్దన్నలకు బుద్ధి చెప్పాల న్నారు. తెలంగాణను బిస్కట్     
మాదిరిగా ఇవ్వలేదు, త్యాగాలతోనే సాధించుకు న్నాము. కోటి ఎకరాలకు సాగునీరుతో ఆకుపచ్చ తెలం గాణ తయారు చేయాలన్న యజ్ఞం ఆగొద్దు, తెలంగాణ గెలిచి నిలవాలే... నవ్వెటోని ముందు జారిపడొద్దంటూ స్పష్టం చేశారు. ఎన్నికలు అనగానే గాలి గాలి గత్తర కావొద్దని, దాచిదాచి దయ్యాలపాలు చేయద్దన్నారు. నేను నాటిన విత్తనాలు పూలు పూసి కాయలు కాసే సమయం వచ్చిందని కాలువలు నిండాలే, కాళ్లు పండాలే , యావత్ తెలంగాణ పచ్చబడాలన్నదే తమ అభిమతమన్నారు. కృష్ణా నదిలో నీళ్లు లేవని, గోదావరి నీళ్లు పంచుకుందామని ఆంధ్రాబాబు రాహుల్ సాక్షిగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ గొర్రెలు తలలూపుతున్నాయన్నారు. కృష్ణానదిలో నీళ్ల వాటా లేదన్న ఆంధ్రాబాబుకు ఓటుతోనే సమాధానం చెప్పాల న్నారు. తెలంగాణలో తన మాట నిలవాలంటే కీలుబొమ్మ ప్రభుత్వం కావాలని ఆశపడుతున్న బాబుకు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే హక్కుల కోసం పోరాడుతాడు, ఏమీ సాగనీయడనే అక్కసుతో వేలకోట్ల అక్రమ సొమ్ముతో తెలంగాణపై దండయాత్ర చేస్తున్నాడన్నారు. ప్రతి సంవత్సరం కడుపు కట్టుకొని పని చేస్తుండడం మూలంగానే అదనపు ఆదాయం సమకూరుతుందని, ఇసుకపై ఆదాయం గత పదేళ్లలో 9.56 కోట్లు వస్తే నాలుగేండ్లలోనే ఆ మొత్తం 2057 కోట్లకు చేరిందన్నారు. హైకోర్టు విభజన జరనివ్వని, సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న బాబును ఇంకా నమ్మాలా అన్నారు. కాపోడిని కాబట్టే రైతుల బాధలు తెలుసని, పైకి డాంభికంగా ఉన్నా రైతులంతా అప్పుల్లోనే ఉన్నారని, రైతులను సుసంపన్నులుగా చేయాలన్నదే తమ ముందున్న లక్ష్యమన్నారు. అప్పులు పోయి రైతు దగ్గర డబ్బులు నిలువ ఉన్నపుడే బంగారు తెలంగాణ అవుతుందని, ఇది జరగాలంటే గ్రామీణ ఆర్ధిక పరిపుష్టత రావాలన్నారు. మీ ఆశీర్వాదం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం, కేసీఆర్ బతికున్నన్ని రోజులు వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించితీరుతామన్నారు. అసెంబ్లీ సాక్షిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వ అంటే ఒక్కడన్నా రాజీనామా చేసిండా అని ప్రశ్నించారు. మానవీయ కోణంలోనే పెన్షన్‌లను పెంచామని, దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి, ఒంటరి మహిళా పెన్షన్‌లు, బీడి కార్మికులకు పెన్షన్‌లు ఇస్తున్నామన్నారు. ఆరోగ్య తెలంగాణను నిర్మించడంలో వేసిన తొలి అడుగే కంటి వెలుగన్నారు. గజ్వేల్‌లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే ప్రభుత్వంలోకి వస్తుందని దొంగ సర్వేలతో ఆగం కావద్దని, ఎలాగూ విజయం సాధించబోతున్నామని, ఇతరులకు ఓటేస్తే మోరిలో వేసినట్టే లెక్క అన్నారు. అధికార ంలోకి రాగానే గజ్వేల్ నియోజకవర్గంలో ఇండ్లు లేని వారందరికి డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు, ప్రతి ఇంటికి రెండు పాడిగేదెలు, మరో డెయిరీ, అవసరమైతే మండలానికో చిల్లింగ్ సెంటర్ పెట్టుకుందామన్నారు. కాలుష్య రహిత కంపెనీలెన్నో రానున్నాయని, ఫలితంగా ఉద్యోగ అవకాశాలు పెరగబోతున్నాయన్నారు. సమస్యలుంటే మనలోమనమే పరిష్కరించుకుందామని, ఢిల్లీకో, అమరావతికో గులాములు కావద్దన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో బట్టేబాజ్ సర్వేలు చాలా మంది నిర్వహిస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మి మోసపోవద్దని, వంద స్థానాలు సాధించి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్  కేశవరావు, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, గజ్వేల్ మున్సిపల్ ఛైర్మన్ భాస్కర్, కార్పోరేషన్ ఛైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ మళ్లీ గెలవాలని కోరుతూ
నాలుక కోసుకున్న ఆంధ్రా యువకుడు

కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ  ఆంధ్రా యువకుడు ఒకరు నాలుక కోసుకున్నాడు. హైదారాబాద్, బంజారాహిల్స్ లోని ఓ ఆలయ హుండీలో తన నాలుకను వేశాడు.  తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడిని అక్కడి వారు సమీప ఆసుపత్రికి తర లించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ యువకుడిని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేష్‌గా గుర్తించారు.

Tags

సంబంధిత వార్తలు